తెలంగాణలో ఎన్నికల వేడి కనిపిస్తోంది. రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజులపాటు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటిస్తోంది. ఈ పర్యటన తర్వాత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌పై  క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. 7వ తేదీనే షెడ్యూల్‌ రావొచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. దీంతో... రాజకీయ పార్టీలు వేగం పెంచాయి. బీఆర్‌ఎస్‌ ఇప్పటికే  అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారంలో దూసుకుపోతోంది. ఇక... బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్‌ క్యాండిటేడ్స్‌ను దాదాపు ఖరారు చేసినట్టు  తెలుస్తోంది. ఇక... బీజేపీ కూడా అభ్యర్థులను ఫైనల్‌ చేసే దిశగా కసరత్తు చేస్తోంది.


వచ్చే వారంలో అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉందని బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రకటించారు. ద‌శ‌ల వారిగా జాబితాను ప్ర‌క‌టిస్తామ‌న్నారు. రాష్ట్రంలో ఈ నెల  5, 6 తేదీల్లో జ‌ర‌గ‌బోయే పార్టీ స‌మావేశాలకు జాతీయ నేత‌లు హాజరవుతున్నట్లు చెప్పారు కిషన్‌రెడ్డి. సోమవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసిన చాలా సేపు  చర్చించారు కిషన్‌రెడ్డి. రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార సభలపై సమాలోచనలు చేసినట్టు సమాచారం. అలాగే... ప్రధాని సహా  కేంద్రమంత్రుల పర్యటనలపై కూడా చర్చించారు అమిత్‌షా, కిషన్‌రెడ్డి. 


ఈనెల 5, 6 తేదీల్లో రాష్ట్ర స్థాయి సమావేశాలు ఉంటాయని చెప్పారు కిషన్‌రెడ్డి. 5న జరిగే సమావేశాలకు జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్ ముఖ్యఅతిథిగా  పాల్గొంటారని తెలిపారు. అలాగే... 5వ తేదీ మీటింగ్‌కు జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జ్‌లు, రాష్ట్ర పదాధికారులు హాజరవుతారన్నారు. ఇక... 6వ తేదీన స్టేట్‌ కౌన్సిల్‌ మీటింగ్‌  ఉంటుందని... ఈ సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ముఖ్యఅతిథిగా విచ్చేస్తారని చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు, ఇంఛార్జ్‌లతో కలిసి 800మంది  నేతలు హాజరవుతున్నారని.. వారందరికీ జేపీ నడ్డా దిశానిర్దేశం చేస్తారని చెప్పారు కిషన్‌రెడ్డి. ఇక, ఈనెల 10వ తేదీన తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన ఉంది.  మంచిర్యాలలో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగసభకు కూడా అమిత్‌షా హాజరవుతారు. 


అటు అభ్యర్థుల జాబితా ఫైనల్‌ చేస్తూనే...ఇటు ప్రచార కార్యక్రమాలపై ఫోకస్‌ పెట్టింది కమలం పార్టీ. రాష్ట్రంలో అగ్ననేతల పర్యటనలతో ప్రచారంలో జోరు పెంచింది. ఇప్పటికే  ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించారు. మహబూబ్‌నగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అలాగే ఎన్నికల వేళ తెలంగాణపై వరాల జల్లు కురిపించారు.  గిరిజన యూనివర్సిటీతో పాటు పసుపు బోర్డును ప్రకటించారు. ఇక... ఇవాళ నిజమాబాద్‌ పర్యటలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు ప్రధాని మోడీ.