Telangana Election 2023: 


ఏబీపీ ఒపీనియన్ పోల్..


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయి. కాంగ్రెస్, అధికార BRS మధ్య టఫ్‌ ఫైట్‌ తప్పేలా లేదు. బీజేపీ కూడా పోటీలో ఉన్నప్పటికీ... అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చేది కాంగ్రెసే అని తాజా సర్వేలో మరోసారి తేలింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ABP News Cvoter Final Opinion Poll ఆసక్తికర విషయాలు వెల్లడించింది. కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఒపీనియన్ పోల్ ప్రకారం... అధికార BRS కి 49 నుంచి గరిష్టంగా 61 స్థానాలు వస్తాయని సర్వేలో తేలింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌కి 43-55 సీట్లు రాగా, బీజేపీకి 5-11 సీట్లకు పరిమితం కానుంది. ఏఐఎంఐఎం(AIMIM) 6 నుంచి 8 స్థానాల్లో గెలుస్తుందని తాజా సర్వేలో వెల్లడైంది. ఏదేమైనా బీఆర్‌ఎస్‌కి ఎడ్జ్ ఉంటుందని సర్వే చెబుతోంది. తెలంగాణలో మొత్తం 119 స్థానాలుండగా.. అధికారం చేపట్టాలంటే 60 సీట్ల మ్యాజిక్ ఫిగర్ సాధించాలి. ఆ మ్యాజిక్ ఫిగర్‌ అందుకునే ఛాన్స్ BRSకి ఉండగా, ఒకవేళ మూడు నాలుగు సీట్లు తగ్గితే హంగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఏబీపీ సీ ఓటర్ ఫైనల్ ఒపీనియన్ పోల్‌ వెల్లడించింది. మ్యాజిక్ ఫిగర్ కు కొన్ని సీట్లు తగ్గితే బీఆర్ఎస్ కు ఎంఐఎం ఎలాగూ మద్దతిస్తుందని తెలిసిందే.


పార్టీలకు ఓట్ల శాతం ఎంతంటే..? 


ఇక ఓట్ల పరంగా చూస్తే... బీఆర్‌స్‌కి 41% ఓట్లు, కాంగ్రెస్‌కి 39%, బీజేపీకి 14%, ఎంఐఎంకి 2.4 శాతం ఓట్లు పోల్ అవుతాయని ఈ ఒపీనియన్ పోల్‌ తెలిపింది. అధికార బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో తొలి ఎన్నికల మాదిరిగానే జస్ట్ మ్యాజిక్ ఫిగర్ సాధించే ఛాన్స్ ఉందని ఈ ఒపీనియన్‌ పోల్‌లో వెల్లడైంది. కాంగ్రెస్ గత ఎన్నికల కంటే భారీగా పుంజుకోనుంది. తెలంగాణకు ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలన్న అభిప్రాయం సేకరించగా అందులో 37% మంది మళ్లీ KCRకే జైకొట్టారు. రెండో స్థానంలో కాంగ్రెస్‌ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయనకు 31% ఓట్లు పోల్ అయ్యాయి. 2% మంది అసదుద్దీన్ ఒవైసీ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నట్టు ఈ ఒపీనియన్ పోల్‌ వెల్లడించింది. మొత్తం 5 రాష్ట్రాల్లోనూ ABP CVoter ఈ ఫైనల్ ఒపీనియన్ పోల్ చేపట్టింది. ఇందులో భాగంగా మొత్తం 63 వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 3 వరకూ ఈ పోల్‌ నిర్వహించింది. 


గతంలో ఒపీనియన్‌ పోల్ ఫలితాలు ఇలా..


గత నెలలోనూ ABP CVoter Opinion Poll నిర్వహించింది. అప్పటి పోల్ ప్రకారం..ప్రకారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంది. బీఆర్ఎస్‌కి 43 నుంచి 55 సీట్లు, కాంగ్రెస్కు 48 నుంచి 60 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని ఆ సర్వే వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రచారానికి నాయకత్వం వహించినప్పటికీ భారతీయ జనతా పార్టీ (బిజెపి) కేవలం 5 నుండి 11 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని ఆ సీఓటర్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. గత పోల్‌లో కాంగ్రెస్ 10.5 శాతం ఓట్లతో దాదాపు 39 శాతం ఓట్లు సాధించగా, అధికార బీఆర్ఎస్ 9.4 శాతం ఓట్ల వాటాతో 37 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. బీజేపీకి 16 శాతం ఓట్లు వస్తాయని, 9.3 శాతం ఓట్లు పెరుగుతాయని తెలిపింది.