Telangana Elections 2023 :  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం రెండో జాబితాను విడుదల చేసింది బీజేపీ. అయితే శుక్రవారం విడుదల చేసిన జాబితాలో ఒకే ఒక్క అభ్యర్థి పేరు ఉండడం గమనార్హం. మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్‌ను ఏపీ మిథున్ రెడ్డికి కేటాయించించింది కమలం పార్టీ. అక్టోబర్‌ 22వ తేదీన తెలంగాణ ఎన్నికలకు సంబంధించి 52 మందితో కూడిన తెలంగాణ బీజేపీ తొలి జాబితా విడుదలైంది. హుజూరాబాద్‌, గజ్వేల్‌ నుంచి ఈటల రాజేందర్‌ పోటీ చేస్తారని ప్రకటించింది. అలాగే.. కరీంనగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ బరిలోకి దిగనున్నారు. పాతబస్తీలో అన్ని స్థానాల నుంచి పోటీకి బీజేపీ సిద్ధమైంది. తొలి జాబితాలో 12 మంది మహిళలకు అవకాశం ఇచ్చింది. ముగ్గురు ఎంపీలను బరిలోకి దింపింది. బీసీలు-16, ఎస్సీలు-8, ఎస్టీలు-6, ఓసీలు-10 మందికి స్థానాలు కేటాయించింది. అయితే రెండో జాబితాలో ఒకే అభ్యర్థిని ప్రకటించడం చర్చనీయాంశమయింది. 


మహబూబ్‌నగర్‌ లో బీజేపీకి ఇద్దరు కీలక నేతలు ఉడంటంతో ఆ పార్టీకి సమస్యగా మారింది.త మాజీ మంత్రి  డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి… ఇద్దరూ మహబూబ్ నగర్ టిక్కెట్ విషయంలో పోటీ పడ్డారు.  గద్వాలలో సీనియర్‌ న్యాయవాది అయిన వెంకటాద్రి రెడ్డిని నిలబెట్టి… తనకు ఎంపీగా అవకాశమివ్వాలని అరుణ కోరుతున్నారు. ఇదే సమయంలో తన కుమారుడు మిథున్‌రెడ్డికి షాద్‌నగర్‌ అసెంబ్లీని కేటాయించి, తనకు లోక్‌సభకు అవకాశం కల్పించాలంటూ జితేందర్‌రెడ్డి ప్రతిపాదన పెట్టారు. చివరికి మధ్యేమార్గంగా  జితేందర్ రెడ్డి కుమారుడికి మహబూబ్ నగర్ అసెంబ్లీ టిక్కెట్ ను కేటాయించాలని నిర్ణయించారు. మరే ఇతర పేర్లు లేకుండా హడావుడికే  ప్రకటించారు.



డీకే అరుణ పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది. రాజగోపాల్‌రెడ్డి మాదిరిగా చివరి నిమిషంలో బీజేపీని వీడి, కాంగ్రెస్‌లో చేరే అవకాశాలను తోసిపుచ్చలేమంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఆమె కాంగ్రెస్‌లో మక్తల్‌ లేదా నారాయణపేట సీటు అడుగుతున్నట్టు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.  గద్వాల నియోజకవర్గంలో 2004,2009,2014 ఎన్నికల్లో డీకే అరుణ విజయం సాధించారు. 2004 నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన అరుణ...రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌ కుమార్ రెడ్డి మంత్రి వర్గాల్లో పని చేశారు. మారిన రాజకీయ పరిస్థితులతో బీజేపీలో చేరారు.


అయితే పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని  డీకే అరుణ ఖండించారు.  కాంగ్రెస్ పార్టీలో గత అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసినప్పుడు ఆ పార్టీ ముఖ్య నాయకులే నా ఓటమి కోసం ప్రత్యేకంగా పనిచేశారు. అందుకే ఆ పార్టీని వీడాను. భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత అధిష్టానం నాకు మంచి గుర్తింపుని ఇచ్చి హోదాను కల్పించిందన్నారు.  కాంగ్రెస్ పార్టీ గద్వాలలో బలమైన బీసీ నేతలు ఉన్నప్పటికీని స్థానికేతరులకు పోటీ చేసే అవకాశం కల్పించింది. పార్టీ నుండి స్థానికులైన బీసీలకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకు వెళితే అందుకు అంగీకరించింది. ఈ కారణంగానే  గద్వాల నుండి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను తప్ప మరొక కారణం కాదని స్పష్టం చేశారు.