KTR Tweet on Deep Fake Videos in Election Campaign: తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఆయా పార్టీల నేతలు ప్రజల్లోకి తమ మేనిఫెస్టో, హామీలను విస్తృతంగా తీసుకెళ్తున్నారు. అలాగే, ప్రత్యర్థి పార్టీలపైనా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలు, ర్యాలీలు, కార్నర్ మీటింగ్స్ వంటి వాటి ద్వారానే కాకుండా సోషల్ మీడియాను సైతం విస్తృతంగా వినియోగిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష అగ్ర నేతల మధ్య 'ఆరోపణలు, ప్రత్యారోపణల' జోరు కనిపిస్తోంది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ (Minister KTR) బీఆర్ఎస్ (BRS) శ్రేణులు, అభిమానులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఓటమి అంచున ఉన్న కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీపై డీప్ ఫేక్ వీడియోలు (Deep Fake Videos) రావొచ్చని చెప్పారు. 'ఎన్నికలకు కొద్ది రోజుల సమయమే ఉంది. స్కామ్ గ్రెస్ స్కామర్ల నుంచి రానున్న 4, 5 రోజుల్లో అనేక తప్పుడు/డీప్ ఫేక్ వీడియోలు రావొచ్చు. ఎవరో మోసపూరిత వలలో చిక్కుకోవద్దు. ఫేక్ వార్తలు ప్రచారం చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ సైనికులు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వాటి పట్ల ఓటర్లను చైతన్యం చేయాలి.' అని ట్విట్టర్ వేదికగా సూచించారు.
గత కొద్ది రోజులుగా డీప్ ఫేక్ పై చర్చ
కాగా, గత కొద్ది రోజులుగా డీప్ ఫేక్ వీడియోల దుర్వినియోగంపై చర్చ నడుస్తోంది. ఇటీవల కొందరు సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు వైరల్ గా మారాయి. దేశవ్యాప్తంగా దీనిపై ఆందోళన రేకెత్తుతున్న తరుణంలో, కేంద్రం చర్యలు సైతం చేపట్టింది. ఇలాంటి కంటెంట్ పెట్టిన వాళ్లపై చర్యలు తీసుకునేందుకు స్పెషల్ ఆఫీసర్‌ని నియమిస్తామని, త్వరలోనే ఓ వెబ్‌సైట్ లాంఛ్ చేస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా వెల్లడించారు., నిబంధనలు అతిక్రమించి కంటెంట్ పెట్టిన వారిపై, అలాంటి కంటెంట్ కంటపడినా ఆ సైట్ లో ఫిర్యాదు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అయితే, తెలంగాణ ఎన్నికల్లోనూ ఆ తరహా కంటెంట్ వైరల్ కావొచ్చంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
అసలేంటీ డీప్ ఫేక్.?
డీప్ ఫేక్ టెక్నాలజీ, కృత్రిమ మేథని ఉపయోగించి ఎవరిదైనా నకిలీ పోటో తయారు చేస్తుంది. ఇందులో ఏదైనా ఫొటో, వీడియో, ఆడియోను నకిలీగా చూపించడానికి డీప్ లెర్నింగ్ అనే ఏఐని వాడతారు. ఈ టెక్నాలజీతో ఎవరి ఫోటో అయినా, ఎలాంటి వీడియో అయినా మార్ఫింగ్ చెయ్యొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీ ద్వారా కేవలం 4 సెకన్ల ఒరిజినల్ ఆడియోతో ఫుల్ ఆడియోను రూపొందిస్తారని చెబుతున్నారు. అలాంటి వీడియోలు, ఇమేజ్ లు గుర్తించడం కూడా కష్టమని పేర్కొంటున్నారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply
Also Read: Foreign Direct Investments: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు - తెలుగు రాష్ట్రాల స్థానమిదే