Telangana Elections 2023 :   కేటీఆర్ ప్రచార శైలి మారిపోయింది. కేసీఆర్, హరీష్ రావు బహిరంగసభలకు ప్రాధాన్యం ఇస్తూండగా కేటీఆర్ మాత్రం వివిధ వర్గాలతో  ముఖాముఖి సమావేశం అయ్యేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వంపై అసంతృప్తి ఉందని భావిస్తున్న వివిధ వర్గాల్లో ఉన్న అనుమానాలను నివృతి చేసేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. 


నిరుద్యోగులతో చర్చ నుంచి మెట్రో రైల్ ప్రయాణం వరకూ !                      
 
కేటీఆర్ మెట్రోరైల్‌లో రాయదుర్గం నుంచి బేగంపేట వరకూ ప్రయాణించటం ద్వారా ప్రయాణీకులతో ముచ్చటించారు. ఐటీ ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు, యువతీ యువకులతో ఆయన మాటా మంతీ జరిపారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో ఆటో యూనియన్‌ నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం వివిధ పత్రికాధిపతులు, సంపాదకులతో ఆయన ఇష్టాగోష్టి నిర్వహించారు.  ప్రస్తుత ఎన్నికలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. సూచనలు, సలహాలను స్వీకరించారు. క్రెడాయ్  ఆధ్వర్యాన నిర్వహించిన సమావేశంలో రియల్‌ ఎస్టేటర్లతో ఆయన భేటీ అయ్యారు. అంతకు ముందు నిరుద్యోగులతో టీ హబ్ లో చర్చలు జరిపారు. ఇలాంటి కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు. పాతబస్తీలో హోటల్ కు వెళ్లారు. ఇలా  కేటీఆర్   ప్రచారంలో కొత్త ఒరవడి సృష్టించటం గులాబీ శ్రేణుల్లో జోష్‌ నింపుతోంది.



ఏ వర్గంలో అసంతృప్తి ఉందని భావిస్తున్నారో వారితో ప్రత్యేక భేటీలు                       


ప్రస్తుత ఎన్నికల్లో కారుకు ప్రతికూల పరిస్థితులు ఎదురు కాబోతున్నాయని భావిస్తున్నందున.. ముఖ్యంగా ప్రజల్లో మార్పు అనే ఆలోచన ఉందన్న అభిప్రాయం వినిపిస్తూండటంతో  రిస్క్ వద్దన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నారు.  అందుకే అందరితోనూ సమాలోచనలు, సంప్రదింపులు జరుపుతున్నారనే అభిప్రాయాలూ వినబడుతున్నాయి. ఇలాంటి భేటీలు నిర్వహించటం ద్వారా తమ ప్రభుత్వ వైఫల్యాలను, పార్టీ బలహీనతలను తెలుసుకునేందుకు కేటీఆర్‌ ప్రయత్నిస్తున్నారని అంచనా వేస్తున్నారు. 


ముందే సోషల్ మీడియాలో వైరల్ ప్రచారం                      
 
ప్రచారం ప్రారంభించిన కొత్తలో  యూట్యూబ్‌లో తమ మాటలు, పాటలు, యాసల ద్వారా ఫేమస్‌ అయిన గంగవ్వతో ఆడి పాడటం, ఛారు కేఫ్‌ల్లో సరాదాగా గడపటం, బిర్యానీ సెంటర్లలో యువతతో కలిసి ఆహారాన్ని ఆస్వాదించటం తదితరాంశాలతో అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకున్న ఆయన… తర్వాత ముఖాముఖిల ద్వారా మాట్లాడుతున్నారు. కొంత మంది సినిమా హీరోలతో ఇంటర్యూలు కూడా నిర్వహించారని కానీ వాటిని ప్రస్తుత పరిస్థితుల్లో విడుదల చేయకపోవడమే మంచిదని భావిస్తున్నట్లుగా తెల్సతోంది.                           


ఈ క్రమంలో తమకెదురవుతున్న ప్రతికూల పరిస్థితుల్లోంచి వచ్చిన ఆందోళనను తట్టుకునేందుకు, ఆ రకంగా క్యాడర్‌ను అప్రమత్తం చేసేందుకు కేటీఆర్ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నారు.                 


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply