BJP MP Laxman Slams CM KCR on Job Notifications: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ (CM KCR) మోసం చేశారని, ముఖ్యంగా నిరుద్యోగ యువత ఆశలు నీరు గార్చారని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత కె.లక్ష్మణ్ (BJP Leader Laxman) మండిపడ్డారు. హైదరాబాద్ (Hyderabad) లో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువతకు ఇప్పటికీ ఉద్యోగాలు దక్కలేదని, టీఎస్ పీఎస్సీలో 20 లక్షల మంది యువత తమ పేర్లు నమోదు చేసుకుని కొలువుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించినవని, నిరుద్యోగ యువతే దానికి ఊపిరి పోయనున్నారని చెప్పారు. బీఆర్ఎస్ కు ఓటు వేసేందుకు ఏ వర్గం సిద్ధంగా లేదని, సీఎం కేసీఆర్ ఉద్యోగం ఊడిపోవడం ఖాయమన్నారు.
'ఉద్యోగాల పేరుతో మోసం చేశారు'
తెలంగాణలో వివిధ శాఖల్లో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనే విషయాన్ని పీఆర్సీ నివేదిక స్పష్టం చేసిందిన కె.లక్ష్మణ్ వివరించారు. 'ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్క గ్రూప్ - 1 నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. డీఎస్సీ ప్రకటించక ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ కాక బడులు మూతపడే దుస్థితి నెలకొంది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామన్న హామీ నెరవేర్చలేదు. మిషన్ భగీరథ, హార్టికల్చర్, ఇతర శాఖల్లో కాంట్రాక్ట్ తీరిపోయిందనే నెపంతో దాదాపు 10 వేల మందిని ఉద్యోగం నుంచి తొలగించారు. 2014 నుంచి 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ఏర్పడినప్పుడు ఎన్ని ఖాళీలున్నాయో వెల్లడించడం లేదు. 2018లో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారు. బడ్జెట్ లో ప్రస్తావించినా ఎవరికీ ఇచ్చిన దాఖలాలు లేవు.' అని లక్ష్మణ్ మండిపడ్డారు.
'ఉద్యమ ఆకాంక్ష నెరవేరలేదు'
నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేరలేదని కె.లక్ష్మణ్ అన్నారు. సీఎం కేసీఆర్ రాజకీయ పరమైన ఉద్యోగాలు మాత్రమే క్రమబద్ధీకరించుకున్నారని, కేసీఆర్ కుమార్తె కవితను ప్రజలు ఓడగొడితే ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఇవ్వని బీఆర్ఎస్ కు ఎందుకు ఓటెయ్యాలని తెలంగాణలో నిరుద్యోగ యువత ప్రశ్నిస్తోందన్నారు. నిరుద్యోగ యువత, తల్లిదండ్రులు ఆలోచించాలని, ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్ ప్రభుత్వం పోవాలని పిలుపునిచ్చారు. 'రూ.2 వేల పింఛన్ కావాలా? మీ పిల్లలకు రూ.50 వేల జీతాలు కావాలా?' అని ప్రశ్నించారు. కేసీఆర్ ను ఓటు ద్వారా రద్దు చేయకుంటే పరీక్షలు రద్దవుతూనే ఉంటాయని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం కొత్త రేషన్ కార్డులు ఇస్తామంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలని, బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
అమిత్ షా పర్యటన
మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు లక్ష్మణ్ తెలిపారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు అమిత్ షా బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 11:30 గంటలకు బేగంపేటలోని ఐటీసీ కాకతీయకు చేరుకుని రాత్రికి బస చేస్తారు. శనివారం ఉదయం 10:30 గంటలకు బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసి, మధ్యాహ్నం 12:45 గంటల నుంచి 01:20 గంటల వరకు గద్వాల్ సభలో పాల్గొంటారని వెల్లడించారు. 2 రోజుల పర్యటనలో భాగంగా అమిత్ షా వరంగల్, మెదక్ సభల్లోనూ పాల్గొంటారని చెప్పారు.
Also Read: Bandi Sanjay: వారు మసీదుకు వెళ్లి రాముడ్నే మొక్కుతారు - బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు