Telangana Elections 2023 : ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కామారెడ్డిలో బహిరంగసభలో ప్రసంగించారు. తొమ్మిదేళ్ల వారి పాలనపై ప్రజలు విసిగిపోయారు. ఇక్కడి ప్రజలు బీఆర్ఎస్ నుంచి విముక్తి కోరుతున్నారని ప్రకటించారు. ఈసారి తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మా విధానాలు ఉన్నాయని మోదీ ప్రకటించారు.
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు !
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. తెలంగాణ రైతుల కష్టాలు బీఆర్‌ఎస్‌కు పట్టడం లేదు. నీటి ప్రాజెక్టులు అవినీతితో నిండిపోయాయి. రైతుల సంక్షేమం కోసమే బీజేపీ ప్రాధాన్యతనిస్తుంది. ప్రాజెక్ట్‌ల నిర్మాణం బీఆర్‌ఎస్‌కు ఏటీఎంలా మారింది. తెలంగాణ రైతుల కోసం బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలని నిర్ణయించాం. తెలంగాణ అభివృద్ధికి ఖర్చు కావాల్సిన డబ్బులు బీఆర్‌ఎస్ నేతల జేబుల్లోకి వెళ్తున్నాయి. రైతులకు అదనంగా ఆదాయం వచ్చేందుకు కృషి చేస్తున్నాం. పథకాలన్నీ బీఆర్‌ఎస్‌కు ఏటీఎంలా మారాయి. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతను బీఆర్‌ఎస్ మోసం చేసింది. పేపర్ లీకేజీలతో నిరుద్యోగ యువత దగా పడ్డారని విమర్శించారు.
నా మాటలే గ్యారంటీ
నేను ఇచ్చే మాటలే గ్యారంటీ. దేశానికి బీసీని ప్రధాని చేసింది కూడా బీజేపీనే. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకుంటాం. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎవరికి ఎప్పుడు డబ్బులు అవసరమైనా అప్పుడు నీటి పారుదల పథకాలు పెట్టుకున్నారు. ప్రజాధనం అంతా కేసీఆర్ కుటుంబ సభ్యుల జేబుల్లోకి వెళ్ళిందని మోదీ అన్నారు. .'పేరు మారినంత మాత్రాన వీరి బుద్ధి మారదు. యూపీఏ ఇండియా కూటమిగా మారింది. టీఆర్‌ఎస్ హఠాత్తుగా బీఆర్‌ఎస్‌గా మారింది. ఇండియా కూటమి అంటూ మళ్లీ మోసం చేసేందుకు జతకట్టారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వారి పిల్లల కోసం చూసుకుంటారు. బీజేపీ మాత్రం ప్రజల పిల్లల కోసం ఆలోచిస్తుందన్నారు.
ఓడిపోతామన్న భయంతోనే కేసీఆర్, రేవంత్ రెండు చోట్ల పోటీ
కేసీఆర్, రేవంత్ ఇద్దరూ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు. కామారెడ్డి ప్రజలకు మంచి అవకాశం వచ్చింది. అవినీతి, కుటుంబ పాలనను ఓడించే అవకాశం వచ్చింది. ఆ ఇద్దరూ తమ నియోజకవర్గాల్లో ఓడిపోతామని తెలిసే రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో విజయ కోసం ఈ రెండు పార్టీలు కుట్రలు పన్నుతారన్నారు. బీఆర్‌ఎస్ నుంచి తెలంగాణకు విముక్తి లభించాలి. బీఆర్‌ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారు. ఇచ్చిన హమీలను నిలబెట్టుకుంటున్నాం. బీజేపీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని మోదీ భరోసా ఇచ్చారు.
బీసీని ముఖ్యమంత్రిని చేసి తీరుతాం !
ఎస్సీ వర్గీకరణకు మద్దతు ప్రకటించాం. తెలంగాణలో మాదిగ సమాజానికి తీరని అన్యాయం జరిగిందని... ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీని వేశాం. బీఆర్‌ఎస్ దళితుడిని సీఎంని చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకుంది. తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పింది. గ్యారంటీలను పూర్తి చేయడమే మోదీ గ్యారంటీ. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని మాట ఇచ్చాం. సీఎంను చేసి తీరుతామని మోదీ ప్రకటించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ బీసీల కోసం ఏం చేయలేవన్నారు. ప్రధాని నరేంద్ర ఆదివారం, సోమవారం కూడా ప్రచారం నిర్వహించనున్నారు.