Telangana CM Revanth Reddy Requests to PM Modi: హైదరాబాద్: తెలంగాణలో పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజుల తెలంగాణ పర్యటనకు విచ్చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బేగంపేట ఎయిర్‌పోర్టులో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి ఓ జ్ఞాపిక అందజేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ నేత, ఎంపీ రాములు సైతం వారి వెంట ఉన్నారు. 


రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, అనుమతులు, నిధులపై విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి సహకారం అందించాలని మొత్తం 11 అంశాలపై ప్రధాని మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన రిక్వెస్ట్ చేశారు.


1.ఎన్టీపీసీలో 4000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉంటే గత ప్రభుత్వం 1600 మెగావాట్లు మాత్రమే సాధించింది. మిగిలిన 2400 మెగావాట్ల ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని అనుమతులు ఇస్తాం. 
2. హైదరాబాద్ మెట్రో విస్తరణ అభివృద్ధికి, అదే విధంగా మూసీ ప్రక్షాళన రివర్ ఫ్రంట్ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి. 
3.తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భూసేకరణ, నీటి వాటాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేంందుకు ప్రధాని మోదీ, కేంద్రం జోక్యం చేసుకోవాలి. 
4. హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై అమ్రాబాద్ ఫారెస్ట్ ఏరియా మీదుగా ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి సహకరించాలి. 2022-23లోనే కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ తయారీకి రూ,3 కోట్లు మంజూరు చేసింది. రూ.7700 కోట్ల అంచనా ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును మంజూరు చేయాలి. ఈ కారిడార్ తో అటు శ్రీశైలం వెళ్లే యాత్రికులతో పాటు హైదరాబాద్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లా వరకు 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. తద్వారా దక్షిణ తెలంగాణ వైపు రవాణ మార్గాలు విస్తరిస్తాయి. 
5. తెలంగాణలో నూటికి నూరు శాతం ఇంటింటికీ నల్లా నీటిని  అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలి. దాదాపు 10 లక్షల కుటుంబాలకు ఇప్పటికీ నల్లా నీళ్లు అందటం లేదు. సమీపంలోని నీటి వనరుల ద్వారా గ్రామాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల జీవన్ మిషన్ నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
6. తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్య, పోలీస్ కమిషనరేట్ల సంఖ్యకు అనుగుణంగా ఐపీఎస్ క్యాడర్ రివ్యూ చేయాలి. కేంద్ర హోంశాఖ 2016లో తెలంగాణకు 76 ఐపీఎస్ కేడర్ పోస్టులను మంజూరు చేసింది.  జిల్లాల పునర్వ్యవస్థీకరణ, పెరిగిన జనాభాను బట్టి రాష్ట్రంలో  పోలీసు అధికారుల అవసరం పెరిగింది. అత్యవసరంగా 29 పోస్టులను అదనంగా కేటాయించాల్సి ఉంది. ఐపీఎస్‌ క్యాడర్‌ రివ్యూను అత్యవసర అంశంగా పరిగణించాలి. వీలైనంత త్వరగా పోస్టులు మంజూరు చేయాలి. 




7. హైదరాబాద్- రామగుండం, హైదరాబాద్ -నాగ్‌పూర్ రహదారిపై రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. వీటితో పాటు కారిడార్ల నిర్మాణానికి కంటోన్మెంట్ ఏరియాలో 178 ఎకరాలు, 10 టీఎంసీల కేశవపురం రిజర్వాయర్ నిర్మాణానికి పొన్నాల గ్రామ సమీపంలోని 1350 ఎకరాల మిలిటరీ డెయిరీ ఫామ్ ల్యాండ్స్ (తోఫెఖానా) రాష్ట్రానికి బదిలీ చేయాలి. లీజు గడువు ముగిసిన శామీర్ పేటలో ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ (1038 ఎకరాల) భూములను తిరిగి అప్పగించాలి.
8. ఐఐటీ, నల్సార్, సెంట్రల్ యూనివర్సిటీ తో పాటు ఎన్నో పేరొందిన పరిశోధన, ఉన్నత విద్యా సంస్థలు హైదరాబాద్ లో ఉన్నాయి. అత్యున్నత విద్యా సంస్థలు అందరికీ అందుబాటులో ఉండాలని ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐఎం నెలకొల్పాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. అందులో భాగంగా హైదరాబాద్లో ఐఐఎం (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్) నెలకొల్పాలి. అందుకు అవసరమైనంత స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. 
9. నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తున్నాం. 5259 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర వాటాగా రాష్ట్రానికి రావాల్సిన రూ.347.54 కోట్లను వెంటనే విడుదల చేయాలి. 
10. భారత్ మాల పరియోజన జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా తెలంగాణకు ప్రయోజనంగా ఉండే ఎనిమిది ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి. కల్వకుర్తి-కొల్లాపూర్, గౌరెల్లి-వలిగొండ, తొర్రూర్-నెహ్రూనగర్, నెహ్రూనగర్-కొత్తగూడెం, జగిత్యాల-కరీంగర్ ఫోర్ లేన్, జడ్చర్ల-మరికల్ ఫోర్ లేన్, మరికల్-డియసాగర్  నిలిచిపోయిన టెండర్ల ప్రక్రియకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలి.   
11. తెలంగాణలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం సహకారాన్ని కోరుతున్నాం. ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో  ప్రధాన పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. సెమీ కండక్లర్లు, డిస్ ప్లే మ్యానుఫ్యాక్షరింగ్ రంగంలో కొత్త శకానికి నాంది పలికేందుకు ఇండియా సెమీ కండకర్ల మిషన్లో భాగంగా కేంద్రం సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.