PRC In Telangana:
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్ చెల్లింపుకోసం పే రివిజన్ కమిటీని ( PRC) నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ చైర్మన్ గా రిటైర్డ్ ఐఎఎస్ ఎన్. శివశంకర్ ను , సభ్యునిగా బి. రామయ్య (రిటైర్డ్ ఐఎఎస్) ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.6 నెలల్లోపు కమిటీ నివేదికను ప్రభుత్వానికి అంద చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పే రివిజన్ కమిటీకి కార్యకలాపాలకు అవసరమయ్యే నిధులను, సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించింది.
మరోవైపు ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. 5 శాతం మధ్యంతర భృతి (Interim relief ) ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
తెలంగాణ సర్కార్ నిర్ణయంపై మంత్రి హరీష్ రావు హర్షం..
ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పే రివిజన్ కమిటీని (పీఆర్సీ) ఏర్పాటు చేయడం, 5 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ని చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడం శుభపరిణామం అన్నారు మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 9 ఏళ్లలో రెండు పిఆర్సీలు ఇవ్వడంతో పాటు, శాసనసభలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ మూడో పిఆర్సీని నియమించి, తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మరోసారి నిరూపించారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ సందర్భంగా హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు.
Telangana CM KCR has announced the constitution of a Pay Revision Commission to revise the pay scales of State Government employees.