జూలై 2న ఖమ్మం జిల్లాలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ‘జన గర్జన’ పేరుతో నిర్వహించనున్న సభ ఏర్పాట్లను కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు పరిశీలించారు. నేడు (జూన్ 28) ఖమ్మంలో పర్యటించిన ఆయన.. బహిరంగ సభ గురించి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులతో సమావేశం అయ్యారు. వారు సభ గురించి దాదాపు గంటకుపైగా చర్చలు జరుపుకున్నారు. సమావేశం తర్వాత రాహుల్‌ గాంధీ రానున్న బహిరంగ సభ స్థలాన్ని మాణిక్‌ రావు ఠాక్రే పరిశీలించారు.


ఈ సందర్భంగా మాణిక్‌ రావు ఠాక్రే మాట్లాడుతూ.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌ ముగింపు కూడా అదే రోజు ఉంటుందని, అదే రోజు సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. పీపుల్స్‌ మార్చ్‌ను విజయవంతంగా పూర్తి చేసినందున భట్టి విక్రమార్కకు ఆ సభలో రాహుల్‌ గాంధీ సన్మానం చేస్తానరని ఠాక్రే చెప్పారు. ఆ సభలోనే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి క్రిష్ణారావు కూడా కాంగ్రెస్ లో చేరతారని చెప్పారు. పీపుల్స్‌ మార్చ్‌ ‌ముగించుకొచ్చే ముగించుకొచ్చే భట్టికి స్వాగతం పలికే వారిలో పొంగులేటి శ్రీనివాస్ కూడా ఉంటారని అన్నారు. 


సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిన్న సూర్యపేట జిల్లా మోతే మండలంలో సాగింది. హుస్సేన్‌బాద్‌, మామిళ్ళగూడెం మీదుగా యాత్ర సాగి నేడు ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. కోదాడ సమీపంలో భట్టి పాదయాత్రకు మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్‌ పద్మావతి రెడ్డి ఘన స్వాగతం పలికారు. రానున్న ఎన్నికల్లో సూర్యపేట జిల్లాలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం 105వ రోజు సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గం మోతే నుంచి ప్రారంభమైన భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఖమ్మం జిల్లా సరిహద్దు మామిల్లగూడెం వద్దకు చేరుకుంది. సాయంత్రం నాయకన్ గూడెం మీదుగా ఖమ్మం జిల్లాలో పాదయాత్ర కొనసాగనుంది. అలాగే పాదయాత్రగా వస్తున్న భట్టి విక్రమార్కకు తొలుత ఉదయం కోదాడ నియోజకవర్గం హుస్సేనా బాద్ గ్రామంలో గ్రామస్తులు పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు.


రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో మధిర ఎమ్మెల్యే అయిన మల్లు భట్టి విక్రమార్క 105 రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు. మార్చి 16న అదిలాబాద్ బోథ్ నియోజకవర్గంలో ఈ పాదయాత్ర ప్రారంభం అయింది. తాజాగా ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా పాలేరు నియోజకవర్గ ఇన్చార్జ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు తదితరులు, ఖమ్మం జిల్లా, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు పువాళ్ల దుర్గాప్రసాద్, మహమ్మద్ జావిద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య తదితరుల సారధ్యంలో కాంగ్రెస్ శ్రేణులు మామిళ్ల గూడెం వద్ద నుండి ఘనంగా స్వాగతం పలికారు.