Errabelli Dayakar Rao jump to BRS :  మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా దయాకర్ రావు పార్టీ మారే అంశంపై జోరుగా ప్రచారం జరుగుతుంది.   దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. హస్తం పార్టీలోని కొంతమంది నేతలు ఎర్రబెల్లి రాకను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆలస్యం అవుతున్నట్లుగా చెబుతున్నారు. ఆయన చేరికను అడ్డుకునేందుకు ఇతర కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 


కాంగ్రెస్ వైపు ఎర్రబెల్లి చూపు 


30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న దయాకర్ రావు తన రాజకీయ ప్రస్థానాన్ని తెలుగుదేశం పార్టీ నుండి ప్రారంభించాడు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఒక సారి ఎంపీగా ఎర్రబెల్లి దయాకర్ రావు విజయం సాధించారు. అయితే ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి ఎంపీగా సైకిల్ గుర్తు పై విజయం సాధిస్తే ఒక్కసారి మాత్రమే కారు గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి బీ అర్ ఎస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. అయితే ఎర్రబెల్లి  మొట్ట మొదటిసారిగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అతి చిన్న వయస్కురాలైన యశస్విని రెడ్డి చేతిలో ఘోర పరాజయం పొందడంతో రాజకీయంగా దయాకర్ రావు ఓటమి పెద్ద చర్చకు దారి తీసింది.


 ఎర్రబెల్లి చేరికకు రేవంత్ గ్రీన్ సిగ్నల్ 


బీ అర్ ఎస్ పార్టీలో కొనసాగుతున్న దయాకర్ రావు ఇప్పుడు పార్టీ మారే యోచనలో ఉన్నారు. ఎర్రబెల్లి ఓటమి చెందడంతో పాటు బీ అర్ ఎస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. రోజు రోజుకు రాష్ట్రం లో బీ అర్ ఎస్ ఖాళీ అవుతుండడంతో దయాకర్ రావు సైతం పార్టీ మారడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఎర్రబెల్లి కాంగ్రెస్ లో చేరేందుకు రూట్ మ్యాప్ క్లియర్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య ఓటుకు నోటు కేసు ఉండడంతో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వార్ నడుస్తుంది. వీరిద్దరి మధ్య ఉన్న వైర్యాన్ని ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి తొలగించినట్లు రాజకీయంగా చర్చ జరుగుతుంది. వేం నరేందర్ రెడ్డి కి తోడు ఎర్రబెల్లి ని కాంగ్రెస్ లోకి తీసుకురావడానికి ఆయన అల్లుడు ఎల్లారెడ్డి పేట ఎమ్మెల్యే మధన్ మోహన్ రావు కూడా రేవంత్ రెడ్డి వద్ద చక్రం తిప్పినట్లు చర్చసాగుతుంది. ఎర్రబెల్లి రాకను రేవంత్ రెడ్డి కూడా స్వాగతించినట్లు సమాచారం. ఎర్రబెల్లి చేరిక నే మిగివుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.


వ్యతిరేకిస్తున్న నేతలు 


ఆయితే ఎర్రబెల్లికి కాంగ్రెస్ అధిష్టానం, రేవంత్ రెడ్డి వద్ద లైన్ క్లియర్ అయినా. జిల్లాలో కావడం లేదని ప్రచారం జోరుగా సాగుతోంది. దయాకర్ రావు పై కోపంతో రాజకీయాల్లోకి వచ్చి  ఓడించిన పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఎర్రబెల్లి కి వ్యతిరేకంగా అమెరికాలో ఉన్న తమను రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఇప్పుడు తమకు వ్యతిరేకంగా ఆయనను పార్టీలోకి తీసుకోవడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు.  ఝాన్సీ రెడ్డి కొద్ది రోజులుగా దిల్లి పెద్దలను కలిసి తన వ్యతిరేకతను తెలిపినట్లుగా తెలుస్తోంది.  ఎర్రబెల్లి దయాకర్ రావు రాకను చిరకాల ప్రత్యర్ధి  కొండా సురేఖ దంపతులు అడ్డుపడుతున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో దయాకర్ రావు ను కాంగ్రెస్ లోకి తీసుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఢిల్లీ పెద్దలకు కొండా దంపతులు చెప్పినట్లు సమాచారం. ఇటు కొండా దంపతులు... అటు ఝాన్సీ రెడ్డి లు వ్యతిరేకిస్తూండటంతో  ఎర్రబెల్లి చేరికకు ఆలస్యం అవుతున్నట్టు కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.


జూలై మొదటి వారంలో చేరికకు ముహుర్తం


అయితే జులై మొదటి వారంలో ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైనట్లు జిల్లా కాంగ్రెస్ వర్గాలు చెప్పకనే చెబుతున్నాయి. దయాకర్ రావు ఓ అడుగు ముందుకేసి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వెళ్లిన నేతలతో కూడా పార్టీలోకి వస్తున్నట్లు మాట్లాడడం జరుగుతుందని పాలకుర్తి నియోజకవర్గం లో జోరుగా ప్రచారం సాగుతుంది. ఎర్రబెల్లి కాంగ్రెస్ పార్టీ లోకి వస్తే ప్రస్తుతం జగిత్యాలలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  వరంగల్ లో జరిగే  అవకాశాలున్నాయి.