Telangana Elections 2023: ఆసిఫాబాద్‌ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవ లక్ష్మికి ఎన్నికల అధికారులు షాక్ ఇచ్చారు. ఆమె వాడుతున్న ప్రచార వాహనాన్ని ఎన్నికల అధికారులు సీజ్‌ చేశారు. బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు అంబాసిడర్‌ కారు.. ఈ విషయం అందరికి తెలిసిందే. దీంతో కోవా లక్ష్మి తన ఎన్నికల ప్రచారం కోసం మహారాష్ట్ర నుంచి ఒక పాత అంబాసిడర్‌ కారు తీసుకొచ్చారు. దానికి గులాబీ రంగు వేసి ప్రచారం చేయడానికి సిద్ధం చేశారు. 


అంబాసిడర్‌ కార్ల ఉత్పత్తి 20 ఏళ్ల క్రితమే నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అంబాసిడర్‌లో కార్లు దొరకడం లేదు. దీంతో పాతకారుకే రంగులు దిద్ది ప్రచారానికి ఉపయోగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు అందింది. దీంతో ఎన్నికలు అధికారులు  రంగంలోకి దిగారు. ఆ కారుకు సంబంధించి సరైన పత్రాలు చూపించమని అడిగారు. అయితే అందుకు పత్రాలు లేకపోవడంతో కారును సీజ్‌ చేసి ఆసిఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.


కాంగ్రెస్ రూపొందించిన కార్లు సీజ్
ఎన్నికలు తేదీ సమీపిస్తున్న కొద్ది అధికార ప్రతిపక్షాలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ వినూత్నంగా ప్రచారం చేపట్టాయి. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్‌ పాలనను, హామీల అమలులో వైఫల్యాన్ని విమర్శిస్తూ నినాదాలతో కాంగ్రెస్ పార్టీ రూపొందించిన కార్లను బేగంబజార్‌ పోలీసులు శనివారం రాత్రి సీజ్‌ చేశారు. కాంగ్రెస్‌ నేతలు ప్రచారం కోసం తయారుచేసిన కార్ల నంబర్‌ ప్లేట్‌పై కేసీఆర్‌ 420 అని ఉంది. ఎన్నికల్లో ఇతర పార్టీలు, నేతలను కించపరిచేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదంటూ ఈసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


దీంతో స్పందించిన పోలీసులు గాంధీభవన్‌లోని ఆ కార్లను గోషామహల్‌ స్టేడియానికి తరలించారు. సిబ్బంది మొత్తం వెళ్ళిపోయిన తర్వాత గాంధీ భవన్ లోపలికి వెళ్లి పోలీసులు వాహనాలకు తీసుకుపోయారని కాంగ్రెస్ నాయకులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పోలీసులు దౌర్జన్యంగా వాహనాలు తీసుకుపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పోలీసులు బీఆర్ఎస్ కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలీసులు వెంటనే కాంగ్రెస్ పార్టీ వాహనాలను తిరిగి గాంధీ భవన్ లో అప్పగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.


కేసులు నమోదు చేస్తున్న పోలీసులు
మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌(ఎంసీసీ) ఉల్లంఘనలపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా గుమిగూడినా, మందు, విందులు ఏర్పాటు చేసినా, సమయం దాటి ప్రచా రం కొనసాగించినా, డీజే వాహనాలు వాడినా, ఆఖ రుకు ఎమ్మెల్యే అభ్యర్థి పోస్టర్లు వాహనాలకు వేసుకున్నా కేసులు పెడుతూ.. ఆ వాహనాలు సీజ్‌ చేస్తున్నారు. కొన్ని పార్టీల వారు ప్రచారంలో భాగంగా ఆటోలు, కార్లపై పోస్టర్లు అంటిస్తున్నారు. అందులో అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఉండటం గమనార్హం. ఆ వాహనాలను సీజ్‌ చేయడంతో తాము జీవనోపాధి కో ల్పోతున్నామని డ్రైవర్లు లబోదిబోమంటున్నారు. 


ఎన్నికల విధుల్లో భాగంగా పోలీసులు ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇటీవల మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనాలను తనిఖీ చేశారు.  హైదరాబాద్‌ నుంచి కామారెడ్డి వెళ్తున్న మంత్రి కేటీఆర్‌ వాహనాన్ని మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద పోలీసులు, ఎన్నికల సిబ్బంది ఆపి తనిఖీ చేశారు. రాయపర్తి మండలంలోని కిష్టాపురం క్రాస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వాహనాలను ఎన్నికల అధికారులు, పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు మంత్రులు సహకరించారు.