Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29న కేబినెట్ భేటీ నిర్వహించనుంది. గవర్నర్ కోటా కింద ప్రభుత్వం సిఫార్సు చేసిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను సోమవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించడం వివాదానికి దారి తీసింది. దీనిని ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టడమే కాకుండా తమిళిసై టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు. గవర్నర్ నిర్ణయాన్ని మంత్రులు, బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమె పనిచేశారని, అలాంటి వారిని గవర్నర్‌గా నియమించవచ్చా? అంటూ ప్రశ్నిస్తున్నారు.


ఈ క్రమంలో కేబినెట్ భేటీ నిర్వహించనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. గవర్నర్ నిర్ణయంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. తదుపరి ఎలా చేయాలనే దానిపై కేబినెట్ భేటీలో కేసీఆర్ చర్చించనున్నారు. వేరేవారిని నామినేట్ చేయాలా? లేదా గవర్నర్ నిర్ణయంపై న్యాయపరంగా ముందుకెళ్లాలా? అనే దానిపై చర్చ జరగనుందని తెలుస్తోంది. దీంతో పాటు ప్రభుత్ ఉద్యోగులకు డీఏ పెంపుపై కేబినెట్ భేటీలో చర్చ జరిగే అవకాశముందని తెలుస్తోంది. వీటితో పాటు ఎన్నికల నేపథ్యంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుందని చెబుతున్నారు.


షెడ్యూల్ ప్రకారమే డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వికాస్ రాజ్ స్పష్టం చేశారు.  దీంతో ఎన్నికలకు మరో రెండు నెలలు మాత్రమే సమయం ఉంది. వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది. ఈ తరుణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే సంక్షేమ, అభివృద్ది పనులను షురూ చేసింది. కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు పెండింగ్ పనులను పూర్తి చేస్తోంది. అలాగే కొత్త అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇక సంక్షేమ పథకాల విషయానికొస్తే డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీని ప్రారంభించడంతో పాటు బిసీలు, మైనార్టీ కుటుంబాలకు రూ.లక్ష అందిస్తున్నారు. అలాగే గృహలక్ష్మి పథకం ద్వారా సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునేవారికి రూ.3 లక్షల ఆర్ధిక సాయం చేయనుంది.


ఎన్నికల నేపథ్యంలో మరికొన్ని కొత్త పథకాలను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈ నెల 29న జరగనున్న కేబినెట్ భేటీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై అందరి దృష్టి పడింది. వచ్చే నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశముండటంతో.. ఇదే చివరి కేబినెట్ సమావేశం అవుతుందనే చర్చ జరుగుతోంది. వచ్చే నెల దసరా తర్వాత నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాలనే యోచనలో ఉన్నారు. ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. వచ్చే నెలలో బహిరంగ సభ ఏర్పాటు చేసి మేనిఫెస్టోను ప్రకటించేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే 115 అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించగా.. దసరా తర్వాత మిగతా స్థానాలను అభ్యర్థులను ఖరారు చేయనుంది. బీఆర్ఎస్ మేనిఫెస్టోను కూడా సిద్దం చేస్తోంది. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో కీలక పథకాలను ప్రకటించింది. దీంతో వాటికి పోటీగా హామీలు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో ఇందులో ఎలాంటి హామీలు ఉంటాయనేది హాట్‌టాపిక్‌గా మారింది.