Kishan Reddy: ఖమ్మం పట్టణంలో బీజేపీ ‘రైతు గోస - బీజేపీ భరోసా’ సభలో అట్టహాసంగా సాగింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. సభలో ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ రైతుల గోసను తెలియజేసి బీజేపీ తరపున ఓ విశ్వాసాన్ని, భరోసాని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. రజాకార్ల ఆధ్వర్యంలో ఏ రకంగా హిందువులను ఊచకోత కోశారో అందరికి తెలుసునని, ఇప్పుడు వారి వారసత్వాన్ని కేసీఆర్ కొనసాగిస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అమిత్ షా అభినవ సర్దార్ పటేల్. సెప్టెంబర్ 17న గతేడాది మొదటిసారి అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలు జరుపుకున్నాం’ అన్నారు.


కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణ విషయంలో బీఆర్ఎస్ నిర్లక్ష్యం వహించింది. తెలంగాణలో, బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో వ్యవసాయం దండుగ అన్నట్లు మారింది. రైతన్నలు అన్నిరకాలుగా దగా పడుతున్నారు. బీమా లేదు, సరైన సబ్సిడీలు లేవు. వ్యవసాయ రుణాలమీద పావలా వడ్డీ లేవు. అన్ని సమస్యలకు రైతుబంధు ఒక్కటే పరిష్కారం కాదు. రైతాంగంలో 75 శాతం కౌలు రైతుల చేతుల్లోనే ఉంది. ఇవాళ తెలంగాణను సీడ్ బౌల్ చేస్తామని చెప్పి.. వారికి గోల్డెన్ బౌల్‌గా మార్చుకున్నారు. తెలంగాణలో రైతాంగానికి సంబంధించిన ఏ సమస్య పరిష్కారం కాలేదు. ఉచిత ఎరువులు ఇస్తామని కేసీఆర్ ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారు. ఐదేండ్లు కావొస్తున్నా ఉచిత ఎరువులు ఎందుకు ఇవ్వడం లేదు.


రైతు రుణమాఫి నాలుగున్నరేండ్లు మరిచిపోయి, ఎన్నికల ముందు తూతూ మంత్రంగా అమలు చేయాలని నాటకాలు చేస్తున్నారు. అనేక మంది రైతులు నాలుగున్నరరేళ్లలో వడ్డీ, చక్రవడ్డీ పెరిగి అప్పు రెట్టింపయింది. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. తెలంగాణ రైతాంగానికి ఏమాత్రం లాభం జరగడం లేదు. వరదలు, తుఫానులు, కరువులొచ్చినా నష్టపోతున్నది రైతులే. గత 9 ఏండ్లుగా కేసీఆర్ ప్రభుత్వం పంట బీమా పథకాన్ని అమలుచేయపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు కమిషన్ల ప్రాజెక్టులుగా మారాయి తప్ప రైతులకు ఒరిగిందేమీ లేదు. కొండనాలుకకు మందేస్తే.. ఉన్ననాలుక ఊడినట్లుగా పరిస్థితి తయారైంది’ అన్నారు. 
 
ఉన్న సమస్యలు చాలవని.. ధరణి ద్వారా రైతులకు, ప్రజలకు కేసీఆర్ మరిన్ని సమస్యలు పెంచుతున్నాడని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి రాగానే.. రైతు సమస్యలను పరిష్కరించే దిశగా మేం పూర్తిస్థాయిలో రైతుల పక్షాల నిలబడి బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపిస్తాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ప్రత్యామ్నాయంగా బీజేపీకి అధికారాన్ని అందించండి. కాంగ్రెస్ పార్టీ సోనియా కుటుంబం కోసం పనిచేస్తే,  బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేస్తోందన్నారు. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీకి స్వాగతించాలని కోరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ ఒకే గూటి పక్షులు. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షల సాధన చేసేది బీజేపీ మాత్రమే. మోదీ నాయత్వంలో బీజేపీ సుస్థిరమైన అభివృద్ధికి బాటలు వేస్తుంది. బీజేపీని ఆదరించండి’ అంటూ రైతులను కోరారు. 


మోదీతోనే రామరాజ్యం
అనంతరం బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. ఉద్యమాల గడ్డ ఖమ్మం అన్నారు. చైతన్యం, పౌరుషం ఖమ్మం సొంతమన్నారు. సీసీఆర్ దొంగ దీక్షను బయటపెట్టిన చరిత్ర ఖమ్మం ప్రజలది అన్నారు. కేసీఆర్ పేరు దుబాయ్ శేఖర్ అని, పేదలను దుబాయ్ తీసుకుపోతానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని అన్నారు. మోసం చేయడం బాగా తెలిసిన వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. ఎన్నికలు వస్తేనే పేదోళ్లకు ఇండ్లు, రైతులకు రుణమాఫీ, ఉద్యోగాలు గుర్తొస్తాయా అని ప్రశ్నించారు. అందుకే ప్రజలు ఆలోచన చేయాలని, నరేంద్రమోదీ నేతృత్వంలో అమిత్ షా మార్గదర్శకత్వంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. రామరాజ్యం రావాలంటే మోదీ రాజ్యం రావాలని, ఇందుకోసం రైతులు తమ వంతు సహకారం అందించాలని కోరారు.