KCR On Kasani :  టీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్ ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు.  పరిమిత సంఖ్యలో అనుచరులతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయనకు గోషామహల్ టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం జరిగుతోంది కానీ కేసీఆర్ అలాంటి ప్రకటన ఏమీ చేయలేదు. కానీ ముదిరాజులకు తర్వాత ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్సీ, రాజ్యసభ, నామినేటెడ్ పోస్టులు ఇస్తామన్నారు.            


తమాషాకు అభ్యర్థుల్ని నిలబెట్టలేం !


ముదిరాజ్‌లకు వృత్తి పరంగా అన్యాయం జరిగిందని కేసీఆర్ అన్నారు.  మొత్తం జాబితాలో ఒక్క ముదిరాజ్ అభ్యర్థికి కూడా  చోటు ఇవ్వకపోవడాన్ని కేసీఆర్ సమర్థించుకున్నారు. తెలంగాణలో ఉన్నది 119సీట్లే అయినా... మన లెక్కలోకి 112  మాత్రమే వస్తాయన్నారు. అంటే కేసీఆర్ ఉద్దేశంలో పాతబస్తీలోని ఏడు సీట్లు మజ్లిస్ ఖాతాలోకి వెళ్తాయి కాబట్టి అక్కడ ఎవర్ని అభ్యర్థిగా నిలబెట్టినా ప్రయోజనం ఉండదు. అందుకే.. తమాషాకి అభ్యర్థుల్ని నిలబెట్టలేమని.. నిలబెడితే గెలవాలని కేసీఆర్ అన్నారు. ఎన్నికల తర్వాత ముదిరాజులతో సమావేశం అవుతానని హామీ ఇచ్చారు. 


ముదిరాజులకు రాజ్యసభ , ఎమ్మెల్సీ, నామినేటెడ్ పోస్టులు 


ముదిరాజ్ వర్గానికి రాజ్యసభ, ఎమ్మెల్సీ, నామినేటెడ్ పోస్టులు ఎక్కువగా ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. గ్రామాల్లో  ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈటెల రాజేందర్ కన్నా పెద్ద మనిషి కాసాని జ్ఞానేశ్వర్ మన పార్టీలోకి వచ్చారని..  రాజ్యసభ ఎమ్మెల్సీ పదవులు ముదిరాజ్ లకు వస్తాయని భరోసా ఇచ్చారు.  ముదిరాజ్ ల నుండి ఎక్కువ సంఖ్యలో నాయకులు తయారు అవ్వాల్సి ఉందన్నారు.  నామినేటెడ్ పదవుల్లో ముదిరాజ్ లకు పెద్ద పీట  వేస్తామన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ముదిరాజ్‌ల వర్గం నుంచి  ఈటల ఎవరిని ఎదగనివ్వలేదని ఆరోపించారు. అప్పటికీ  బండ ప్రకాష్ ని తీసుకొచ్చి పదవులు ఇచ్చామమని గుర్తు చేసుకున్నారు.  రాజ‌కీయంగా రాబోయే రోజుల్లో చాలా ప‌ద‌వులు ఉంటాయి. చాలా అవ‌కాశాలు ఉంటాయి. ముదిరాజ్ సామాజిక వ‌ర్గం పెద్ద‌ది కాబ‌ట్టి ఆ వ‌ర్గం నుంచి మ‌నం నాయకుల‌ను త‌యారు చేసుకోవాలి. జిల్లాకు ఒక‌రిద్ద‌రిని త‌యారు చేసుకుంటే పార్ల‌మెంట్‌కు పెట్టుకోవ‌చ్చు.. అసెంబ్లీకి పెట్టుకోవ‌చ్చు. ఎమ్మెల్సీలు కూడా కావొచ్చు.. అలా చాలా అవ‌కాశాలు ఉంటాయని హామీ ఇచ్చారు. 


కాసానికి రాజ్యసభ ఆఫర్ !?


పార్టీలో చేరిన కాసాని జ్ఞానేశ్వర్‌కు కేసీఆర్ రాజ్యసభ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నుంచి టిక్కెట్ ఇస్తారని ప్రచారం జరిగినా అక్కడ మజ్లిస్ చాయిస్ మేరకు అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంటుంది కాబట్టి పరిగణనలోకి తీసుకోలేదని చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి చాన్స్ ఇస్తారన్న ప్రచారమూ జరిగిది. అయితే కేసీఆర్ రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవుల గురించి చెప్పడంతో.. అలాంటి ప దవి ఇస్తారని భావిస్తున్నారు.  ఎన్నికల్లో పోటీ చేసే వారిలో ఒక్క ముదిరాజ్ నేతకు కూడా టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆ వర్గంలో బీఆర్ఎస్ పై అసంతృప్తి ఏర్పడిందని ప్రచారం జరిగింది. దీంతో ముదిరాజ్ వర్గీయుల్లో ప్రముఖులను పార్టీలో చేర్చుకుంటున్నారు.