Telangana BJP What Next : ఒక్క ఉపఎన్నికతో అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఫేవరేట్‌గా బరిలోకి దిగాలని భారతీయ జనతా పార్టీ లెక్కలేసుకుంది. అందుకే నాలుగేళ్ల నుంచి ఊగిసలాడుతున్న రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని ఉపఎన్నిక తీసుకు వచ్చింది. వెంటనే రాజగోపాల్ రెడ్డినే బరిలోకి దించింది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినప్పుడు.. తర్వాత కూడా బీజేపీదే గెలుపన్న అంచనాలు వినిపించాయి. కానీ తర్వాత సీన్ మారిపోయింది. ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ టీఆర్ఎస్ పుంజుకుంది. బీజేపీ వెనుకబడిపోయింది. ఫలితాల్లోనూ అదే కనిపించింది. మరి ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏమిటి ?
మునుగోడులో గెలిచి తీరుతామన్న నమ్మకంతో ముందుడుగు - బోర్లా పడిన వైనం !
భారతీయ జనతా పార్టీ మునుగోడులో గెలిచి తీరుతామన్న గట్టి నమ్మకంతోనే ఉపఎన్నికలకు వెళ్లింది. పరిస్థితి తేడా వస్తే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీపై ప్రభావం ఉంటుందని ఆ పార్టీ నేతలకు తెలియకుండా ఉండదు. కానీ రంగంలోకి దిగారంటే వారికి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే అది నమ్మకం కాదని.. అతి విశ్వాసం అని తేలిపోయింది. ఇప్పుడు ఆ పార్టీ తీరుపై అనేక రకాల విమర్శలు రావడం సహజం. మునుగోడులో గెలిస్తే.. ఫైనల్స్‌ను హాట్ ఫేవరేట్లుగా ప్రారంభించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడా అవకాశం లేకుండా పోయింది.
గెలిచి ఉంటే పెద్ద ఎత్తున చేరికలు ఉండేవి .. కానీ ఇప్పుడు?
ముునుగోడులో బీజేపీ గెలిచి ఉంటే పెద్ద ఎత్తున చేరికలు ఉండేవి. ఫామ్ హౌస్ ఫైల్స్ తో డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు చేస్తారనే ఆందోళన ఉన్నా .. చాలా మంది రాజకీయ నేతలు.. తమ భవిష్యత్‌పై భయంతో పార్టీలో చేరేవారు. గాలి బీజేపీ వైపు ఉందని వారు నమ్మేవారు. కానీ ఇప్పుడా చాన్స్ లేకుండా పోయింది. టీఆర్ఎస్ నుంచి వచ్చి చేరేవారు దాదాపుగా ఉండరు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు రూ. వంద కోట్లు తీసుకున్నామన్న నిందను వారు భరించలేరు. - టీఆర్ఎస్‌లో టిక్కెట్ డౌట్ .. రాదు అని క్లారిటీ వచ్చే వరకూ బయటకు రారు. వచ్చినా బీజేపీలో చేరుతారన్న గ్యారంటీ లేదు. నిజానికి బీజేపీ.. మునుగోడులో గెలిచిన తర్వాత.. మరి కొన్ని ఉపఎన్నికలకు ప్లాన్ చేసుకుందన్న అనుమానాలు చాలా కాలంగా ఉన్నాయి. ఇవన్నీ ఇక షెడ్డుకెళ్లినట్లే.
ఇప్పుడు ఇక రేసులో ఉన్నామని నిరూపించుకోవడమే కష్టం !
అసలు అడ్వాంటేజ్ సాధించాలనుకుని.. రాజకీయ వ్యూహం పన్నిన బీజేపీ.. మునుగోడు ఫలితంతో ఒక్క సారిగా బ్యాక్ స్టెప్ వేయాల్సి వచ్చింది. మీడియాలో చూపించుకున్న ఊపు ఇప్పుడు తగ్గిపోయినట్లు అయింది. ఇక ముందు ఎలాంటి ఉపఎన్నికలు ఉండవు. నేరుగా ఎన్నికలకే ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే బీజేపీకి ప్రస్తుత పరిస్థితుల్లో అదంత తేలిక కాదు. మళ్లీ పూర్తి స్థాయిలో .. పాజిటివ్ టాక్‌ను తెచ్చుకోవాల్సి ఉంటుంది. అవునన్నా.. కాదన్నా బీజేపీకి గతంలో ఉన్నంత పాజిటివ్ ఉండదు. ఫామ్ హౌస్ ఫైల్స్ తర్వాత ఆ పార్టీపై ప్రజల్లో ఎంతో కొంత మైనస్ అవుతుంది. కేసీఆర్ కూడా ఈ విషయాన్ని ప్రజల్లో పెట్టాలనుకుంటున్నారు కానీ న్యాయస్థానాల ద్వారా శిక్షించడాన్ని రెండో ఆప్షన్ గా పెట్టుకున్నారు. అందుకే ఈ విషయంలో టీఆర్ఎస్ చేయబోయే ఎదురుదాడిని బీజేపీ నేతలు తట్టుకోవడం కష్టమే.
మొత్తంగా అసలు పాచిక విసిరింది.. పోటీకి రమ్మని తొడగొట్టింది.. బలవంతంగా పోటీ పెట్టింది బీజేపీ.. చివరికి ఓడిపోయింది కూడా ఆ పార్టీనే. ఇప్పుడు మళ్లీ గత అడ్వాంటేజ్ సాధించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది.