Just In





Revanth Reddy on SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి, హెలికాప్టర్‌లో ఘటనా స్థలానికి మంత్రి ఉత్తమ్
SLBC Tunnel Collapse | శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ కూలిన ఘటనలో కొందరు కార్మికులు గాయపడ్డారు. ప్రమాద సమయంలో లోపల 50 మంది వరకు ఉన్నారని నాగర్ కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు.

Telangana CM Revanth Reddy on SLBC tunnel collapse | ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్ వద్ద 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలడంతో అందులో పనిచేస్తున్న పలువురికి గాయాలయ్యాయి. ఇందులో ఇంజినీర్లు, సిబ్బంది ఉన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్, నాగర్‌కర్నూల్ ఎస్పీ, అగ్నిమాపక శాఖ, ఇరిగేషన్ విభాగం అధికారులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, కొందరు అధికారులు ప్రత్యేక హెలికాప్టర్ లో ప్రమాదం జరిగిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాంతానికి బయలుదేరారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కూలి కార్మికులకు గాయాలు
నాగర్‌కర్నూల్: ఎస్‌ఎల్‌బీసీ లోని ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది. మూడు మీటర్ల మేర పై కప్పు కూలడంతో కొందరు కార్మికులు లోపల చిక్కుకుపోయారు. మార్నింగ్ షిఫ్ట్‌లో 50 మంది వరకు కార్మికులు ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉన్నారు. దోమలపెంట సమీపంలో ఉదయం 8 గంటల ప్రాంతంలో టన్నెల్ పైకప్పు మూడు మీటర్ల మేర కూలడంతో అంతా ఆందోళనకు గురయ్యారు.
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ పైకప్పు కూలి కార్మికులు గాయపడటంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న మంత్రి ఉత్తమ్ హుటాహుటిన సంఘటనా స్థలికి బయలుదేరారు. సహాయక చర్యలపై అధికారులతో ఆరా తీసిన ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో టన్నెల్ లో ఘటన జరిగిన చోటుకు వెళ్తున్నారు. టన్నెల్ లోపలికి నీళ్లు వచ్చినట్లు తెలిసినట్లు చెప్పారు. ముగ్గురు కార్మికులకు గాయాలు కాగా, వారిని స్థానిక హాస్పిటల్ కు తరలించినట్లు తెలిపారు. గాయపడిన వారు జేపీ కంపెనీ కార్మికులు అని సమాచారం.
Also Read: SLBC Tunnel Collapse: కూలిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్, సొరంగంలో చిక్కుకున్న 50 కార్మికులు
నల్గొండ జిల్లాకు సాగునీరు, తాగునీరు అందించేందుకు దాదాపు 44 కిలోమీటర్ల మేర ఇన్ లెట్, అవుట్ లెట్ సొరంగాలు తవ్వాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకూ 34 కిలోమీటర్ల మేర పని పూర్తయింది. ఇంకా 10 కిలోమీటర్ల మేర పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు 2026 జూన్ వరకు పూర్తి చేసి, నల్గొండ వాసులకు సాగు, తాగునీరు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 18న పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం తవ్వకాలు చేస్తుంటే, ప్రమాదవశాత్తూ టన్నెల్ పైకప్పు మూడు మీటర్ల మేర కూలడంతో విషాదం నెలకొంది.
మంత్రి కోమటిరెడ్డి విచారం
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై మంత్రి కోమటిరెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు టన్నెల్ పనుల్లో భాగంగా శ్రీశైలం నుంచి దేవరకొండ వైపు వెళ్లే టన్నెల్ 14 కిలోమీటర్ వద్ద (దోమలపెంట వద్ద) సి పేజ్ ను పూడ్చివేసిన కాంక్రీట్ సెగ్మెంట్ స్లిప్ కావడంతో ప్రమాదం జరిగిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి టన్నెల్ వద్ద ఘటనపై అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు.