Telangana CM Revanth Reddy comments at Praja Deevena Sabha in Medchal: మేడ్చల్: గత కొన్ని రోజుల నుంచి కొందరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని కూతలు కూస్తున్నారని, కానీ ఎవరైనా తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే, ఫామ్ హౌస్ గోడలే కాదు, ఇటుకలు కూడా మిగలవు అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యానించారు. మేడ్చల్ లో శనివారం రాత్రి నిర్వహించిన ప్రజా దీవెన సభ (Praja Deevena Sabha)లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడంతో... గత పదేళ్లలో ఈ ప్రాంత అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో సమస్యలను వేగంగా పరిష్కరించి.. అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నామని చెప్పారు.
అల్లాటప్పాగా అధికారంలోకి రాలేదు..
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కూలుతదని కొందరు అంటున్నారు. మేం అల్లాటప్పాగా అధికారంలోకి రాలేదు. మా ప్రభుత్వాన్ని కూల్చేంత మొనగాడు ఎవడైనా ఉన్నాడా ? ఒకవేళ ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే.. ఫామ్ హౌస్ గోడలే కాదు, ఇటుకలు కూడా మిగలవు అని గుర్తుంచుకోవాలి. రైతు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే మీ కళ్లు మండుతున్నాయా?.
ఆడబిడ్డలకు 43శాతం ఉద్యోగాలు
ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇస్తలేరని ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతుంది. మేం భర్తీ చేసిన 30వేల ఉద్యోగాల్లో 43శాతం ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చాం. పేర్లతో సహా లెక్కలు చెప్పేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. చేతనైతే కేసీఆర్ ను అసెంబ్లీకి పంపిస్తే.. లెక్కలు చెబుతాం. ధర్నా చౌక్ వద్దన్న వాళ్లు నేడు సిగ్గులేకుండా వెళ్లి ధర్నా చౌక్ లో ధర్నా చేస్తుండ్రు. తెలంగాణ కేబినెట్‌లో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకపొతే కేసీఆర్‌ను అడగని వాళ్లు కూడా ఇప్పుడు మహిళల గురించి మాట్లాడుతున్నారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలిపోయింది.. హరీష్ రావు మేడిగడ్డకు రమ్మంటే వస్తలేడు. అసెంబ్లీలో మైక్ ఇస్తే మాట్లాడడు. పదేళ్లలో జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యను కూడా తీర్చలేకపోయారు. మేడ్చల్ ప్రాంతానికి ఐటీ పరిశ్రమలు రావాలి, భూముల విలువ పెరగాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని’ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
ప్రాంతీయ పార్టీలతో పొత్తు ఎందుకు మోదీ?
లోక్‌సభ ఎన్నికల్లో (Loksabha Elections 2024) బీజేపీకి 400 సీట్లు వస్తాయంటున్న ప్రధాని మోదీ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు ఎందుకు పెట్టుకుంటున్నారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మోదీ పాలనకు ఇక కాలం చెల్లింది. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందన్నారు. ఎన్డీయేను అతుకుల బొంత అని ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతానికి ఎన్నడూ రాని ఈటెల రాజేందర్ ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారు? అని రేవంత్ ప్రశ్నించారు. హుజూరాబాద్ ప్రజలు ఈటలను ఓడిస్తే, మల్కాజ్‌గిరికి వచ్చి గెలుస్తా అని ఎలా అనుకుంటున్నాడో అన్నారు. మేడ్చల్ కు మెట్రో రావాలన్నా, ఐటీ పరిశ్రమలు రావాలన్నా మల్కాజిగిరి పార్లమెంటులో కాంగ్రెస్ గెలవాలని పిలుపునిచ్చారు.