తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చలు జరిగాయని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సభ నిర్వహణపై పూర్తి వివరాలు వెల్లడించారు. అసెంబ్లీలో చర్చలు సజావుగా జరిగాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో సమావేశాలు సజావుగా సాగాయన్నారు. వాకౌట్ లేకుండా సభ జరిగిందని మంత్రి పేర్కొన్నారు. ఐటీ, పురపాలక, మైనారిటీ సంక్షేమం, హరితహారం, పాతబస్తీ ప్రాంత అభివృద్ధి, దళితబంధు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఇతర సంక్షేమ కార్యక్రమాలపై సభలో సుదీర్ఘంగా చర్చించినట్లు మంత్రి పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఆరోపణలు సరికాదు
వర్షాకాల సమావేశాలు చాలా అర్థవంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా సజావుగా జరిగాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. రోజుకు ఐదు గంటలు పైగా అసెంబ్లీలో చర్చ జరిగిందన్నారు. ప్రజాసమస్యలు, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రతిబింబించేలా ఆరు అంశాలపై విస్తృతంగా చర్చ జరిగిందని మంత్రి తెలిపారు. సభాసమయం ఎక్కడా వృధా కాలేదని పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో వాకౌట్లు, సస్పెన్షన్లు లేవని మంత్రి తెలిపారు. 101 మంది సభ్యులున్న టీఆర్ఎస్ కు 9.02 గంటలు, తక్కువ మంది సభ్యులున్న ప్రతిపక్షాలకు 11.08 గంటల సభా సమయం కేటాయించారన్నారు. సమయం ఇవ్వలేదని భట్టి విక్రమార్క చెప్పడం సరికాదన్నారు. అధికారపక్షం కంటే విపక్షాలకు ఎక్కువ సమయం ఇచ్చామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలు సరికాదని ప్రశాంత్ రెడ్డి చెప్పారు. సభలో చర్చించిన ఆరు అంశాల్లో టీఆర్ఎస్ ఇచ్చినవి నాలుగు, మజ్లిస్, కాంగ్రెస్ ఒక్కొ అంశం ఉన్నాయని తెలిపారు.
Also Read: కాంగ్రెస్‌కు చేత కాలేదు.. మేం చేసి చూపిస్తున్నాం ! అసెంబ్లీలో కేసీఆర్ మార్క్ స్పీచ్ !
ఏడు రోజుల పాటు సమావేశాలు
ఏడు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 37 గంటల 5 నిమిషాల పాటు సమావేశాలు జరిగాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశాల్లో సభ్యులు 41 ప్రసంగాలు చేశారన్నారు. ఏడు బిల్లులను ఆమోదించడంతో పాటు ఒక తీర్మానం చేశామని ప్రకటించారు. 101 సభ్యులున్న టీఆర్ఎస్ కు 9 గంటల 2 నిమిషాలు, ప్రతిపక్ష పార్టీలన్నీ కలిపి 11 గంటల 8 నిమిషాల సమయం ప్రసగించినట్లు మంత్రి తెలిపారు. ఏఐఎంఐఎం పార్టీకి 5 గంటల 35 నిమిషాలు, కాంగ్రెస్ పార్టీకి 3 గంటల 24 నిమిషాలు, బీజేపీకి 2 గంటల 3 నిమిషాల పాటు చర్చలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సమావేశాల్లో 7 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.
Also Read: కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వరా? అసెంబ్లీలో చర్చ.. కేసీఆర్ స్పష్టత, ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read: అన్నపూర్ణ క్యాంటీన్లు ఏర్పాటు చేయండి.. తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క