Telangana Elections 2023 BJP Manifesto :  తెలంగాణ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 17వ తేదీన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ( Amit Shah ) తెలంగాణ పర్యాటనకు రానున్నారు. అదే రోజు మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్‌లో అమిత్ షా  తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారు. అనంతరం అమిత్ షా రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. పోలింగ్ తేదీ ( Polling Date  ) సమీపిస్తుండంతో ప్రచారం స్పీడప్ చేయనున్నారు. 17వ తేదీ ఒకేరోజున అమిత్ షా నాలుగు సభల్లో పాల్గొననున్నారు. నల్లగొండ, వరంగల్, గద్వాల్, రాజేంద్రనగర్‌లో జరిగే పబ్లిక్ మీటింగ్స్‌కు అమిత్ షా హాజరకానున్నారు.


మేనిఫెస్టోలో ఏ ఏ అంశాలు ఉంటాయన్నదానిపై ఆసక్తి ఏర్పడింది. తెలంగాణలో సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని ఇప్పటికే రాష్ట్ర బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి తెలిపారు. అలాగే.. విద్య, వైద్యం ఉచితంగా అందించే హామీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. మేనిఫెస్టోలో జాబ్‌ క్యాలెండర్‌, ఉపాధి అవకాశాలపై హామీలు ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో పలు నగరాల పేర్లు మారుస్తామని మేనిఫెస్టోలో బీజేపీ పొందుపర్చినట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర సహా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలే చేసింది బీజేపీ. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పట్టణాన్ని ఛత్రపతి శంభాజీనగర్‌ గా, ఉస్మానాబాద్ పట్టణానికి ధరాశివ్‌ గా పేరు మార్చింది కేంద్రం. మహారాష్ట్రలో కూడా బీజేపీ కూటమి ఉండటంతో అక్కడ ఆ పని సులువుగా జరిగింది.             


గతంలో హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. భైంసా పేరును మహీషగా మారుస్తామని కూడా ఆయన చెప్పారు. నిజామాబాద్ పేరుని ఇందూరుగా మార్చాలని గతంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు.  ఈ పేరు మార్పు  డిమాండ్లన్నీ  ఇప్పుడు మేనిఫెస్టో హామీలుగా తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో రూ. 450కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించింది. తెలంగాణలో కూడా ఆ హామీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.  తెలంగాణలో ఈ హామీ ఇస్తే.. కచ్చితంగా రేపు సార్వత్రిక ఎన్నికల్లో కూడా గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిస్తామని హామీ ఇవ్వాల్సి ఉంటుందని.. అందుకే ఆలోచిస్తోందని మరికొంత మంది నేతలు చెబుతున్నారు.               


  ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు నవంబర్ 23వ తేదీతో ముగియనున్నాయి. ఆ తర్వాత బీజేపీ జాతీయ నేతలంతా తెలంగాణలో మకాం వేయనున్నట్లు స్థానిక నేతలు చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే తెలంగాణను చుట్టేశారు. మరోసారి.. నవంబర్ 25, 26, 27 తేదీల్లో వస్తారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ప్రచారానికి చివరి వారం కీలకంగా మారనుంది. అలాగే, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల పార్టీ ముఖ్య నేతల తాకిడి రాష్ట్రానికి పెరుగుతుందని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు.
 .