Telangana CEO Vikas Raj about Rythu Bandhu:


హైదరాబాద్: సామాన్యులకు ఇబ్బందులు లేకుండానే ఉండేలా ఎన్నికల మార్గదర్శకాలు ఉన్నాయని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రలోభాలను కట్టడి చేయాలన్నదే ఎలక్షన్ కమిషన్ ధ్యేయమన్నారు. రెవెన్యూ ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా అధికారులు, పోలీసులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటున్నారని సీఈవో తెలిపారు. రైతు బంధు ఇవ్వడం కోసం కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాలేదని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. రైతు బంధు ఆపాలని సైతం ఎవరి నుంచి తమకు ఫిర్యాదులు ఇప్పటివరకూ అందలేదని చెప్పారు. దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి విషయంపై స్పందించారు. ఇలా దాడులు చేయడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ ఎంపీపై దాడి విషయంలో పోలీసుల నుంచి ఈసీకి నివేదిక వచ్చిందని తెలిపారు. ఎన్నికల బరిలో దిగుతున్న అభ్యర్థుల తమ భద్రతకు సంబధించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.


తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ మొదలైందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఆయన శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ప్రజలు నియమాలు పాటించాలని కోరారు. అభ్యర్థులు నేటి నుంచి నవంబర్ 10 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చునని, ఆదివారం సెలవు అని తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి పోటీలో భాగంగా అభ్యర్థులు ఎవరైనా గరిష్టంగా 4 సెట్లు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చునని, ఒక్క సెట్ ధర చెల్లించాల్సి ఉందన్నారు. అభ్యర్థులు గరిష్టంగా 2 చోట్ల నుంచి మాత్రమే పోటీ చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. అభ్యర్థులు ఎలక్షన్ అఫిడవిట్‌లో అన్ని కాలమ్స్ తప్పనిసరిగా నింపాలని సీఈవో స్పష్టం చేశారు.


ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు (Election Code Violation) సంబంధించి ఇప్పటి వరకు 1,037 కేసులు నమోదైనట్లు వికాస్ రాజ్ తెలిపారు. వీటిలో 13 కేసులు బీఆర్ఎస్, 16 కాంగ్రెస్, 5 బీజేపీ, 3 బీఎస్పీ సంబంధిత కేసులు ఉన్నాయని వెల్లడించారు. సీ విజిల్ యాప్ ద్వారా ఇప్పటి వరకు 2,487 ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. ప్రగతిభవన్‌లో బీ ఫారం ఇచ్చారనే ఫిర్యాదుకు సంబంధించిన నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపినట్లు ఆయన తెలిపారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ఎన్నికల ప్రచారాన్ని చేయాలని నేతలకు సూచించారు.


ఇప్పటికే 2 వేల పోలింగ్ కేంద్రాలను సిద్దం చేస్తున్నామని, ఓటింగ్ శాతాన్ని పెంచేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు వికాస్ రాజ్ తెలిపారు. ఇప్పటివరకు పోలీసుల తనిఖీల్లో రూ.453 కోట్ల విలువైన సొమ్ము పట్టుబడినట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 205 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, స్వాధీనం చేసుకున్న నగదుకు ఆధారాలు ఉంటే జల్లా కమిటీల ద్వారా వెంటనే విడుదల చేస్తున్నామన్నారు. ఎన్నికల వేళ సామాన్యులకు ఇబ్బంది లేకుండానే తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు.


అక్టోబర్ 31 నుంచి ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నవారి అప్లికేషన్లను నవంబర్ 10లోపు పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఓటర్ ఇన్‌ఫర్మేషన్ ఆధారంగా స్లిప్పులు ముందుగా పంపిణీ చేయనున్నట్లు వికాస్ రాజ్ స్పష్టం చేశారు. నవంబర్ 30న మావోయిస్టు ప్రాబల్యం ఉండే  13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుందని, మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ బూత్ లకు వచ్చిన వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.