Bhatti Vikramarka Meet Odisha CM: తెలంగాణ సింగరేణి సంస్థ ఒడిశాలోని నైనీ వద్ద చేపట్టిన బొగ్గు గని ప్రాజెక్టులో తవ్వకాలు చేపట్టేందుకు సహకరించాలన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) విజ్ఞప్తికి ఒడిశా సీఎం (Odisha CM) మోహన్ చరణ్ మాంజీ సానుకూలంగా స్పందించారు. బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. అంతే కాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులను ఆదేశించారు. అంగుల్ జిల్లాలోని సింగరేణికి కేటాయించిన నైనీ కోల్ బ్లాక్‌లో సింగరేణి కార్యకలాపాల ప్రారంభానికి సంబంధించి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని భట్టి విక్రమార్క.. రాష్ట్ర అధికారుల బృందంతో ఒడిశా సీఎంతో ఆ రాష్ట్ర సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ బలరాం నాయక్, ఇంధన శాఖ ఓఎస్డీ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో ఏం చెప్పారంటే.?
సింగరేణికి నైనీ బొగ్గు బ్లాకుల ఆవశ్యకతను ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాంజీకి వివరించారు. 2017లోనే సింగరేణికి నైనీ గనులను కేటాయించారని.. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విషయాలకు సంబంధించి గత ప్రభుత్వంలో నాటి బొగ్గు గనుల మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని వివరించారు. అప్పుడు అందజేసిన వినతిపత్రాలను అందజేశారు. తాడిచర్ల బ్లాక్, నైనీ బ్లాక్‌లకు సంబంధించిన అడ్డంకులను తొలగించాల్సిందిగా విజ్ఞప్తి చేశామన్నారు.
'రూ.600 కోట్ల వరకూ ఆదాయం'
నైనీ బ్లాక్‌లో తవ్వకాలు చేపట్టడం వల్ల ఒడిశా యువతకు అధిక సంఖ్యలో ఉపాధి, పన్నుల రూపంలో రూ.600 కోట్ల వరకూ ఒడిశా సర్కారుకు ఆదాయం సమకూరుతుందని భట్టి.. ఒడిశా సీఎంకు వివరించారు. నైనీ బ్లాకులో గనుల తవ్వకానికి పారిశ్రామిక, పర్యావరణ అనుమతులు సైతం వచ్చాయని చెప్పారు. అటవీ, ప్రైవేట్ భూములను సింగరేణికి బదలాయించాల్సిన అంశం పెండింగ్‌లో ఉందని.. అది పరిష్కారమైతే సింగరేణి సంస్థ తవ్వకాలు ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో భూముల బదలాయింపు, విద్యుత్, రహదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అక్కడి ఉన్నతాధికారులకు ఒడిశా సీఎం ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Telangana : వాళ్లందరి దగ్గర రైతుబంధు రికవరీ - ఇవ్వకపోతే కేసులే - రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం