Congress Jana Jathara Sabha at Tandur | హైదరాబాద్: తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారం చివరిరోజు సీఎం రేవంత్ రెడ్డి పలు చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. మొదట మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రియాంక గాంధీతో పాటు భారీ బహిరంగ సభలో పాల్గొని చేవెళ్ల ఎంపీ అభ్యర్థిని గెలిపించి పార్లమెంట్ కు పంపించాలని కోరారు.


మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా రేవంత్ రెడ్డి శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నీలం మధుకు మద్దతుగా పటాన్ చెరులో నిర్వహించిన కార్నర్ షోలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పటాన్ చెరు మినీ ఇండియా లాంటిదని, ఎన్నో రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి నివసిస్తున్నారని చెప్పారు. బీజేపీది విభ‌జించు, పాలించు సిద్దాంతం అని, అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరారు. హిందూ, ముస్లింల మధ్య చిచ్చు రాజేసి రాజకీయాలు చేసి, బీజేపీ సీట్లు నెగ్గే ప్రయత్నం చేస్తుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పటాన్ చెరు ప్రాంతానికి గోదావరి జలాలు రావాలన్నా, మెట్రో రైలు రావాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. 


మాదిగల వర్గీకరణతో పాటు ముదిరాజులను బీసీ-డీ గ్రూప్ నుంచి బీసీ-ఏ గ్రూప్ లోకి మార్చాలన్నా కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు రేవంత్. రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ అగ్రనేతలు చెబుతున్నారని, రాజ్యాంగాన్ని సైతం మార్చే యోచనలో బీజేపీ ఉందని ఆరోపించారు. యువతకు ఉద్యోగాలు రావాలన్నా, ఉపాధి అవకాశాలు పెరగాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వచ్చినా కొత్త ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకపోగా, ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం మాత్రం చేశారని విమర్శించారు. 


రైతు రుణమాఫీ చేస్తాం.. సీఎం రేవంత్ భరోసా
రైతులకు రుణమాఫీ చేసి వారి రుణం తీర్చుకుంటానని రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం నిర్లక్ష్యంతో రంగారెడ్డి జిల్లా వెనుకబడిందని, అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులు నెగ్గాలన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీతో కలిసి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు రంగారెడ్డిని చేపట్టింది కాంగ్రెస్ పార్టీ అని, కానీ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఎన్నిసార్లు అడిగినా పాలమూరు ప్జాజెక్టుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ జాతీయ హోదా ఇవ్వలేదని ఆరోపించారు.



చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ కు పంపించాలని ప్రజలను రేవంత్ రెడ్డి కోరారు. పార్లమెంట్ లో మన బలం పెరిగితే ప్రాజెక్టులకు జాతీయ హోదా, తెలంగాణ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. రైల్వే కోచ్‌, ఐటీఐఆర్‌ కారిడార్‌, బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగినా కేంద్రం ఇవ్వలేదన్నారు. రైతు భరోసా కింద రూ.7500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిధులు ఇవ్వలేదు, కాలేజీలు ఇవ్వలేదు, ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదని, కేంద్రం తెలంగాణకు కేవలం గాడిద గుడ్డు ఇచ్చిందంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.