రాజకీయ వ్యూహాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ స్టైలే వేరు..! దానికి హుజూరాబాద్ ఎన్నికలే తాజా రుజువు. ఆయన దళిత బంధు దెబ్బకు ఇతర పార్టీలన్నీ హడలెత్తిపోతున్నాయి. అయితే.. కేసీఆర్ హుజూరాబాద్ పైనే కాదు.. 2023లో జరగబోయే ముందస్తు ఎన్నికలకూ ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో దళిత బంధును అస్త్రంగా చేసుకుని.. వారందరికీ బంధువుగా మారే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్.. ఎన్నికల తర్వాత మరో ప్రభావవంతమైన సామాజికవర్గానికి "బంధువు"గా మారేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని టీఆర్ఎస్ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది.
ఈటలను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయక ముందు నుంచీ.. తెలంగాణలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై చర్చ జరుగుతోంది. చాలా మంది ఆశావహులు.. తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ సారి మంత్రివర్గ విస్తరణ లేదా పునర్‌వ్యవస్థీకరణ అంటూ జరిగితే .. అది ఎన్నికల కేబినెట్ అవుతుంది. అందుకు ఆయన ఇప్పటి నుంచే శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఓ కీలక సామాజికవర్గానికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ మార్క్
మాటల తూటాలతో ప్రత్యర్థులను కట్టడిచేయడంలోనూ.. రాజకీయ వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి చేయడంలో కేసీఆర్ చాలా సమర్థులు. తెలంగాణ రాజకీయ యువనిక మీద తాజాగా మారుతున్న పరిస్థితులను అనుసరించి ఆయన కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఖమ్మం, వరంగల్, నిజామాబాద్‌తో పాటు గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రభావం చూపగలిగే స్థితిలో ఉన్న ఓ సామాజికవర్గానికి రాజకీయంగా మరింత ప్రాధాన్యత కల్పించబోతున్నారని తెరాస సర్కిల్‌లో ప్రచారం సాగుతోంది. హైదరాబాద్‌తో సహా.. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన సామాజికవర్గంగా ఉన్న వీరికి రాష్ట్ర విభజన తర్వాత పరిణామాల్లో రాజకీయ ప్రాధాన్యత తగ్గింది. వారికి బలమైన స్థానం ఇవ్వడం ద్వారా ఆ లోటును భర్తీ చేయడంతో పాటు మిగతా ప్రయోజనాలు కూడా సాధించే వీలుంది. ఆ వర్గం వారిని డిప్యూటీ సీఎం చేయడం ద్వారా ఖమ్మం, నిజామాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతాల్లో ప్రయోజనం పొందాలన్నది కేసీఆర్ వ్యూహం.
మారిన పరిస్థితులు
తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా నవతెలంగాణకు తొలి సీఎం అయిన కేసీఆర్ కిందటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒకింత గట్టిపోటీనే ఎదుర్కొన్నారు. అప్పుడు ఒంటరిగా అందరినీ ఎదుర్కొన్న కేసీఆర్‌కు పార్లమెంట్, దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ రూపంలో గట్టిషాక్‌లే తగిలాయి. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో తెరాస స్వీప్ చేసినప్పటికీ.. పరిస్థితుల్లో వచ్చిన మార్పును కేసీఆర్ గుర్తించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచే ఓ ప్రధాన సామాజిక వర్గం మరింత బలపడుతున్న సూచనలు కనిపిస్తుండటంతో కేసీఆర్ కౌంటర్‌కు రెడీ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో వారికి బలమైన రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న సామాజికవర్గాన్ని దగ్గరకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే దళిత బంధు పేరుతో ఆ వర్గాలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్... తమకు గ్యాప్ ఉన్న చోట్ల ఈ రూపంలో సర్దుబాటు చేస్తున్నారు. వీరు రాజకీయంగా ప్రభావవంతమైన వ్యక్తులే కాకుండా.. ఆర్థికంగా బలమైన వాళ్లు. వీరి మద్దతు కోసం కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టిన వైఎస్ షర్మిళ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి ముందునుంచీ ఆ సామాజికవర్గంలో మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో తెరాస జాగ్రత్త పడుతోంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత.. ఆ వర్గం వాళ్లు టీఆర్ఎస్‌కే మద్దతు తెలుపుతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లోనూ అది కనిపించింది. ఇప్పుడు ఇప్పుడు వాళ్లకు డిప్యూటీ సీఎంగా మరింత ప్రాధాన్యత ఇచ్చి ఓటు బ్యాంక్‌ను మరింత పటిష్టం చేసుకోవాలన్నది టీఆర్ఎస్ ఆలోచన.
హుజూరాబాద్ ఎన్నికల తర్వాతే
ప్రస్తుతం టీఆర్ఎస్ దృష్టి అంతా హుజురాబాద్ ఎన్నికలపైనే ఉంది. తన కేబినెట్‌లో నుంచి తొలగించిన ఈటల రాజేందర్.. ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం అది..! అక్కడ గెలవడం ద్వారా తమ పవర్ చూపించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అందుకోసం మొత్తం మంత్రులంతా పనిచేస్తున్నారు. ఆ ఎన్నికల తర్వాత ఈ సరికొత్త వ్యూహాన్ని అమలుచేయనున్నారు.
అయితే దీనిపై 'ఏబీపీ దేశం' టీఆర్ఎస్ నేతలను సంప్రదించినా.. ఎవరూ పెదవి విప్పడం లేదు.