తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా శుక్రవారం సాయంత్రం విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 55 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేయగా, తాజాగా, మరో 45 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. సీపీఐ, సీపీఎంలకు చెరో 2 సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. వామపక్ష పార్టీలు సహా 11 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ పార్టీలకు ఏయే స్థానాలు ఇవ్వాలనే దానిపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మిగతా స్థానాలకు అభ్యర్థుల ఎంపిక బాధ్యతను రాష్ట్ర నాయకత్వానికే అధిష్ఠానం విడిచి పెట్టినట్లు తెలుస్తోంది. 


రేణుకాచౌదరి అసంతృప్తి


మరోవైపు, కాంగ్రెస్ టికెట్ల కేటాయింపుపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం జరగలేదని, బయట నుంచి వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. డబ్బున్న వాళ్లకు కాదని, దమ్మున్న వారికి టికెట్లు ఇవ్వాలని అన్నారు.


'తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఆంధ్ర, తెలంగాణ రాజకీయ పరిణామాల కారణంగా కమ్మ కులస్థులు ఆగ్రహంతో ఉన్నారు. వారి మనోభావాల్ని పరిగణలోకి తీసుకోవాలి. ఓడిపోయే నియోజకవర్గాల్లో టికెట్లు ఇస్తాం అంటే కుదరదు. కమ్మలని తక్కువ అంచనా వెయ్యొద్దు. అలా చేస్తే తగిన పరిణామాలు ఉంటాయి. గత ఎన్నికల్లో కమ్మ వర్గానికి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ఆ ఎన్నికల్లో ఓ వర్గానికి 38 సీట్లిచ్చారు. వారిలో 8 మంది గెలిస్తే చివరకు ఇద్దరే మిగిలారు.' అంటూ రేణుకా చౌదరి తెలిపారు. అందరికీ న్యాయం జరిగేలా టికెట్ల కేటాయింపు ఉండాలని అధిష్టానానికి వివరించినట్లు చెప్పారు. 


అన్ని వర్గాలకు సముచిత స్థానం


తెలంగాణలో సీట్ల కేటాయింపులో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఉంటుందని టీకాంగ్రెస్ ఇంఛార్జీ మాణిక్ రావు థాక్రే తెలిపారు. తొలి జాబితాపై ఎవరూ అసంతృప్తిగా లేరని అన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే గెలిచే అభ్యర్థులను ఎన్నికల బరిలో ఉంచామని స్పష్టం చేశారు. 


కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు


మరోవైపు, తెలంగాణ ఎన్నికల సమయంలో టీకాంగ్రెస్ లో చేరికలు ఎక్కువయ్యాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మోత్కుపల్లి నరసింహులు, నేతి విద్యాసాగర్, ఏనుగు రవీందర్ రెడ్డి, కపిలవాయి దిలీప్ కుమార్, ఆకుల లలిత, నీలం మధుతో పాటు పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. 


సాయంత్రం కీలక భేటీ


ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ ముఖ్య నేతలు గాంధీభవన్ లో సమావేశం కానున్నారు. విజయభేరి బస్సు యాత్రపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్ రావు థాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కర్ణాటక మంత్రి బోస్ రాజు సైతం ఈ మీటింగ్ కు హాజరు కానున్నారు.