Etela Rajender: తనకు ఎవరూ  శత్రువులు లేరని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. గురువారం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై కొంత మంది చెడు రాతలు రాస్తున్నారని, నిరాధారంగా అలా రాయడం ఎంతో బాధించిందని ఈటల అన్నారు. గత ఎన్నికల్లో అధికారం కోసం సీఎం కేసీఆర్ హామీలు గుప్పించారని, ఇప్పుడు హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కేసీఆర్‌కు ప్రజలు గుర్తొస్తారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఓట్ల కోసం హామీలు ఇచ్చి ఆ తర్వాత మర్చిపోయారని ఆయన విమర్శించారు. దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టామని చెప్పుకునే కేసీఆర్ ఆ పథకాన్ని పూర్తిగా ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. 


‘యువతను మోసం చేసిన కేసీఆర్’
రాష్ట్ర యువతను బీఆర్ఎస్ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని  ఈటెల అన్నారు. యువతను మభ్యపెట్టేలా నిరుద్యోగ భృతి ప్రకటించిందని, ఇప్పుడు భృతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వైన్స్ టెండర్ల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యాపారస్తుల జేబులు గుళ్ల చేసిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ హామీ అమలు చేయడం లేదని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ విఫలమయ్యారని మండిపడ్డారు. 57ఏళ్లకే పెన్షన్లు, వితంతు పెన్షన్లు కూడా ఇస్తానని చెప్పారని, కానీ అమలుకు నోచుకోవడం లేదన్నారు. డబ్బు లేకనే ఈ పథకాలను అమలు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రం దివాళా తీసిందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలవుతాయా లేదా ఆలోచించుకోవాలన్నారు. 


‘ఆ అనుభవంతో చెబుతున్నా’
గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం తనకు ఉందని ఈటల అన్నారు. ఆ అనుభవంతో చెబుతున్నానని కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు ఆ పథకాలు ప్రకటించొద్దంటూ హితవు పలికారు. ఏ మహిళలకు రెండు వేల రూపాయలు ఇస్తారో, ఎంత మందికి ఇస్తారో కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు హామీలను ఎలా అమలు చేస్తారో కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేయాలన్నారు. కర్ణాటకలో ఎన్నికలల్లో గెలిచేందుకు గ్యారెంటీ పథకాలు హామీలు ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పాటు చేశాక చేతులేత్తేశారని విమర్శించారు. రాష్ట్రంలో వచ్చే ఆదాయంపై బీజేపీకి మంచి అవగాహన ఉందన్నారు. 


‘అధ్యయనం తరువాతే మేనిఫెస్టో ప్రకటన’
అణగారిన వర్గాలకు ఎలా సంక్షేమ పథకాలు అమలు చేయాలో బీజేపీ అధిష్ఠానం అధ్యయనం చేసిన తర్వాత పథకాలు ప్రకటిస్తామని ఈటల రాజేంద్ర అన్నారు. అత్యుత్తమ పథకాలతో అతి త్వరలోనే మంచి మేనిఫెస్టోను ప్రకటిస్తామని చెప్పారు. జాతీయ నాయకత్వంతో మాట్లాడుతున్నామని ప్రజలకు మంచి చేసే పథకాలు ప్రకటిస్తామన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్న లీడర్ నేనేనని, రాష్ట్రంలో గుర్తుపట్టని వారు ఎవరూ లేరని అన్నారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు యత్నించిందన్నారు. 


‘నన్ను ఓడించేందుకు రూ.600 కోట్లు ఖర్చు చేశారు’
తనను ఓడించేందుకు కేసీఆర్ ప్రయత్నం చేశారని రూ. 600 కోట్లు ఖర్చు చేశారని, కానీ ప్రజలు తనవైపు నిలబడ్డారని, గెలిపించారని అన్నారు. హుజూరాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తానని కొంతమంది భావిస్తున్నారని, అలాంటిది ఏమీ లేదన్నారు. రైతు బంధు పథకం చిన్న రైతులకు అమలు చేయాలని తాను మంత్రిగా ఉన్నప్పుడే చెప్పినట్లు తెలిపారు. లాబీయింగ్‌తోనే కొంతమంది బతుకుతుంటారని ఈటల రాజేందర్ విమర్శలు చేశారు.