CM KCR Public Meeting: బీఆర్ఎస్ పార్టీ నేడు మహారాష్ట్రలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. లోహా నియోజకవర్గంలోని నాందేడ్ లో ఏర్పాటు చేసిన ఈ సభకు ఎక్కువ మంది ప్రజలు హాజరయ్యేలా పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. అయితే మహారాష్ట్ర లో బీఆర్ఎస్ సభ నిర్వహించడం ఇది రెండోసారి. అయితే అక్కడ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా.. సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్ ను దేశ వ్యాప్తంగా, అన్ని రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించిన సీఎం కేసీఆర్.. అన్ని రాష్ట్రాల నేతలకు ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని బీజేపీ, ఎన్సీపీ, కాంగ్రెస్ తదితర పార్టీల నాయకులతో పాటు ఛత్రపతి శివాజీ వారసులు అయిన నేతలు కూడా ముందుకొచ్చారు. తెలంగాణను ఆనుకొని ఉన్న మహారాష్ట్ర గ్రామాలు ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలును కోరుతున్నారు. వాటన్నిటిని పరిగణలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ మొదట మహారాష్ట్రలో తమ పార్టీ కార్యక్రమాల విస్తరణ వైపుగా అడుగులు వేస్తున్నారు. 


పార్టీ బలోపేతమే లక్ష్యంగా మహారాష్ట్రలో సభ


ఈ క్రమంలో భాగంగానే ఫిబ్రవరి 5వ తేదీన నాందేడ్ జిల్లా మొదటి సారి భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభకు వేలాది మంది తరలిరావడం, భారీ స్థాయితో సభ సక్సెస్ కావడంతో మహారాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద తమ పార్టీ పేరును నమోదు చేయించారు. తెలంగామ ప్రజలు ఎక్కువగా ఉన్న నాందేడ్ తో పాటు ఠాణె, అహ్మద్ నగర్, శిర్డీ, బ్రుహన్ ముంబై లాంటి కార్పొరేషన్లలో పోటీకీ సన్నద్ధం అవుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్.. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ సభను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే హైదరాబాద్ లో తన అనుచరులతో సీఎం కేసీఆర్ ను కలిసి తమ వద్ద సభ నిర్వహించాలని లోహా మాజీ ఎమ్మెల్యే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ నేత శంకర్ గణేశ్ రావు ధోంగె. దీంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నేతరు 10 రోజులుగా అక్కడే ఉండి ఈరోజు జరిగే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. 


మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరనున్న సీఎం కేసీఆర్


అయితే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో మహారాష్ట్రలోని లోహాకు వెళ్తారు. 3 గంటలకు స్థానిక నేతలతో సమావేశమై 4 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ సభలో పరువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ పార్టీల నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరుతారు. అయితే దీని తర్వాత సీఎం కేసీఆర్ దేనిపై చర్చించనున్నారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.  అయితే బీజేపీ ప్రభుత్వం.. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం, విచారణకు పిలవడం వంటి వాటిపై స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి సీఎం కేసీఆర్ దేనిపై చర్చించనున్నారో.