TS Cabinet Meet : మార్చి 9వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం కేసీఆర్అధ్యక్షత‌న హైదరాబాద్ ప్రగ‌తి భ‌వ‌న్‌లో ఈ నెల 9న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు మంత్రి మండలి స‌మావేశం నిర్వహించ‌నున్నారు. ఈ స‌మావేశానికి మంత్రులందరూ హాజ‌రుకానున్నారు. ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించనున్నట్లు సమచారం.  అలాగే కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బడ్జెట్‌ ఆమోదం కోసం కేబినెట్‌ సమావేశం అయింది.  రాష్ట్రప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలకు బడ్జెట్ ఆమోదం పొందిన రోజే కేబినెట్ ఆమోదముద్ర వేసింది.  మరికొన్ని అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేందుకు కేబినెట్‌ ఈ నెల 9న సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.


ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్థికసాయంపై చర్చ 


సొంత ఇళ్ల స్థలాలు ఉన్న వారికి, ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. సొంత స్థలాలు ఉండి ఇళ్లు లేని నిరుపేదలకు 3 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రెండు పడక గదుల ఇళ్లు మంజూరు అయి నిర్మాణాలు జరగని గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని కూడా నిర్ణయించింది. అంతే కాకుండా గతంలో ప్రవేశ పెట్టిన రూ.5.04 లక్షల పథకం మంజూరు కాని వారిని రూ.3 లక్షల పథకంలో అర్హులుగా గుర్తించాలని సూచించింది. ఈ విషయాలకు సంబంధించి కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీపై స్పష్టమైన కార్యాచరణపై కేబినెట్‌లో చర్చించే అవకాశముంది. దీనిపై మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే చర్చించింది. అవసరమైన చోట ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. ఈ అంశంపై కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశముంది.  మరోవైపు గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉన్న బిల్లులకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. ఇతర కీలక పథకాలపైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. 


పది బిల్లులు పెండింగ్‌లో పెట్టిన గవర్నర్ తమిళిసై !   


ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ వద్ద అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలు ఆమోదముద్ర వేసిన 8 బిల్లుల్లో ఒక్క  బిల్లును మాత్రమే ఆమోదించారు. ఏడు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించిన బిల్లుల్లో  ద్రవ్య వినిమయ బిల్లుకు వెంటనే ఆమోదముద్ర వేసిన గవర్నర్‌ తమిళి సై మరో మూడు   బిల్లులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మొత్తం పది బిల్లులపై గవర్నర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది.  దీనిపై గతంలో తెలంగాణ మంత్రులు విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నేరుగా  సుప్రీంకోర్టుకు వెళ్లింది. గవర్నర్ బిల్లులను ఆమోదించడంలేదని.. వెంటనే నిర్ణయం తీసుకునేలా గవర్నర్ ను ఆదేశించాలని కోరింది.  గవర్నర్ బిల్లులను తిరస్కరిస్తే మరోసారి అసెంబ్లీలో ఆమోదించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించే అవకాశం ఉంది. ఆమోదిస్తే సమస్య ఉండదు. అటు మోదించకుండా.. ఇటు తిరస్కరిచకుండాపెండింగ్‌లో పెట్టడంతో ఆ చట్టాలను అసెంబ్లీ పాస్ చేసినా.. అమల్లోకి  రావడం లేదు.