ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తొలిసారిగా కొత్త సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభం అయింది. ఈ స‌మావేశంలో మంత్రులతోపాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలపై చర్చించడంతోపాటు పలు కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. జూన్‌ 2 నుంచి 21 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.


గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల ఎంపిక, గవర్నర్‌ తిరస్కరించిన బిల్లులను తిరిగి ఆమోదించడానికి శాసనసభ సమావేశాలను నిర్వహించడం, రాష్ట్రం ఆవిర్భవించి 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ ప్రజలకు మేలు చేకూర్చే ఏదైనా కొత్త పథకం ప్రకటించడం, తదితర అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.