Telangana Congress :   వరంగల్‌లో నిర్వహించిన సభలో రాహుల్ గాంధీతో రైతు డిక్లరేషన్ ప్రకటింప చేసిన టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రియాంకా గాంధీతో యూత్ డిక్లరేషన్ ప్రకటించేందుకు సన్నాహాలు చేశారు.  సరూర్‌నగర్‌ స్టేడియం వేదికగా 8వ తేదీన నిర్వహించ నున్న సభకు ”యువ సంఘర్షణ సభ”గా నామకరణం చేశారు. తమ ప్రభుత్వం వస్తే ఏం చేయాలనుకుంటున్నామో.. ముఖ్యంగా యూత్‌ను ఎలా ఆదుకుంటామో ప్రియాంకాగాంధీతో ప్రకటింపచేయనున్నరా.ు 


యువతను ఆకట్టుకునే ప్రత్యేక ప్రయత్నం !


విద్యా ర్థులు, నిరుద్యోగులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వారిని ఆదుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ చెబుతోంది.  ఎలా ఆదుకుం టామో యూత్‌ డిక్లరేషన్‌లో పొందుపరచనున్నారు.   యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగులకు న్యాయం చేస్తామని  మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇవ్వనుంది.   తెలంగాణలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. వాటిని భర్తీ చేయడం లేదని..తాము రాగానే భర్తీ చేస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలోని విద్యార్థి, నిరుద్యోగులకు కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటికి మద్ధతుగా ఉంటుందని చెప్పేలా సభ నిర్వహించడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.  


యువ సంఘర్షణ  సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్రెడ్డి !


సరూర్‌నగర్‌ స్టేడియంలో 8న నిర్వహించే ‘యువ సంఘర్షణ సభ’ విజయవంతం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  యువ సంఘర్షణ సభ విజయంతం కోసం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ పొలిటికల్‌ ఆఫైర్స్‌ కమిటీతో పాటు పార్టీ అనుబంధ సంఘాల నాయులతోనూ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, మాణిక్‌రావు ఠాక్రేలు సమావేశం నిర్వహించి.. జన సమీకరణలో ప్రతి నాయకుడు భాగస్వామ్యం కావాలని ఆదేశించారు. యువ సంఘర్షణ సభను విజయవంతం చేసేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఏడు పార్లమెంట్‌ నియోజక వర్గాలకు ఇన్‌చార్జులను నియమించారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, చేవెళ్ల, భువనగిరి, మల్కాజ్‌గిరి, మెదక్‌, మహూబ్‌నగర్‌ పార్లమెంట్‌తో పాటు నల్లగొండ పార్లమెంట్‌ నియోజక వర్గాల పరిధిలోని అసెంబ్లిd నియోజక వర్గాల నుంచి జన సమీకరణ ఎక్కువగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.  


సభ సక్సెస్ అయితే హైకమాండ్ వద్ద పెరగనున్న రేవంత్  పలుకుబడి !                                         


కాంగ్రెస్ సభ విజయవంతం అయితే కాంగ్రెస్ హైకమాండ్ వద్ద రేవంత్ రెడ్డి పలుకుబడి మరింత పెరుగుతుంది. ఇప్పటికే సీనియర్లు ఆయన ప్రభావాన్ని వీలైనంత తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు పోటీగా భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేశారు. త్వరలో రేవంత్ రెడ్డి రెండో విడత పాదయాత్ర చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ బహిరంగసభను సక్సెస్ చేయడం ద్వారా రేవంత్ హైకమాండ్ వద్ద తన ప్రాధాన్యతను కొనసాగేలా చూసుకోవాలనుకుంటున్నారు.