Telangana CM Revanth Reddy | ఢిల్లీ: హైద‌రాబాద్-విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిని 6 వ‌రుస‌లుగా విస్త‌రించాల‌ని, ప్రాంతీయ రింగు రోడ్డు (RRR) ద‌క్షిణ భాగాన్ని జాతీయ ర‌హ‌దారిగా ప్ర‌క‌టించాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఢిల్లీలో జాతీయ ర‌హాదారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీతో రేవంత్ రెడ్డి బుధ‌వారం భేటీ అయ్యారు. తెలంగాణలో జాతీయ ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, నూత‌న జాతీయ ర‌హ‌దారుల ప్ర‌క‌ట‌న‌, ఇప్ప‌టికే జాతీయ ర‌హ‌దారులుగా ప్ర‌క‌టించిన మార్గాల ప‌నులపై కేంద్ర మంత్రి దృష్టికి సీఎం రేవంత్ తీసుకెళ్లారు. 


సంగారెడ్డి నుంచి నర్సాపూర్‌- తూప్రాన్‌- గ‌జ్వేల్‌- జ‌గ‌దేవ్‌పూర్‌- భువ‌న‌గిరి- చౌటుప్ప‌ల్ మార్గంలోని 158.645 కిలోమీటర్ల రోడ్లను జాతీయ ర‌హ‌దారిగా ప్ర‌క‌టించార‌ని నితిన్ గ‌డ్క‌రీకి  రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ రహదారి భూ సేక‌ర‌ణ‌కు అయ్యే వ్య‌యంలో స‌గం తెలంగాణ ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తోంద‌ని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ వివ‌రించారు. త‌మ వంతుగా ప‌నులు వేగ‌వంతం చేశామ‌ని, కేంద్రం నుంచి సహకారం కావాలన్నారు. 


చౌటుప్ప‌ల్ నుంచి అమ‌న్‌గ‌ల్‌- షాద్‌న‌గ‌ర్‌- సంగారెడ్డి వ‌ర‌కు ఉన్న 181.87 కిలోమీటర్ల ర‌హ‌దారిని జాతీయ ర‌హ‌దారిగా ప్ర‌క‌టించాల‌ని కోరారు. ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగాన్ని (RRR South Part) జాతీయ ర‌హ‌దారిగా ప్ర‌క‌టించి, ఈ ఏడాది ఎన్‌హెచ్ఏఐ (NHAI) వార్షిక ప్ర‌ణాళిక‌లో నిధులు మంజూరు చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. హైద‌రాబాద్ ఓఆర్ఆర్ (Hyderabad ORR) గౌరెల్లి జంక్ష‌న్ నుంచి వ‌లిగొండ‌- తొర్రూర్- నెల్లికుదురు- మ‌హ‌బూబాబాద్‌- ఇల్లెందు- కొత్త‌గూడెం వ‌ర‌కు ర‌హ‌దారిని జాతీయ ర‌హ‌దారిగా ప్ర‌క‌టించార‌న్నారు. ప్యాకేజీ కింద 69 కి.మీ.ల‌కు టెండ‌ర్లు పిలిచి ప‌నులు ప్రారంభించార‌ని గ‌డ్క‌రీ దృష్టికి రేవంత్ తీసుకెళ్లారు. 


హైద‌రాబాద్ నుంచి భ‌ద్రాచ‌లం వెళ్లడానికి 40 కి.మీ. దూరం త‌గ్గించే ర‌హ‌దారిని వ‌రంగ‌ల్ స‌భ‌లో జైశ్రీ‌రామ్ రోడ్‌గా నితిన్ గ‌డ్క‌రీ చెప్పిన విష‌యాన్ని రేవంత్ గుర్తుచేశారు. ఈ హైవేలో మిగిలిన 3 ప్యాకేజీలకు మొత్తం 165 కి.మీ టెండ‌ర్లు పిలిచామని, వెంట‌నే ప‌నులు ప్రారంభించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. స‌మావేశంలో రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు, ఇతర నేతలున్నారు. 


రాజ‌ధానుల మ‌ధ్య ర‌హ‌దారి ప‌నులు చేప‌ట్టాలి..
హైద‌రాబాద్‌- విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారి (ఎన్‌హెచ్ 65) ని ఆరు వ‌రుస‌లుగా విస్త‌రించాలని కేంద్రాన్ని కోరారు. 2 రాష్ట్రాల మ‌ధ్య కీల‌క‌మైన హైవేలో రోజుకు 60 వేల‌కుపైగా వాహ‌నాలు వెళ్తుంటాయని.. ర‌ద్దీతో ప్ర‌మాదాలు జరుగుతున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్ర విభ‌జ‌న‌తో వాహ‌న ర‌ద్దీ త‌గ్గింద‌ని, స‌రైన ఆదాయం లేదంటూ కాంట్రాక్ట్ సంస్థ ఆరు వ‌రుస‌ల ప‌నులు చేప‌ట్ట‌డం లేద‌ని తెలిపారు. ఎన్‌హెచ్ఏఐ, కాంట్రాక్ట్ సంస్థ మ‌ధ్య వివాదాన్ని ప‌రిష్క‌రించి త్వ‌ర‌గా ఈ ర‌హ‌దారి విస్త‌ర‌ణ చేప‌ట్టాల‌ని కోరారు.


ఐకానిక్ బ్రిడ్జి.. ఎలివేటెడ్ కారిడార్‌ 
క‌ల్వ‌కుర్తి నుంచి కొల్లాపూర్‌- సోమ‌శిల‌ వయా క‌రివెన- నంద్యాల మార్గాన్ని జాతీయ ర‌హ‌దారిగా ప్ర‌క‌టించి 142 కి.మీ. ప‌నుల‌కు టెండ‌ర్లు పిలిచి ప‌నులు ప్రారంభించార‌ని రేవంత్ రెడ్డి తెలిపారు. మిగిలిన 32 కి.మీ, ఐకానిక్ బ్రిడ్జికి టెండ‌ర్లు పిలిచార‌ని, ఆ ప‌నులు వెంట‌నే ప్రారంభించాల‌ని కోరారు. ఈ హైవే పూర్త‌యితే హైద‌రాబాద్ వాసుల‌కు తిరుప‌తికి 70 కిలోమీట‌ర్ల దూరం త‌గ్గుతుంద‌న్నారు. క‌ల్వ‌కుర్తి- నంద్యాల ర‌హ‌దారి.. హైద‌రాబాద్‌- శ్రీ‌శైలం రూట్లో ర‌హ‌దారిలో 67 కిలోమీట‌ర్ వ‌ద్ద (క‌ల్వ‌కుర్తి) ప్రారంభ‌మ‌వుతుంది. హైద‌రాబాద్‌- క‌ల్వ‌కుర్తి వ‌ర‌కు ఉన్న ర‌హ‌దారిని రెండు వ‌రుస‌ల నుంచి 4 వ‌రుస‌లుగా విస్త‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. క‌ల్వ‌కుర్తి-క‌రివెన వ‌ర‌కు నేషనల్ హైవే పూర్తయ్యే లోపు హైద‌రాబాద్‌- క‌ల్వ‌కుర్తి ర‌హ‌దారిని 4 వ‌రుసలుగా విస్తరించాలి. హైద‌రాబాద్‌-శ్రీ‌శైలం మార్గంలో 62 కిలోమీట‌ర్లు ఆమ్రాబాద్ టైగ‌ర్ రిజ‌ర్వు ఫారెస్టు ప‌రిధిలో ఉంది. అట‌వీశాఖ అనుమ‌తులు లేక అక్క‌డ ప‌నులు చేప‌ట్ట‌లేద‌ని తెలిపారు. ఆమ్రాబాద్ ప్రాంతంలో 4 వ‌రుస‌ల ఎలివేటెడ్ కారిడార్‌కు అనుమ‌తులు కోరారు.  


మంథ‌నికి జాతీయ ర‌హ‌దారి..
జాతీయ ర‌హ‌దారులలో మంథ‌నికి చోటు ద‌క్క‌లేద‌ని, జ‌గిత్యాల‌- పెద్ద‌ప‌ల్లి- మంథ‌ని- కాటారం స్టేట్ హైవేను నేషనల్ హైవేగా ప్ర‌క‌టించాల‌ని, నిధులు మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రిని రేవంత్ కోరారు. ఇది పూర్త‌యితే ఎన్‌హెచ్‌-565, ఎన్‌హెచ్‌-353సీ అనుసంధాన‌ం అవుతాయి. తెలంగాణ‌, మ‌హారాష్ట్ర, ఛ‌త్తీస్‌గ‌ఢ్ ప్ర‌జ‌ల‌కు ఈజీగా ఉంటుంది. ద‌క్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వ‌రం క్షేత్రానికి అనుసంధానత పెరుగుతుంద‌ని కేంద్ర మంత్రికి తెలంగాణ సీఎం వివ‌రించారు.