Breaking News Live Updates: ఏపీ కొత్త సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన సమీర్ శర్మ

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 30న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 30 Sep 2021 08:43 PM
మెట్రో స్టేషన్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి వివరాలు సేకరిస్తున్నారు.

ఏపీ కొత్త సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన సమీర్ శర్మ

ఏపీ కొత్త సీఎస్‌గా సమీర్‌ శర్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సమీర్ శర్మకు మాజీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ బాధ్యతలు అప్పగించారు. తొమ్మిది నెలలపాటు ఆదిత్యనాథ్‌ దాస్ ఏపీ సీఎస్‌గా సేవలు అందించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సమీర్ శర్మ మీడియాతో మాట్లాడారు. నవరత్నాల అమలు కోసం కృషి చేస్తాన్నారు. సీఎస్‌గా తనకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. 

కాంగ్రెస్​లో చేరిన గండ్ర సత్యనారాయణ రావు.. 

భూపాలపల్లిలో నిర్వహించిన భారీ బహిరంగ సభ వేదికగా గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్​లో చేరారు. గండ్ర సత్యనారాయణ రావుకు రేవంత్ కాంగ్రెస్​ కండువా కప్పి  పార్టీలోకి ఆహ్వానించారు. సత్యనారాయణ రావుతో పాటు నియోజకవర్గంలోని ఆయా మండలాల్లోని పలువురు నాయకులు పెద్దఎత్తున కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరుతున్న నాయకులందరికీ రేవంత్​రెడ్డి, మధుయాష్కీ గౌడ్​, సీతక్క.. సభావేదికపైన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ.. నమ్ముకున్న పార్టీలు తనను మోసం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్​కు డబ్బు మీద వ్యామోహం తప్ప ప్రజల సంక్షేమం పట్టదని విమర్శించారు. ప్రజలు టీఆర్ఎస్ పార్టీపై నమ్మకం కోల్పోయారని పేర్కొన్నారు. 

కేసీఆర్ ఇంటిపేరు కల్వకుంట్ల కాదు.. కలవకుండా..

అధికార టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ విరుచుకుపడ్డారు. భూపాలపల్లి కాంగ్రెస్ సభలో ఆయన మాట్లాడుతూ.. బీటీ బ్యాచ్ అన్ని వర్గాలను దోచుకుంటోందని ఆరోపించారు. దళితబంధుతో టీఆర్ఎస్ మరోసారి దగా చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ ఇంటిపేరు కల్వకుంట్ల కాదు.. కలవకుండా అని ఓకవి అన్నారని పేర్కొన్నారు. తాగుడు గాళ్లు, వాగుడు గాళ్లు, గోకుడు గాళ్లు, గీకుడు గాళ్లు, గులాం గాళ్లు, గులాబీ గాళ్లు అని ఓకవి రాశాడని ఎద్దేవా చేశారు.  కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయంగా బొందపెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మనం సాధించింది సగం తెలంగాణనే అని.. సాధించాల్సింది సంపూర్ణ, సామాజిక తెలంగాణ అని వ్యాఖ్యానించారు. 

సింగరేణి ప్రాంతాన్ని బొందలగడ్డగా మార్చిన ఘనత కేసీఆర్‌దే.. 

సింగరేణి ప్రాంతాన్ని బొందలగడ్డగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ సభలో ఆయన మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం పేరుతో కథలు చెబుతున్నారే కానీ ఒక్క ఇళ్లూ కట్టించలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతీ గింజా కొంటామని హామీ ఇచ్చారు. రైతులు కేసీఆర్‌కు ఉరిబిగించే సమయం వచ్చిందని తెలిపారు. ఈ జన సమూహాన్ని చూస్తే టీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వరంగల్‌లో రేపు క్యాంపస్‌ సెలక‌్షన్స్‌..

వరంగల్‌లోని న్యూసైన్స్‌ కాలేజీలో రేపు (అక్టోబరు 1) మెగా క్యాంపస్‌ సెలక‌్షన్స్‌ జరగనున్నాయని కాలేజీ డైరెక్టర్లు కె.రవీందర్‌రెడ్డి, జె.శ్రీధర్‌రావు వెల్లడించారు. టెక్‌ మహీంద్రా, ఎయిర్‌టెల్‌, పేటీఎం, శామ్‌సంగ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ తదితర 25 ప్రముఖ సంస్థలు ఈ క్యాంపస్‌ సెలక‌్షన్స్‌లో పాల్గొంటున్నట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా డిగ్రీ ఫైనలియర్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు వీటిలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు వయస్సు 28 ఏళ్లకు మించరాదని సూచించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. 

మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై నాన్‌బెయిలబుల్‌ వారంట్‌ జారీ! 

హైదరాబాద్‌ లోని ప్రజాప్రతినిధుల కోర్టులో హెరిటేజ్ పరువునష్టం కేసు విచారణ జరిగింది. ఏపీ మంత్రి కన్నబాబు, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు నాన్‌బెయిలబుల్‌ వారంట్‌ అమలు చేయాలని కోర్టు నిర్ణయించింది. కన్నబాబు, అంబటి విచారణకు గైర్హాజరవడంతో ఎన్‌బీడబ్ల్యూ జారీ చేసినట్లు కోర్టు తెలిపింది. హెరిటేజ్ ప్రతినిధి సాంబమూర్తి కూడా హాజరుకావాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 7కు వాయిదా వేసింది

నిజమాబాద్ యువతి సామూహిక అత్యాచారం కేసులో ఆరుగురు అరెస్టు

 తెలంగాణలో కలకలం రేపిన నిజమాబాద్ యువతి అత్యచారం కేసును పోలీసులు ఛేదించారు. 24 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. యువతి అత్యాచారం ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు, మహిళలపై అఘాయిత్యాలు చేసి తప్పించుకునే నేరస్థులను  వదిలేది లేదన్నారు. కేసు వివరాలను నిజమాబాద్ సీపీ కార్తికేయ వెల్లడించారు. మొత్తం 6 గురిని అదుపులోకి తీసుకుని కేసునమోదు చేసినట్లు తెలిపారు. 

విజయమ్మ, షర్మిలకు కోర్టులో ఊరట

ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులో వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె తల్లి విజయమ్మకు ఊరట లభించింది. ఉమ్మడి ఏపీ​లో 2012లో పరకాల ఉపఎన్నికల్లో భాగంగా అనుమతి లేకుండా సభ నిర్వహించారని షర్మిల, విజయమ్మతో పాటు కొండా సురేఖ, కొండా మురళీ తదితరులపై కేసు నమోదైంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలతో ప్రజాప్రతినిధుల కోర్టులో షర్మిల, విజయమ్మపై కేసు నమోదైంది. అప్పటి నుంచి వాయిదాలు పడుతూ వస్తున్న కేసును ఎట్టకేలకు కోర్టు కొట్టివేసింది. కొండా సురేఖ, కొండా మురళి సహా తొమ్మిది మందిపై ఉన్న కేసును సైతం కొట్టివేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది.  

   వంతెన పైనుంచి నదిలో పడిన బస్సు.. నలుగురు మృతి

మేఘాలయలో ఘోర ప్రమాదం జరిగింది. నాంగ్​చ్రామ్​ వద్ద అర్ధరాత్రి ఓ బస్సు వంతెనపై నుంచి నదిలో పడిపోయింది. ఈ దర్ఘటనలో నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.  బస్సు తురా నుంచి షిల్లాంగ్​కు వస్తున్న క్రమంలో నాంగ్​చ్రామ్​ వద్ద అదుపు తప్పి నదిలోకి దూసుకెళ్లినట్లు ఈస్ట్​ గారో హిల్స్​ పోలీసులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు.  

మేఘాలయ: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

మేఘాలయలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని నాంగ్‌చ్రామ్ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి ఓ బస్సు బ్రిడ్జిపై నుంచి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 16 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. 21 మంది ప్రయాణికులతో బస్సు తురా నుంచి షిల్లాంగ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

హైదరాబాద్: పోసాని ఇంటిపై దుండగుల దాడి..

సినీ నటుడు పోసాని క్రిష్ణ మురళి ఇంటిపై పలువురు దాడికి యత్నించారు. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలోని ఆయన ఇంటిపై రాళ్లతో దాడి చేస్తూ బూతులు తిడుతూ వీరంగం ప్రదర్శించారు. దీంతో వాచ్‌మెన్ సహా కుటుంబ సభ్యులంతా భయపడిపోయారు. ఈ ఘటనపై ఆయన ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దగ్గర్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించి నిందితులను గుర్తిస్తున్నారు. ఇటీవల పోసాని పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. రెండ్రోజుల క్రితం కూడా పోలీసుల ఎదుటే పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు పోసానిని కాపాడి అక్కడి నుంచి తరలించారు.

గల్లా జయదేవ్ కుటుంబ సభ్యులపై భూ ఆక్రమణ కేసు

అమరరాజా సంస్థల భూ ఆక్రమణలపై కోర్టు ఆదేశాల మేరకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌తోపాటు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, గల్లా రామచంద్రనాయుడు సహా 12 మందిపై కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా తవణంపల్లె పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. గల్లా అరుణకుమారి తండ్రి దివంగత రాజగోపాల్‌నాయుడు పేరిట ఏర్పాటు చేసిన రాజన్న ట్రస్ట్, ఎడ్యుకేషన్‌ సొసైటీల కోసం దిగువమాఘం గ్రామంలో భవనాలు నిర్మించారు. ఆ భవనాల సమీపంలో ఉన్న తన పొలాన్ని ఆక్రమించి భారీ ఎత్తున ప్రహరీ నిర్మించారని అదే గ్రామానికి చెందిన రైతు గోపీకృష్ణ తెలిపారు. తన భూమికోసం ఆయన 2015 నుంచి వివిధ రూపాల్లో ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోవడంతో 2నెలల కిందట కోర్టును ఆశ్రయించారు.

నిజామాబాద్: సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురు అరెస్టు

నిజామాబాద్‌‌లో యువతి గ్యాంగ్‌ రేప్‌ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. యువతిపై ఆమె ప్రియుడితో పాటు అతని స్నేహితులు మద్యం తాగించి అత్యాచారం చేశారు. బాధితురాలికి సదరు యువకుడు ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. బర్త్‌ డే పార్టీ కోసం ఆర్మూర్‌ నుంచి యువతి నిజామాబాద్‌కు వచ్చిందని పోలీసులు చెప్పారు.

తండ్రిని చంపిన కన్న కొడుకులు

ఆస్తి కోసం కసాయి కొడుకులు కన్న తండ్రినే హత్య చేశారు. సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ మండలం బ్రాహ్మణ పల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గత అర్ధరాత్రి తండ్రి పెద్దగొల్ల పాపయ్య కొడుకులు నరేష్, కృష్ణ కలిసి హత్య చేసి పారిపోయారు. అంతే కాకుండా మరో సోదరుడిని హత్య చేసుకుందుకు నరేష్, కృష్ణ ప్రయత్నించినట్లుగా స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పెద్ద కుమారుడు విఠల్ జోగిపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. 

భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాచలం వద్ద గోదావరి నది ఉప్పొంగుతోంది. ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం 43 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరిలో కి 9,07,616 క్యూసెక్కుల ప్రవాహం చేరుతున్నట్లుగా అధికారులు చెప్పారు. బుధవారం ఉదయం గోదావరి నీటి మట్టం 30 అడుగులు ఉందని, రాత్రికల్లా ఏకంగా 10 అడుగులు పెరిగిపోయి 40 అడుగులకు చేరిందని వివరించారు. గురువారం ఉదయానికి మరో మూడు అడుగులు పెరిగి 43.50 అడుగుల వద్ద ప్రవహిస్తుండడం వల్ల అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు కాలనీల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


Background

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 30న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.