Kodandaram and Azhar as MLCs under Governor quota: గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు అభ్యర్థులుగా కోదండరాం, అజహరుద్దీన్ పేర్లను తెలంగాణ కేబినెట్ సిఫారసు చేసింది. ఇంతకు ముందు ఈ కోటాలో కోదండరాంతో పాటు సియాసత్ పత్రిక ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ ఉండేవారు. బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ దాఖలు చేసిన పిటిషన్ విచారణలో.. వారి నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీంతో కొత్తగా ఎమ్మెల్సీలను సిఫారసు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ కారణంగా కోదండరాం పేరును అలాగే ఉంచి.. అమీర్ అలీ ఖాన్ పేరును తప్పించి అజహర్ పేరును చేర్చారు.                  

అజహరుద్దీన్ జూబ్లిహిల్స్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. తనకే టిక్కెట్ అని ప్రకటించుకున్నరాు. అయితే అనూహ్యంగా ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పంపడం  రాజకీయవర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ స్థానం సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఖాళీ అయింది. అమీర్ అలీ ఖాన్  ను కాదని.. అజహర్ కు చాన్స్ ఇచ్చారు.                      2023 జూలైలో, గత భారత రాష్ట్ర సమితి  ప్రభుత్వం దాసోజు శ్రావణ్ కుమార్ ,  కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది, కానీ అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వారి పేర్లను తిరస్కరించారు. కేసీఆర్ ఆ తర్వాత వారి పేర్లనే సిఫారసు చేయలేదు. ఎవరి పేర్లనూ సిఫారసు చేయకపోవడంతో తర్వాత అధికారంలోకి వచ్చిన  కాంగ్రెస్ ప్రభుత్వం  2024 జనవరిలో కోదండరాం , అమీర్ అలీ ఖాన్‌లను సిఫారసు చేసింది, దీనిని  గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించారు.        

ఈ నామినేషన్లను తెలంగాణ హైకోర్టు 2024 మార్చిలో రద్దు చేసింది, గవర్నర్ నిర్ణయం కేబినెట్ సలహాకు విరుద్ధంగా ఉందని పేర్కొంది.  అయితే మళ్లీ పేర్లను కేబినెట్ సిఫారసు చేయవచ్చని  తెలిపింది. దీంతో వారి పేర్లనే రేవంత్ సర్కార్ సిఫారసు చేసింది. దీనిపై బీఆర్ఎస్ నేతలు కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  సుప్రీం కోర్టు  కోదండరాం ,  అమీర్ అలీ ఖాన్‌లు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపేందుకు అంగీకరించలేదు. దీంతో వారు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు.  అయితే, సుప్రీం కోర్టు 2025 ఆగస్టు 13న ఈ నామినేషన్లను రద్దు చేస్తూ, వారి నియామకం హైకోర్టు ఆదేశాలను తప్పుగా అర్థం చేసుకుని జరిగిందని, కొత్త సిఫారసుల ద్వారానే ఎమ్మెల్సీ నియామకాలు జరగాలని స్పష్టం చేసింది.

దీంతో కేబినెట్ మళ్లీ రెండు పేర్లను సిఫారసు చేయాలని నిర్ణయించుకుంది. కోదండరాంను పదిహేను రోజుల్లో ఎమ్మెల్సీని చేస్తామని ఇటీవల ఓయూలో జరిగిన కార్యక్రమంలో రేవంత్ ప్రకటించారు. ఇప్పుడు అనూహ్యంగా అజహర్ పేరుతో కలిసి సిఫారసు చేశారు.  అజహర్‌కు ఎమ్మెల్సీ ఇచ్చారంటే.. జూబ్లిహిల్స్ కు కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకు రానున్నారని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.