CM KCR Comments in Khanapur Meeting: తెలంగాణలో గత పదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలని సీఎం కేసీఆర్ (CM KCR) పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ (Khanapur)లో ఆదివారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ (Congress) దరిద్రాన్ని పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పోగొట్టామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో సంక్షేమం ఎలా ఉందో, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలా ఉందో ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు. అభ్యర్థులు, వారి వెనుక పార్టీ, వారు చేసిన మంచి అంతా గమనించాలని, గ్రామాల్లో ప్రజలంతా చర్చించి తమ ఓటును సక్రమంగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 


'సంపదను పెంచుతున్నాం'


రాష్ట్రంలో సంపదను పెంచి సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. 'పేదలు, వృద్ధులకు పింఛన్లు అందిస్తున్నాం. బీఆర్ఎస్ పాలనలో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాం. పదేళ్లలో రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టాం. రైతు బంధు అందిస్తున్నాం. 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం. ఇంటింటికీ తాగునీరు, కంటి వెలుగు వంటి పథకాలు అమలుతో ఆదర్శంగా నిలిచాం. అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఉంది.' అని కేసీఆర్ వివరించారు. 'మళ్లీ అధికారంలోకి వస్తే పెన్షన్ రూ.5 వేలకు పెంచుతాం. చరిత్రలో ఏ కాంగ్రెస్ సీఎం చేయని విధంగా పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధి సాధించాం. ఆడబిడ్డ పెళ్లి కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ రూపంలో రూ.లక్ష ఇస్తున్నాం. ప్రభుత్వ వైద్య శాలలను గొప్పగా మార్చాం. చేనేత కార్మికులు, గీత కార్మికులు, గంగ పుత్రులు ఇలా అన్ని వర్గాలకు సంక్షేమం అందేలా చర్యలు చేపట్టాం.' అని పేర్కొన్నారు.


'ధరణికి దండం పెడతారు'


కాంగ్రెస్ అధికారంలోకి  వస్తే ధరణి పోర్టల్ తీసేస్తామని అంటున్నారని, అదే జరిగితే ప్రజలు దెబ్బ తింటారని కేసీఆర్ హెచ్చరించారు. వారికి అధికారం ఇస్తే ధరణికి దండం పెడతారని, తద్వారా లంచాలు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఓ రైతుగా తనకూ అన్నదాతల బాధలు తెలుసన్న ఆయన, వారి కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టామని, వరిని పండిచండంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. గతంలో తెలంగాణను ఏపీలో కలిపింది కాంగ్రెస్ పార్టీయేనని సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని తెలిపారు. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటున్నారని, రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ నేత ఉత్తమ్ అంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో కనీసం తాగునీరు కూడా ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఈ అభివృద్ధి అంతా గమనించి బీఆర్ఎస్ కు ఓటేసి మళ్లీ అధికారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply


Also Read: Kalvakuntla Kavitha: రాహుల్ గాంధీ వచ్చి బిర్యాని, పాన్ తిని ఢిల్లీకి పోతారు - కవిత ఎద్దేవా