తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మంగళవారం ఒకే రోజులో ఇద్దరు మహిళల శవాలు లభించడం నగరాన్ని కలవరపరిచింది. చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర చెత్త సంచిలో మృతదేహం ఉండటం కలకలం రేపింది. బండ్లగూడలోనూ మరో మహిళ శవమై కనిపించింది. ఒకేరోజు రెండు చోట్ల మహిళల మృతదేహాలు లభ్యం కావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ వరుస సంఘటనలు హైదరాబాద్ నగర వాసుల్లో భయం, అసురక్షిత భావాన్ని కలిగిస్తున్నాయి.
చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో..రైల్వే స్టేషన్ సమీపంలో ఆటో డ్రైవర్ రాము యాదవ్ చెత్త సంచి నుంచి దుర్వాసన వస్తోందని ఫిర్యాదు చేశాడు. బ్యాగ్ తెరిచి చూడగా అందులో 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళ శవం కుళ్లిన స్థితిలో లభించింది. సైబరాబాద్ పోలీసుల ప్రకారం, శవం ఉన్న స్థితిని గమనిస్తే ఇది రెండు రోజుల కిందట జరిగిన హత్యలా భావిస్తున్నారు. ఆటో డ్రైవర్ తెలిపిన ప్రకారం, బిహార్‌కు వెళ్లే రైలు కోసం స్టేషన్‌లో చాలామంది ప్రయాణికులు ఉన్నారు కానీ బ్యాగ్ ను ఎవరూ అంతగా గమనించలేదు. దానిపై ఎవరూ దృష్టి పెట్టలేదు. వెంటనే ఆటో డ్రైవర్ రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు.
GRP డీసీపీ ఎస్. రమేష్ మాట్లాడుతూ.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నాం, అందులో కొంతమంది అనుమానితులు కనిపించారని చెప్పారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహం ఎవరిదో ఇంకా గుర్తించలేదని, ఆమె బిహార్ లేదా ఉత్తర భారత రాష్ట్రాలకు చెందిన మహిళ అయ్యి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ద్వారా హత్య కారణాలు వెల్లడించనున్నారు.
బండ్లగూడలో మరో మహిళ మృతదేహంబండ్లగూడలోని ఓ ప్రదేశంలో 32 ఏళ్ల మహిళ శవం లభించింది. సమీపంలో రెండు మద్యం సీసాలు లభించడంతో, ఇది పథకం ప్రకారం జరిగిన హత్య అని అనుమానిస్తున్నారు. లైంగిక దాడి అనంతరం జరిగిన హత్య చేసి ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. రాజేంద్రనగర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ రాజు మాట్లాడుతూ, సీసీటీవీ ఫుటేజీ ద్వారా హంతకులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి విచారణ చేస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్‌లో ఇటీవల జరుగుతున్న నేరాలు ప్రజల్లో ఆందోళనను పెంచుతున్నాయి. గత ఏడాది నవంబర్‌లో తుక్కుగూడలో టీనేజ్ బాలిక శవం లభించగా, 2025 మార్చిలో లాలాగూడలో తల్లి, కూతురి హత్య చర్చనీయాంశంగా మారింది. మహిళల రక్షణ కోసం కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.