తెలంగాణ జానపద కళాకారుడు కిన్నెర మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. మొగిలయ్యాకు రూ. కోటి నజరానా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అలాగే హైదరాబాద్ లో ఇంటి స్థలం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల కేంద్రం మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది.  మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు రావడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కళాకారుడు మొగిలయ్య అని అభినందించారు. ఇప్పటికే మొగిలయ్య కళను తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందన్నారు. తెలంగాణ కళలను పునరుజ్జీవం చేసుకుంటూ కళాకారులను గౌరవిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. కిన్నెర మొగిలయ్యను సీఎం కేసీఆర్ శాలువా కప్పి సత్కరించారు. 






సీఎం కేసీఆర్ గుర్తింపుతో 


ఇటీవల పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన దర్శనం మొగిలయ్య స్వస్థలం నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం అవుసలికుంట. 12 మెట్ల కిన్నెర వాయిద్యాన్ని పలికించే వారిలో ఆయన ఆఖరితరం కళాకారుడు. తనకు పద్మశ్రీ రావడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కిన్నెరమెట్ల కళ చాలా అద్భుతమైందన్నారు. ఈ కళ తనతోనే అంతరించిపోకూడదన్నారు. ఇలాంటి సమయంలో తనకు పద్మశ్రీ పురస్కారం రావడంతో కిన్నెరమెట్ల కళకు జీవం పోసినట్లే అన్నారు. సీఎం కేసీఆర్‌ ఈ కళను గుర్తించి పురస్కారాన్ని ఇవ్వడంతో ఈ గుర్తింపు వచ్చిందన్నారు.  


పూట గడవని స్థితి నుంచి 


దర్శనం మొగిలయ్యా తన కళను అందరికీ పరిచయం చేయాలని తపించేవారు. గ్రామాల్లో తిరుగుతూ జానపద గేయాలు ఆలపించేవారు. ఎంతో అందంగా ముస్తాబు చేసిన 12 మెట్ల కిన్నెరతో అందరినీ తన పాటలతో అలరించేవారు. గ్రామస్థాయి నుంచి సినిమాల్లో పాటలు పాడే స్థాయికి ఎదిగారు. ఆయన ప్రతిభను తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఎన్నో సత్కారాలు అందించింది. టీఎస్ఆర్టీసీ బస్సులపై కూడా ఆయన పాట పాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించడానికి ప్రభుత్వం మొగిలయ్యకు బస్‌ పాస్‌ సౌకర్యం కల్పించింది. తెలకపల్లి మండలం గుట్టరాయిపాకులలో పుట్టిన మొగిలయ్య తన తాత, తండ్రి నుంచి కిన్నెర వాయిద్యం వాయించడం నేర్చుకున్నారు. ఆయన ప్రస్తుతం అవుసలికుంటలో స్థిరపడ్డారు. పూట గడవని స్థితిలో కిన్నెర కళనే నమ్ముకున్న మొగిలయ్య పాఠశాలల్లో ప్రదర్శనలు ఇచ్చేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయన కళకు గౌరవం దక్కింది. ఇప్పుడు దేశంలో అత్యున్నత పురష్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డు ఆయన్ను వరించింది. ఇందుకు ఆయన తెలంగాణ ప్రభుత్వం, కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. 


Also Read: తెలంగాణలో జ్వర సర్వేపై కేంద్రం కితాబు... బూస్టర్ డోస్ మధ్య కాల వ్యవధి తగ్గించాలి... మంత్రి హరీశ్ రావు