CM Revanth Reddy on Ex DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని... తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రంలో పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఉద్యమంలోనూ ఆమె  పాలుపంచుకున్నారు. అయితే... తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నళిని గురించి ఆలోచించలేదన్న విమర్శలు ఉన్నాయి. తెలంగాణలో బీఆర్‌ఎస్‌  ప్రభుత్వం... కాంగ్రెస్‌ సర్కార్‌ రావడంతో... మళ్లీ మాజీ డీఎస్పీ నళిని విషయం తెరపైకి వచ్చింది. మాజీ డీఎస్పీ నళినిని మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి  పలువురు విజ్ఞప్తి చేశారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. 


మాజీ డీఎస్పీ నళినికి మళ్లీ ఉద్యోగం చేయాలన్న ఆసక్తి ఉంటే ఆమెను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి.  నిన్న (శుక్రవారం) రాష్ట్ర సచివాలయంలో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, పోలీస్ శాఖపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా నళిని ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. తెలంగాణ కోసం  నళిని తన ఉద్యోగానికి రాజీనామా చేశారని.. ఆమెకు మళ్లీ ఉద్యోగం చేయాలని ఉంటే... వెంటనే పోస్టింగ్‌ ఇవ్వాలని ఆదేశించారు. డీఎస్పీ హోదాలో రాజీనామా చేసిన నళినికి  అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి పోలీసు శాఖలో నిబంధనలు అంగీకరించకపోతే... అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఉద్యోగాలు రాజీనామా చేసి  ఎన్నికల్లో పోటీ చేసి కొందరు... ఓడిపోయిన తర్వాత మళ్లీ ఉద్యోగుల్లో చేరిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు సీఎం. తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు వచ్చినప్పుడు... రాష్ట్ర సాధన కోసం ఉద్యోగం వదులుకున్న నళినికి మాత్రం ఎందుకు అన్యాయం జరగాలని ప్రశ్నించారు. వెంటనే ఆమెకు పోస్టింగ్‌ ఇవ్వాలని సీఎస్, డీజీపీని ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. 


అయితే.. ఇటీవల నళిని పేరుతో సోషల్‌ మీడియాలో ఇక సందేశం చక్కర్లు కొట్టింది. నా మనసులో మాట.. అంటూ సోషల్ మీడియాలో నళిని పేరుతో పోస్టు ప్రత్యక్షమైంది. తాను ఉద్యోగానికి రాజీనామా చేసి 12 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ తనను గుర్తుంచుకోవడంపై ఆమె స్పందించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తాను ఎవరినీ కలవలేదని.. ఎప్పుడూ తన కోసం ఏమీ అడగలేదని చెప్పుకొచ్చారు. ఇప్పటికి కూడా తనకు యాచించడం ఇష్టం లేదని.. ఆ అవసరం తనకు లేదని చెప్పుకొచ్చారు. ఒకవేళ ప్రజల ఒత్తిడి మేరకు, ప్రస్తుత ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ జాబ్ ఇచ్చినా, ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా తాను దానికి పూర్తి న్యాయం చేయలేనని స్పష్టం చేశారు. రుమటైడ్ ఆర్థరైటిస్ వల్ల తన ఫిజికల్ ఫిట్‌నెస్ పోయిందని.. చాలా కాలం గడిచింది కాబట్టి పోలీస్ ఆప్టిట్యూడ్‌ను కూడా తాను కోల్పోయానని వివరించారు. అటు.. టెక్నికల్‌ గానూ.. పోలీస్ సర్వీస్ రూల్స్ తన నియామకాన్ని ఒప్పుకోవని చెప్పుకొచ్చారు నళిని. గతంలో తాను పడిన ఇబ్బందిని కూడా గుర్తు చేశారు. అందుకే తాను ఉద్యోగం అడగనని.. కానీ బతికి ఉన్నంత వరకు ఏదో రకంగా ప్రజా సేవా చేస్తూనే ఉంటానని రాసుకొచ్చారు. అది నిజం నళిని పెట్టిన పోస్టేనే... కాదా అన్నదానిపై స్పష్టం లేదు.


ఇక... నిన్న (శుక్రవారం) రాష్ట్ర సచివాలయంలో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, పోలీస్ శాఖపై సీఎం సమీక్షించిన సీఎం రేవంత్‌రెడ్డి... పోలీసు శాఖలో వెంటనే నియామకాలు  చేపట్టాలని ఆదేశించారు. అంతేకాదు... నియామకాలు పారదర్శకంగా, అవకతవకలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు చేపట్టిన పోలీసు నియామకాలపై  నివేదిక ఇవ్వాలని కూడా కోరారు. హోంగార్డు నియామకాలను కూడా వెంటనే చేపట్టాలని సూచించారు. హోంగార్డులను హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ విధుల్లో  ఉపయోగించుకోవాలని సూచించారు. పోలీస్, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు రెసిడెన్సీ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని కూడా ఆదేశించారు సీఎం  రేవంత్‌రెడ్డి.