తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చినా, కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా మాత్రం ఇప్పటి దాకా రిలీజ్ కాలేదు. నేడు, రేపు అంటూ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల జాబితాపై పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 70 మంది అభ్యర్థులతో కూడిన జాబితాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నియోజకవర్గానికి ఒకే దరఖాస్తు వచ్చినవి, పెద్దగా పోటీ లేని నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తోంది. 70 మందితో కూడిన జాబితా హైకమాండ్ కూడా ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. 


పార్టీని వీడుతున్న నేతలు
జాబితా రాకముందే పలువురు కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. పీసీసీ జాబితా ప్రకటించకపోయినా తమకు సీటు వస్తుందో రాదోనన్న ఆందోళనలో పలువురు నేతలు ఉన్నారు. సీటు వస్తుందో రాదోనన్న అనుమానంతో పలువురు హస్తం పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ లో చేరారు. దీంతో అక్కడ కాంగ్రెస్ ఇన్చార్జ్ నందికంటి శ్రీధర్ గులాబీ పార్టీ కప్పుకున్నారు. తాజాగా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేశారు. మంత్రి కేటీఆర్ పొన్నాల లక్ష్మయ్యను కలిసి పార్టీలో చేరాలని ఆహ్వానించారు. కేసిఆర్ తో సమావేశమైన తర్వాత నిర్ణయం చెబుతానన్నారు పొన్నాల. 


నిరసనలు,నిలదీలు తప్పవా ?
టికెట్లు ప్రకటించకముందే పరిస్థితి ఇలా ఉంటే, అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఇంకెలా ఉంటుందో చెప్పలేమంటున్నారు. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన, టికెట్ దక్కని నేతలు పార్టీకి గుడ్ బై చెప్పవచ్చని అంటున్నారు. సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వడంతో వాటిపైన నేతలు హైకమాండ్ ప్రశ్నించే ఛాన్స్ ఉంది. టికెట్ ఆశించిన దక్కని నాయకులు గాంధీ భవన్ ముందు, తమ అనుచరులతో కలిసి ఆందోళనలు చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ తో పాటు రాష్ట్ర పీసీసీ నేతలు, స్క్రీనింగ్ కమిటీ సభ్యులు  నిలదీతలు, నిరసనలు ఎదుర్కోక తప్పదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 


బీసీలు 34 సీట్లు డిమాండ్
తెలంగాణలోని బీసీ నేతలు 34 సీట్లు డిమాండ్ చేస్తున్నారు. జనాభా ప్రతిపాదికన సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరుతున్నారు.  ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలన్నది వారి డిమాండ్. అయితే బీసీ నేతల డిమాండ్ కు అనుగుణంగా 34 సీట్లు ఇస్తుందా లేదంటే తగ్గిస్తుందా ? అన్నది సస్పెన్స్ గా మారింది. సీట్లు తగ్గిస్తే సహించే ప్రసక్తే లేదని మాజీ ఎంపీలు వీ హనుమంతరావు, మధుయాష్కీ లాంటి నేతలు హెచ్చరించారు. ఇంకొందరు నేతలు పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఎలా ఇస్తారని ఇప్పటికే ప్రశ్నించారు. వారికి అనుకూలంగా సర్వేలు ఎలా వస్తాయని పార్టీని నిలదీస్తున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో టికెట్ దక్కని నేతలను కాంగ్రెస్ నేతలు ఎలా సముదాయిస్తారు ? ఎలా నచ్చజెపుతారన్నది ఆసక్తికరంగా మారింది. అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత ఎంత మంది తిరుగుబాటు జెండా ఎగురవేస్తారో ? ఇంకెందరు పీసీసీ చెప్పినట్లు నడుచుకుంటారో కాలమే సమాధానం చెప్పాలి.