Telangana Elections 2023 :  సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. . సిర్పూర్ కాగజ్ నగర్ సభ ముగించుకుని.. ఆసిఫాబాద్ బయలుదేరారు. హెలికాఫ్టర్ ఎక్కి.. అందులో కూర్చున్నారు సీఎం కేసీఆర్, ఇతర సిబ్బంది. అయితే ఐదు నిమిషాల తర్వాత కూడా హెలికాఫ్టర్ గాల్లోకి లేవలేదు. దీంతో పైలెట్, ఇతర సిబ్బంది పరిశీలించగా.. హెలికాప్టర్ లో సాంకేతిక లోపం ఉందని.. సరిచేసేందుకు సమయం పడుతుందని వివరించారు. ఆసిఫాబాద్ సభకు.. సీఎం కేసీఆర్ తన కాన్వాయ్ బస్సులోనే వెళ్లారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర నేతలు ఉన్నారు.                       


సీఎం కేసీఆర్ ప్రయాణించే హెలికాప్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడడం.. ఇది రెండోసారి. మొన్నటికి మొన్న దేవరకద్రకు ఇలాగే హెలికాఫ్టర్ లో బయలుదేరారు. గాల్లో ఉండగానే.. టెక్నికల్ సమస్య వచ్చింది. దీంతో పైలెట్ హెలికాఫ్టర్ ను తిరిగి ఎర్రవల్లి ఫాంహౌస్ లో సురక్షితంగా ల్యాండ్ చేశారు.  మూడు రోజుల్లోనే రెండుసార్లు సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తటం ఆందోళన కలిగించే అంశం. అసలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ బిజీగా ఉన్న కేసీఆర్ కు ఇలాంటి సమస్యలు ఇబ్బంది కరంగా మారాయి.             


ఎన్నికల సమయం కావడంతో హెలికాఫ్టర్లకు ఫుల్ డిమాండ్ ఉంది. ఒక్కో రాజకీయ పార్టీ పూర్తి స్థాయిలో నాలుగైదు హెలికాఫ్టర్లు అద్దెకు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తో పాటు కేటీఆర్ కోసం కూడా హెలికాఫ్టర్లను అద్దెకు తీసుకున్నారు. కేసీఆర్ కు రెండు హెలికాఫ్టర్లు అందుబాటులో ఉంటున్నాయి. అయితే రెండు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దగ్గర ఉంటాయి.  అక్కడ సమస్య వస్తే వెంటనే మరో హెలికాఫ్టర్ లో వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ అసలు సమస్య... సిర్పూర్ లో రావడంతో రోడ్డు మార్గం ద్వారా కేసీఆర్ ఇసిఫాబాద్  వెళ్లారు.                                                       


బీడేపీ, కాంగ్రెస్ నేతలు కూడా హెలికాఫ్టర్లు ఉపయోగిస్తున్నారు. బీజేపీ తరపున  హైకమాండ్ మూడు హెలికాఫ్టర్లు తెలంగాణకు కేటాయిచింది. బండి సంజయ్ కు ప్రత్యేకగా ఓ హెలికాఫ్టర్ కేటాయించారు. అలాగే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఒకటి.. ఇతర స్టార్ క్యాంపెయినర్ల కోసం మరొకటి కేటాయించారు. తలంగాణ కాంగ్రెస్ కు కూడా ఆ పార్టీ హైకమాండ్ రెండు హెలికాఫ్టర్లు కేటాయించినట్లుగా తెలుస్తోంది. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా  తిరిగి విస్తృతంగా  ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే వారెవరికీ రానీ సాంకేతిక సమస్యలు కేసీఆర్ హెలికాఫ్టర్లకే వస్తున్నాయి. అయినా కేసీఆర్ ప్రచారం ఎక్కడా ఆపడం లేదు