Kishanreddy Slams Congress on SC Classification: ఎస్సీ వర్గీకరణ కోసం గత 30 ఏళ్లుగా శాంతియుత పోరాటం జరుగుతోందని, వర్గీకరణ ఆలస్యంలో తొలి ముద్దాయి కాంగ్రెస్ పార్టీయేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వాలు ఎన్నో కమిటీలు వేసి పట్టించుకోలేదని మండిపడ్డారు. అన్ని పార్టీలు కంటి తుడుపు చర్యగా ప్రవర్తించాయని విమర్శించారు. యూపీఏ ప్రభుత్వం తుషార్‌ మెహతా కమిటీ వేసి వదిలేసిందని, ఆనాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కమిటీ నివేదికను కూడా చదవలేదని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్రం కమిటీ ఏర్పాటు చేస్తుందని, పోరాటానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. 


ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ జులైలో ప్రధాని మోదీని కలిసి ఎస్సీ వర్గీకరణపై విన్నవించారని, ఆగస్టులో ఎమ్మార్పీఎస్ నాయకులను అమిత్ షా ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడారని కిషన్ రెడ్డి చెప్పారు. 'ఎస్సీ వర్గీకరణపై గతంలో సుప్రీంకోర్టు రెండు రకాలు తీర్పులు ఇచ్చింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనాలు పరస్పర విరుద్ధ తీర్పులు ఇచ్చాయి. ఒక ధర్మాసనం వర్గీకరణ జరగాలని, మరొక ధర్మాసనం వద్దని తీర్పు ఇచ్చింది. చివరగా ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని సూచించింది' అని కిషన్‌రెడ్డి తెలిపారు.


'వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉంది'


ఎస్సీ వర్గీకరణ కోసం బీజేపీ కట్టుబడి ఉందని, ఈ బాధ్యతను కమలం పార్టీ భుజాన వేసుకున్నట్లు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సమస్య పరిష్కారానికి ఇంత వరకూ ఏ ప్రధాని చొరవ చూపలేదని, ప్రధాని మోదీ సమస్య పరిష్కరించేలా చర్యలు చేపట్టారన్నారు. కేంద్రం వేసే కమిటీ వర్గీకరణ చేయాలా వద్దా అని కాదని, వేగవంతంగా అమలు చేయడం కోసమేనని స్పష్టం చేశారు. న్యాయస్థానం తీర్పు అనుకూలంగా రాకుంటే చట్ట సవరణ చేస్తామని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో ఉలిక్కి పడుతున్నారని ఎద్దేవా చేశారు.


వర్గీకరణకు అనుకూలంగా కమిటీ


ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఓ కమిటీ వేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో పరేడ్ గ్రౌండ్ లో శనివారం నిర్వహించిన మాదిగ విశ్వరూప సభకు హాజరైన మోదీ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు.  30 ఏళ్లుగా మందకృష్ణ ఒకే లక్ష్యం కోసం పోరాడుతున్నారన్నారు. ఇంత కాలం మాటలు చెప్పి .. అమలు చేయని రాజకీయ పార్టీల తరఫున తాను క్షమాపణ చెబుతున్నాన్నారు. ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.


అసలేంటీ వర్గీకరణ? ఎందుకు?


అసలు ఎస్సీ వర్గీకరణ అంటే, షెడ్యూల్డ్ కులాలను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా వర్గీకరించడం. 1994లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం మొదలైంది. సుమారు 59 కులాలు ఎస్సీ జాబితాలో ఉండగా, అందులో మాదిగ, ఇతర కులాల జనాభా 80 శాతం ఉండొచ్చని అంచనా. ఎస్సీలు మొత్తం అట్టడుగు వర్గాలే అయినప్పటికీ అందులోనూ ఎక్కువ, తక్కువలు ఉన్నాయి. ఈ క్రమంలో అందరికీ న్యాయం జరగాలనే ఈ వర్గీకరణ డిమాండ్ మొదలైంది.


Also Read: Telangana Elections 2023 : తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ డేట్ ఫిక్స్ - కీలక హామీలు ఇవేనా ?