వరంగల్ జిల్లా దేశాయిపేటకు చెందిన జమ్మలమడక పిచ్చయ్య బాల్ బాడ్మింటన్‌లో అంచెలంచెలుగా రాణించి జాతీయ స్థాయికి ఎదిగారు. తన ఆటతో దేశానికి పేరు తీసుకువచ్చారు. ఈ క్రీడలో తొలి అర్జున అవార్డు అందుకుని తర్వాతి తరాలకు స్ఫూర్తిగా నిలిచారు. తన క్రీడా ప్రస్థానంలో అత్యున్నత అవార్డులు, ప్రశంసలు, ప్రముఖుల అభినందనలు అందుకున్న ఆయన 1918 డిసెంబరు 21న కృష్జా జిల్లాలోని కూచిపుడి గ్రామంలో పున్నయ్య, నాగమ్మ దంపతులకు ఏడుగురు సంతానంలో మూడో అబ్బాయిగా జన్మించారు. ఆయన తండ్రి మచిలీపట్నంలో స్థిరపడడంతో బందరులో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తిచేశారు. అయితే పదో తరగతి తప్పడంతో ఇంట్లో ఖాళీగా ఉండలేక బందరు పట్టణంలో మినర్వ క్లబ్, మోహన్ క్లబ్‌లో బాల్ బ్యాడ్మింటన్ ఆడడం అలవాటు చేసుకున్నారు. అప్పట్లో ఈ ఆటను సంపన్న వర్గాల వారే ఆడేవారు. అయినా ఎలాగైనా నేర్చుకోవాలని పట్టుదలతో ముందుకుసాగారు. జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించారు. ఆటలో తనకంటూ ప్రత్యేకమైన గురువు, శిక్షణ లేకపోయినా ఏకలవ్యుడిలా సాధనచేసి ఆటపై పట్టు సాధించారు. ఆయన ఆట తీరును చూసిన కొన్ని ప్రైవేట్ క్లబ్‌ల నిర్వాహకులు ఆయా క్లబ్‌ల తరుఫున ఆడాలని ప్రోత్సహించేవారు. 1935-36లో నర్సారావుపేటలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలో విజేతగా నిలిచారు. పెళ్లి అయిన తర్వాత ఉద్యోగం చేయడానికి కొన్నాళ్లు ఆటను వదిలేసిన ఆయన.. మళ్లీ పునరామగనం చేసి 1947-48లో గుడివాడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతగా నిలిచారు.
Also Read: నీకు నిబద్ధత ఉంటే ఇందిరా పార్కు సాక్షిగా ముక్కు నేలకు రాయి.. వివరణ ఇవ్వు: కేటీఆర్
15 జాతీయస్థాయి పోటీల్లో కెప్టెన్
1950 దశకంలో జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనా ఆర్థిక ఇబ్బందుల కారణంగా పాల్గొనలేక పోయిన ఆయన.. 1954-55లో హైదరాబాద్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. అనంతరం మద్రాస్, పాండిచ్చేరిలో 1956, 1957 సంవత్సరాల్లో జరిగిన జాతీయ పోటీల్లో జట్టును గెలిపించారు. ఆ సమయంలో జట్టుకు కెప్టెన్‌గా ఎన్నికయ్యారు కూడా. తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో జరిగిన 15 జాతీయస్థాయి పోటీల్లో కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించి 9 ఛాంపియన్‌షిప్‌లను గెలిపించారు. 1945లో వరంగల్‌లో అజంజాహి వర్కర్స్ యూనియన్లో నెలకు రూ.50 వేతనంతో పిచ్చయ్య ఉద్యోగం సంపాదించారు. బాల్ బ్యాడ్మింటన్‌లో ఎన్నో ఘనతలు సాధించిన పిచ్చయ్యకు భారత ప్రభుత్వం 1970లో అర్జున అవార్డును ప్రకటించింది. ఐతే 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం కారణంగా ఆ సంవత్సరం అవార్డును అందుకోలేకపోయారు. 1972లో అప్పటి భారత రాష్ట్రపతి వి.వి గిరి చేతుల మీదుగా దిల్లీలో అవార్డు స్వీకరించారు. పిచ్చయ్యకు భార్య సత్యవతి, కుమార్తెలు సుశీల, జానకిదేవి ఉన్నారు. 2007లో భార్య మృతి చెందగా.. ఆయన ఆధ్యాత్మిక చింతనలో సమయం గడుపుతున్నారు. ఇప్పటికీ తన పనులను తాను చేసుకుంటూ ఉత్సాహంగా ఉండే పిచ్చయ్య ఇటీవలే కొంత అనారోగ్యానికి గురయ్యారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన తన మేనల్లుడి ఇంట్లో కన్నుమూశారు.
Also Read: కొత్త ఏడాదిలో ధనవంతులవ్వాలని ఆశపడుతున్నారా? ఇంట్లో ఈ వస్తువులు ఉండేలా చూసుకోండి...