BJP National President JP Nadda Comments in Narayanapet: తెలంగాణలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ (BJP) పోరాడుతోందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) వ్యాఖ్యానించారు. నారాయణపేట (Naraynpeta), చేవెళ్లలో (Chevella) సకల జనుల సంకల్ప సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ ఎన్నికలు బీజేపీకి, కుటుంబ పార్టీలకు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులను కేసీఆర్ (CM KCR) కుటుంబం దుర్వినియోగం చేసి, ప్రజలకు అందకుండా చేసిందని సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తే సీఎం కేసీఆర్ ఆ ప్రయోజనం ప్రజలకు అందకుండా చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్ కు ఏటీఎంలా మారిందని, ఆ ప్రాజెక్టులోని ఓ బ్రిడ్జి ఇటీవలే కుంగిపోయిందని, బీజేపీ అధికారంలోకి రాగానే, కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపి జైలుకు పంపిస్తామని అన్నారు. బీఆర్ఎస్ అంటే 'భ్రష్టాచార్ రాక్షసుల సమితి' అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.


'బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి మయం'


తెలంగాణ ప్రభుత్వం పూర్తి అవినీతిమయంగా మారిందని జేపీ నడ్డా ఆరోపించారు. 'మియాపూర్ లో రూ.4 వేల కోట్ల భూ కుంభకోణం జరిగింది. సర్కారు భూములు అమ్మి భారీ అవినీతికి పాల్పడ్డారు. దళిత బంధు ఇచ్చిన వారికి ఆ మొత్తంలో ఎమ్మెల్యేలు 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారు. పీఎం ఆవాస్ యోజన కింద నిధులు విడుదల చేస్తే ఆ మొత్తాన్ని పేదలకు చేరనీయలేదు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఫలాలు పేదలకు అందనివ్వడం లేదు.' అని పేర్కొన్నారు. అటు, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం సైతం హామీల అమలులో విఫమైందని, ఇచ్చిన ఒక్క గ్యారెంటీని సైతం అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ 6 గ్యారెంటీలను ప్రజలు అస్సలు నమ్మొద్దని హితవు పలికారు. కేంద్రంలో మోదీ చెప్పిన పనులన్నీ చేశారని, ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్థారించే ఎన్నికలని, ప్రజలు ఆలోచించి బీజేపీకి పట్టం కట్టాలని నడ్డా పిలుపునిచ్చారు.


'బీజేపీని గెలిపిస్తే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు'


ఈ 9 ఏళ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణలో రూ.5 లక్షల కోట్ల నిధులు ఖర్చు చేసిందని జేపీ నడ్డా వివరించారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తే ఉజ్వల్ వినియోగదారులకు ఉచితంగా 4 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. తెలంగాణ చరిత్రలో తొలిసారి బీసీ వ్యక్తిని సీఎంగా చేస్తామని చెప్పారు. వరికి రూ.3,100 మద్దతు ధర, ఎరువుల కోసం రూ.2,100 ఇన్ పుట్ సబ్సిడీ, మహిళా సంఘాలకు 1 శాతం వడ్డీకే రుణాలు, విద్యార్థినులకు ఉచిత ల్యాప్ టాప్స్ అందిస్తామని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గిస్తామన్నారు. వృద్ధులకు ఉచితంగా అయోధ్య రాముని దర్శనం కల్పిస్తామన్నారు. మోదీ పాలనలో భారత్ ప్రపంచంలోనే ఐదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని గుర్తు చేశారు. కుటుంబ పాలనకు స్వస్తి పలికి బీజేపీకి పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


Also Read: Priyanka Gandhi: కేసీఆర్, కేటీఆర్‌కు ఉద్యోగాలిస్తే యువతకు రావు - ఆసిఫాబాద్ సభలో ప్రియాంక