Telangana Elections: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకావడంతో వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు విషయాలపై క్లారిటీ ఇచ్చారు. నేడు ఎన్నికల నోటిఫికేషన్ గెజిట్ జారీతో నామినేషన్ల ప్రక్రియ మొదలైందన్నారు. అభ్యర్థులు ఒక్కో స్థానం నుంచి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేసుకోవచ్చని, సెక్యూరిటీ డిపాజిట్ మాత్రం ఒక్క దానికే చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అభ్యర్థులు గరిష్టంగా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయవచ్చునని పేర్కొన్నారు. ఆదివారం మినహా మిగతా రోజుల్లో నామినేషన్లను స్వీకరిస్తామని, ఎన్నికల్లో నామినేషన్ వేసేవారు అన్ని కాలమ్స్‌ను తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచించారు. ఈ నెల 10 తర్వాత ఓటర్ స్లిప్పులను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 2 వేల పోలింగ్ కేంద్రాలను సిద్దం చేస్తున్నామని, ఓటింగ్ శాతాన్ని పెంచేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. 


ఇప్పటివరకు పోలీసుల తనిఖీల్లో రూ.453 కోట్ల విలువైన సొమ్ము పట్టుబడినట్లు వికాస్ రాజ్ వివరించారు. సి విజిల్ యాప్ ద్వారా 2,487 ఫిర్యాదులు వచ్చాయని, వీటిపై చర్యలు తీసుకుంటున్నట్లు వికాస్ రాజ్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 205 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, స్వాధీనం చేసుకున్న నగదుకు ఆధారాలు ఉంటే జల్లా కమిటీల ద్వారా వెంటనే విడుదల చేస్తున్నామన్నారు. ఇక ఇప్పటివరకు ఎన్నికల నిబంధనలకు సంబంధించి 362 కేసులు, 256 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు వెల్లడించారు. సామాన్యులకు ఇబ్బంది లేకుండానే తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు.


నవంబర్ 30న మావోయిస్టు ప్రాబల్యం ఉండే  13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుందని, మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందని వికాస్ రాజ్ తెలిపారు. ఇక అక్టోబర్ 31 నుంచి ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నవారి అప్లికేషన్లను నవంబర్ 10లోపు పూర్తి చేస్తామన్నారు. ఆ తర్వాత ఓటర్ ఇన్‌ఫర్మేషన్ ఆధారంగా స్లిప్పులు ముందుగా పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఓటింగ్ శాతం పెరిగేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఓటింగ్ శాతం తగ్గుతుందని వివరించారు. అర్బన్ ఏరియాల్లో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సారి రాష్ట్రంలో కొత్తగా 9.10 లక్షల మంది యువత ఓటు నమోదు చేసుకున్నారని, వారిని ఆకట్టుకునేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.


ఇక పోలింగ్ కేంద్రాల వద్ద వృద్దులు, వికలాంగుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 18 వేల వీల్ ఛైర్లు ఏర్పాటు చేస్తామని వికాస్ రాజ్ తెలిపారు. నవంబర్ రెండో తేదీ వరకు ఓటర్ల సంఖ్య 3,21,88,753గా ఉందన్నారు. అలాగే పోలింగ్ రోజు పటిష్ట భద్రత ఏర్పాటు చేయనున్నామని, ఇప్పటికే 375 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకున్నాయన్నారు. అటు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, స్పెషల్ ఇంటెలిజెన్స్ టీమ్‌లను రంగంలోకి దింపామన్నారు. ఇప్పటివరకు 137 ఎంపీసీ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయన్నారు. అలాగే కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 13, బీజేపీ 5, బీఎస్పీ3 అనుమానిత కేసులు ఉన్నాయన్నారు. ఇక రైతుబంధు నగదు జమకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని వికాస్ రాజ్ పేర్కొన్నారు.