Telangana ERC Open Discussion: తెలంగాణ ప్రజలకు ఈఆర్‌సీ గుడ్ న్యూస్ అందించింది. సామాన్యులపై ఎలాంటి విద్యుత్ భారం ఉండబోదని ఈఆర్‌సీ ఛైర్మన్ శ్రీరంగారావు (ERC Chairman Rangarao) తెలిపారు. 800 యూనిట్లు దాటిన వారిపై స్వల్ప ఛార్జీల పెంపు ఉంటుందని చెప్పారు. అటు, ప్రభుత్వం నుంచి డిస్కంలకు రావాల్సిన బకాయిలు సుమారు రూ.25 వేల కోట్లుగా ఉందని.. డిస్కంలు నష్టాలు తగ్గించుకునేందుకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వీలైనంత త్వరగా తీసుకోవాలని సూచించారు. ఎరియర్స్ తొందరగా ఇస్తే.. డిస్కంలు త్వరగా నష్టాల నుంచి బయటపడతాయనే అభిప్రాయపడ్డారు.
రూ.1800 కోట్ల పెంపునకు ప్రతిపాదనలు
దాదాపు రూ.1800 కోట్ల పెంపునకు డిస్కంలు ప్రతిపాదించగా ఆయా ప్రతిపాదనలు ఈఆర్‌సీ తిరస్కరించింది. డిస్కంల వార్షిక టారిఫ్ ప్రతిపాదనలపై సోమవారం ఎర్రగడ్డలోని విద్యుత్ నియంత్రణ భవన్‌లో బహిరంగ విచారణ నిర్వహించింది. ఈఆర్‌సీ ఛైర్మన్ రంగారావు, సభ్యులు బండారు కృష్ణయ్య, మనోహర్‌రాజులు నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. డిస్కంలు ప్రతిపాదించిన ఛార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించామని.. ఛార్జీల్లో ఎలాంటి మార్పులు ఉండవని ప్రకటించారు. అయితే, కొన్ని కేటగిరీల్లో మార్పులతో 0.47 శాతం టారిఫ్ రేట్లు పెరిగాయని తెలిపారు. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలపై భారం పడదని స్పష్టం చేశారు. కొన్ని కేటగిరీ వినియోగదారుల ఫిక్స్‌డ్ ఛార్జీలను పెంచినట్లు చెప్పారు.
విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులు, వినియోగదారులు, ప్రభుత్వ రాయితీలను దృష్టిలో ఉంచుకుని కమిషన్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. 'స్థిర ఛార్జీలు రూ.10 యథాతథంగా ఉంటుంది. నీటి పారుదలకు సంబంధించి టైమ్ ఆఫ్ డే పీక్ అవర్‌లో ఎలాంటి మార్పు లేదు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య.. నాన్ పీక్ అవర్‌లో రాయితీని రూపాయి నుంచి రూపాయిన్నరకు పెంచాం. గృహ వినియోగదారులకు మినిమం ఛార్జీలు తొలగించాం. గ్రిడ్ సపోర్ట్ ఛార్జీలను కమిషన్ ఆమోదించింది. అయితే, ఇవి కేవలం 5 నెలల వరకే ఉంటాయి. పౌల్ట్రీ, గోట్ ఫాంలను కమిషన్ ఆమోదించలేదు. చేనేత కార్మికులకు హార్స్ పవర్ పెంచాం. హెచ్‌పీ 10 నుంచి 25కి పెంచాం.' అని పేర్కొన్నారు.