Dial 112 Replaces Dial 100 Telangana: తెలంగాణ శాంతిభద్రతల రక్షణ , అత్యవసర స్పందన వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ డయల్ 112 సేవలను రాష్ట్ర పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న సంప్రదాయ డయల్ 100 స్థానంలో వన్ నేషన్.. వన్ ఎమర్జెన్సీ నంబర్ ప్రాతిపదికన ఈ ఏకీకృత వ్యవస్థను రూపొందించారు. బంజాన్ హిల్స్‌లోని తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ టవర్-B లో ప్రత్యేకంగా రెండు ఫ్లోర్ లను కేవలం డయల్ 112 కార్యకలాపాల కోసమే కేటాయించినట్లు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఆపదలో ఉన్న పౌరుల నుంచి డయల్ 112కి కాల్ రాగానే, ఆ అత్యవసర పిలుపును పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించడానికి వీల్లేదని ఆయన సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అత్యవసర సేవల పరిణామ క్రమాన్ని ప్రస్తావిస్తూ, 2013లో జీవీకే సంస్థ భాగస్వామ్యంతో డయల్ 100 సేవలు ప్రారంభమయ్యాయని డీజీపీ సీవీ ఆనంద్ గుర్తుచేశారు. విభిన్న రకాల అత్యవసర అవసరాలకు వేర్వేరు నంబర్లు కాకుండా, దేశవ్యాప్తంగా పౌరులందరికీ ఒకే ఏకీకృత ఎమర్జెన్సీ నంబర్ ఉండాలని గతంలో కేంద్ర ప్రభుత్వం సూచించిన విషయాన్ని ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సాంకేతిక అభివృద్ధిని నిరంతరం విస్తరిస్తూ వచ్చామని, అందులో భాగంగానే డయల్ 100ను ఇప్పుడు అత్యంత పటిష్టమైన డయల్ 112గా అప్‌గ్రేడ్ చేశామని స్పష్టం చేశారు.
నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత అందుబాటులోకి రావడంతో అత్యవసర సేవల నిర్వహణలో అనేక విధులు ఎంతో సులువయ్యాయని ఐపీఎస్ అధికారి తెలిపారు. బాధితులు డయల్ 112కి కాల్ చేయగానే వారి కచ్చితమైన లొకేషన్‌ను తక్షణమే ట్రేస్ చేయడానికి అడ్వాన్స్‌డ్ అల్గారిథమ్స్ ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. కేవలం నేరాల నివారణకే కాకుండా న్యాయ సాయం, వైద్య అత్యవసరాలు, ఫైర్, అలాగే పెరుగుతున్న సైబర్ నేరాల బాధితులకు సైబర్ సాయం అందిస్తూ.. అన్ని రకాల సమస్యల పరిష్కారానికి డయల్ 112ను ఏకైక పరిష్కార మార్గంగా తీర్చిదిద్దామని ప్రకటించారు.
పోలీసింగ్ వ్యవస్థను నవతరం సాంకేతికతతో అనుసంధానించే క్రమంలో తెలంగాణ పోలీసులు త్వరలోనే డ్రోన్ ఆధారిత సాంకేతిక వ్యవస్థను రంగంలోకి దించుతున్నారు. అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించేందుకు ప్రత్యేకంగా డ్రోన్ టీమ్ ను సైతం రూ పొందించబోతున్నట్లు డీజీపీ వెల్లడించారు. సాంప్రదాయ బేసిక్ పోలిసింగ్‌తో పాటు సాంకేతిక రక్షణను సమాంతరంగా తీసుకెళ్లేలా టెక్నాలజీ పోలిసింగ్ కాన్సెప్ట్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
ఈ డయల్ 112 అనేది కేవలం ఒక హెల్ప్‌లైన్ నంబర్ మార్పు మాత్రమే కాదని, ఇది అత్యవసర సేవల రంగంలో అడుగుపెట్టిన అడ్వాన్స్‌డ్ వర్షన్ 3.0 ' అని డీజీపీ సీవీ ఆనంద్ అభివర్ణించారు. ఈ నూతన డిజిటల్ సిస్టమ్‌ను మరింత సమర్థవంతంగా, వేగవంతంగా ప్రజలకు అందించేందుకు ఏఐ టెక్నాలజీపై పట్టు ఉన్న యువ ఐపీఎస్ అధికారులను, టెక్-సావీ సిబ్బందిని ఇందులో ప్రత్యక్షంగా భాగస్వామ్యం చేస్తున్నట్లు వెల్లడించారు. అత్యవసర సమయంలో పౌరులకు క్షణాల్లో రక్షణ కల్పించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని ఉద్ఘాటించారు.
