ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో నేడు పలువురు ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వచ్చే నెలాఖరులో ఎన్నికలు ఉన్నందున పార్టీ మారడం బాగా ఊపందుకుంది. గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లిన వారు కూడా నేడు మళ్లీ సొంత గూటికి చేరారు.


ఢిల్లీలో టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ చేరికల కార్యక్రమంలో పాల్గొన్నారు. నేడు కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మోత్కుపల్లి నరసింహులు, నేతి విద్యాసాగర్ రావు, ఏనుగు రవీందర్ రెడ్డి, కపిలవాయి దిలీప్ కుమార్, ఆకుల లలిత, నీలం మధు ముదిరాజ్ తోపాటు పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.


ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈయన గతేడాది ఇదే సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడం వల్ల ఉప ఎన్నిక వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందిస్తూ.. తాను తప్పు చేశానని అన్నారు. అది సరిదిద్దుకునేందుకే తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కేసీఆర్‌ను ఓడించడమే తన ఏకైక లక్ష్యం అని, బీజేపీలోకి వెళ్లినా, కాంగ్రెస్ పార్టీలో చేరినా కేసీఆర్‌ను అధికారం నుంచి తొలగించడమే తన లక్ష్యమని అన్నారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకుంటుందనే ఆ పార్టీలో చేరినట్లు చెప్పారు.


చర్యలు లేకపోగా, ఆ రెండు పార్టీలు అంతర్గతంగా మిత్రులుగా ఉండడంతో బయటకు వచ్చానని అన్నారు. బీజేపీలో తనకు గౌరవం, ప్రాధాన్యత ఇచ్చారు కానీ, తన లక్ష్యం నెరవేరలేదని అన్నారు. హంగ్ వస్తే బీజేపీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తారని.. బీజేపీకి ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు ఓటు వేసినట్లేనని విమర్శించారు. ప్రజలు తాను కాంగ్రెస్‌లోకి రావాలని కోరుకుంటున్నారని అన్నారు. సర్వేలు అన్ని తనకే అనుకూలంగా ఉన్నాయని అన్నారు.