Telangana government schools: క్షేత్ర స్థాయి పరిస్థితులు, అధ్యయనం, భవిష్యత్ అవసరాలకు తగినట్లు రూపొందించే తెలంగాణ విద్యా విధానం (Telangana Education Policy-TEP) భారతదేశ విద్యా విధానానికి దిక్సూచిలా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుత విద్యా విధానంలో భాష ఉన్న వారి దగ్గర జ్ఞానం లేదని... జ్ఞానం ఉన్న చోట భాష లేదని.. రెండు ఉన్న చోట నైపుణ్యాలు లేవని.. కానీ ఈ మూడింటి కలబోతగా విద్య ఉండాలని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ విద్యా విధానం నివేదిక రూపకల్పనపై తెలంగాణ సెక్రటేరియట్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో విద్యా రంగాన్ని సమూల ప్రక్షాళన చేయాలని తాము నిర్ణయించుకున్నట్లు సీఎం తెలిపారు. గతంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వాలు భూముల పంపకం... నిధుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టేవని... ఇప్పుడు పంపకానికి భూములు, తగినన్ని నిధులు లేవన్నారు. ఇప్పుడు పేదరిక నిర్మూలనకు విద్య తప్ప మరో ఆయుధం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యా రంగం ప్రాధాన్యతను గుర్తించినందునే ప్రథమ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ దేశంలో విశ్వ విద్యాలయాలు, ఐఐటీలు వంటి ఉన్నత విద్యా సంస్థలను స్థాపించారని గుర్తు చేశారు.
మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ఉన్న కాలంలో ఉద్యోగావకాశాలకు అనేక పరిమితులు ఉన్నాయని సీఎం అన్నారు. సరళీకృత ఆర్థిక వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత దేశ, విదేశాల్లో ఉపాధి అవకాశాలు భారీగా పెరిగినప్పటికీ విద్యాప్రమాణాలు ఆస్థాయిలో పెరగకపోవడంతో వాటిని అందిపుచ్చుకోవడంలో మనం విఫలమవుతున్నామని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. కాలానుగుణంగా ఇంజినీరింగ్ కళాశాలలు వచ్చినందునే పెద్ద సంఖ్యలో సాఫ్ట్ వేర్ రంగంలో మన యువత రాణిస్తున్నారని సీఎం తెలిపారు. అయినప్పటికీ మన రాష్ట్రం నుంచి ఏటా బయటకు వస్తున్న లక్షలాది మంది ఇంజినీరింగ్ విద్యార్థుల్లో పది శాతం మందికి కూడా ఉద్యోగాలు దక్కడం లేదన్నారు. తగినంత నైపుణ్యం లేకపోవడమే అందుకు కారణమన్నారు. ఆ రంగంలో నైపుణ్యాలు పెంచడంతో పాటు ఇంకా పలు రంగాల్లో అవకాశాలు విస్తృతమైనందున ఆ అవకాశాలు అందిపుచ్చుకునేలా విద్యా రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సీఎం తెలిపారు.
విద్యా రంగానికి భారీఎత్తున నిధులు కేటాయిస్తున్నా ఏటికేడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రైవేటు పాఠశాలలు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీతో ప్రారంభిస్తుంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ప్రారంభమవుతున్నాయన్నారు. నర్సరీకి ప్రైవేటు పాఠశాలలో చేరిన వారు తిరిగి ప్రభుత్వ పాఠశాలల వైపు చూడడం లేదన్నారు. విద్యార్థుల రాకపోకలు, తగిన శ్రద్ధ చూపుతారనే కారణంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారని సీఎం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు ఆ రకమైన ధీమా కల్పించగల్గితే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్చుతారని.. తెలంగాణ విద్యా విధానం రూపకల్పనలో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సీఎం సూచించారు. ఇప్పటి వరకు విద్యా రంగంపై తాము చేసిన కృషితోనే తాము సంతృప్తి చెందడం లేదని.. ప్రాథమిక దశ నుంచి యూనివర్సిటీల వరకు సమూల ప్రక్షాళన చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. రానున్న 25 ఏళ్ల వరకు విద్యా వ్యవస్థకు దిశానిర్దేశం చేసేలా తెలంగాణ విద్యా విధానం ఉండాలని సీఎం అన్నారు. డిసెంబరు 9వ తేదీన ఆవిష్కరించనున్న తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047లో తెలంగాణ విద్యా విధానానికి చోటు కల్పిస్తామని సీఎం వెల్లడించారు. ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక, నైపుణ్య విద్యలుగా విభజించుకొని ఇందులో ఉన్న విద్యావేత్తలు తమ అభిరుచులకు అనుగుణంగా సబ్ కమిటీలుగా ఏర్పడి అత్యుత్తమ డాక్యుమెంట్ రూపొందించాలని సీఎం కోరారు.
విద్యా వ్యవస్థ వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం కాకుండా నిరుపేదలకు లబ్ధికలిగేలా ఉండాలని తాము ఆకాంక్షిస్తున్నామని సీఎం తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల పేరిట విద్యార్థులను చిన్నతనం నుంచే వేరు చేస్తున్నామని... దానిని రూపుమాపి అంతా ఒకటే అనే భావన కలిగించేలా విద్యాలయాల్లో అందరికీ సమాన అవకాశాలు ఉండాలని సీఎం అన్నారు. మీరు రూపొందించే తెలంగాణ విద్యా విధానం దేశానికి దిక్సూచిలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆశించిన స్థాయిలో తెలంగాణ విద్యా విధానం అమలయ్యేందుకు వివిధ ఫౌండేషన్లు, ఎన్జీవోల సహకారం తీసుకోవాలని సీఎం సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమగ్రంగా వినియోగించుకునేలా విద్యా విధానం ఉండాలన్నారు. విద్యా విధానంపై ఎంత వ్యయానికైనా తాము వెనుకాడమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక విద్యా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మౌలిక వసతులు, ప్రమాణాల మెరుగుకు ఖర్చు చేయాలని నిర్ణయించామని తెలిపారు. విద్యపై చేసే వ్యయాన్ని వ్యయంగా కాక పెట్టుబడిగా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించామన్నారు.