CM Revanth Reddy Power Point Presentation On Flood Damage: తెలంగాణలోని (Telangana) పలు జిల్లాల్లో వరద నష్టం తీవ్రంగా ఉందని.. తక్షణ సాయం అందించడం సహా శాశ్వత పునరుద్ధరణ పనులకు తగిన నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను (Sivaraj Singh Chauhan) కోరారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో వరద ప్రభావం, నష్టం వివరాలను ఆయనకు.. సీఎం, అధికారులు పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో వరదల వల్ల రూ.5,438 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిపారు. ఎస్‌డీఆర్ఎఫ్ నిధుల విడుదల విషయంలో మార్గదర్శకాలు సడలించాలని కోరారు.


'ఒకే తీరుగా చూడండి'


ఏపీకి ఎలాంటి సాయం చేస్తారో తెలంగాణకు అదే స్థాయిలో చేయాలని.. రెండు రాష్ట్రాలను ఒకే విధంగా చూడాలని అన్నారు. 'వరద ప్రభావిత జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. పలు జిల్లాల్లో ఒక్క రోజే 40 సెం.మీల వర్షం కురిసింది. రహదారులు, ఇళ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర పంట నష్టం నెలకొంది. పొలాలన్నీ రాళ్లు, ఇసుక మేటలతో నిండిపోయాయి. వరద ప్రాంతాల్లో బాధితుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.10 వేలు పంపిణీ చేశాం.' అని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. కాగా, విపత్తుల సమయంలో ప్రజలకు సాయం అందించే విషయంలో పార్టీలు, రాజకీయాలు ఉండవని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలనూ ఒకే విధంగా చూస్తామని చెప్పారు.






తెలుగు రాష్ట్రాలకు రూ.3300 కోట్లు?


ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదలకు తక్షణ సాయం కింద కేంద్ర ప్రభుత్వం రూ.3,300 కోట్లు ప్రకటించిందని ప్రచారం జరిగింది. అయితే, ఈ సాయంపై ఎలాంటి సమాచారం లేదని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు.


విరాళాల వెల్లువ


మరోవైపు, రాష్ట్రంలోని వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. పలు రంగాల్లోని ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు విరాళాలు అందిస్తున్నారు. తాజాగా, జీఎంఆర్ గ్రూప్ రూ.2.50 కోట్ల భారీ విరాళం అందించగా.. కెమిలాయిడ్స్ కంపెనీ ఛైర్మన్ రంగరాజు రూ.కోటి విరాళంగా అందించారు. శ్రీచైతన్య విద్యా సంస్థల ప్రతినిధులు రూ.కోటి, విర్కో ఫార్మా రూ.కోటి, అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీతరెడ్డి రూ.కోటి, ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ రూ.కోటి.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారు. 


Also Read: Mahesh Kumar Goud: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ - ఏఐసీసీ అధిష్టానం కీలక నిర్ణయం