Breaking News Live Updates: తెలంగాణలో కొత్తగా 208 కోవిడ్ కేసులు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ పేజీ అప్ డేట్ అవుతోంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 20 Sep 2021 08:44 PM
తెలంగాణలో కొత్తగా 208 కోవిడ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 45,274 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. కొత్తగా 208 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,95,780కి చేరాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం కోవిడ్ బులిటెన్‌ విడుదల చేసింది. ఆదివారం కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,906కి చేరింది. కరోనా బారి నుంచి 220 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,991 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

మాజీ సీఎం చంద్రబాబుపై దాడికి యత్నం.. కేంద్ర హోంశాఖకు ఎంపీ కనకమేడల ఫిర్యాదు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై దాడికి ప్రయత్నించారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ హోంశాఖకు ఫిర్యాదు చేశారు. జడ్ ప్లస్ క్యాటగిరీ ఉన్న నేతపై దాడికి ప్రయత్నించిన ఘటనలో శాంతి భద్రతల వైఫల్యం కనిపించిందని హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లాకు కనకమేడల లేఖ రాశారు. ఎమ్మెల్యే జోగి రమేష్, ఆయన అనుచరులు మాజీ సీఎం చంద్రబాబు నివాసంపై దాడి చేశారని లేఖలో పేర్కొన్నారు. ఏపీలో పోలీసులు ఏకపక్షంగా వ్యవరిస్తున్నారని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మాజీ సీఎం నివాసంపై దాడి జరిగితే, దాడికి పాల్పడ్డ వారిని వదిలేసి.. టీడీపీ నేతలపైనే కేసులు బనాయించారని లేఖ ద్వారా తెలిపారు.

చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు... అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెెళ్దామని సవాల్

టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ కు సవాల్ విసిరారు. అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్దామని సవాల్ చేశారు. 

చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన ఘటనపై అవాస్తవాలు ప్రచారం : డీఐజీ

చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన ఘటనపై డీఐజీ, ఎస్పీ వివరణ ఇచ్చారు. జోగి రమేశ్ వినతిపత్రం ఇచ్చేందుకే వెళ్లారని దాడికి కాదని డీఐజీ త్రివిక్రమ్ వర్మ తెలిపారు. ఎమ్మెల్యే జోగి రమేశ్ రాకపై పోలీసులకు సమాచారం లేదన్నారు. సమాచారం లేకున్నా జోగి రమేశ్‌ను ముందే అడ్డుకున్నామన్నారు. మాజీ సీఎం ఇంటిపై దాడి ఘటన పేరుతో అవాస్తవ ప్రచారం జరిగిందన్నారు. ముందుగా జోగి రమేశ్ కారు పైనే దాడి జరిగిందని డీఐజీ త్రివిక్రమ్ వర్మ తెలిపారు. ఎమ్మెల్యే కారు డ్రైవర్‌ను చెప్పుతో కొట్టేందుకు కొందరు యత్నించారన్నారు. ఎమ్మెల్యే కారు, డ్రైవర్‌పై దాడి దృశ్యాలను డీఐజీ తెలిపారు. 

హైదరాబాద్ లో భారీ వర్షం... ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక

హైదరాబాద్ రానున్న గంటపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇళ్లలోనే ఉండాలని నగరవాసులకు వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని సూచించింది. సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ముషీరాబాద్, భోలక్‌పూర్, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, చిక్కడపల్లి, రాంనగర్‌, కవాడీగూడ, ఇందిరా పార్క్‌, దోమలగూడ, విద్యానగర్, అడిక్‌మెట్‌ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. బోయిన్‌పల్లి, చిలకలగూడా, మారెడ్‌పల్లి, బేగంపేట, ప్యాట్నీ సెంటర్‌, ప్యారడైస్, అల్వాల్‌లో వర్షం మొదలైంది. నగరంలో భారీ వర్షం కురుస్తుండటంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పాతబస్తీలో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై మోకాలు లోతు నీరుచేరింది. 

వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు స్వల్ప ఊరట.. బెయిల్ మంజూరు చేసిన ముంబై కోర్టు

వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు స్వల్ప ఊరట లభించింది. పోర్నోగ్రఫీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రాకు ముంబై కోర్టు సోమవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తుతో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాతో పాటు మరో నిందితుడు ర్యాన్ థోర్ప్‌కు కు షరతులతో కూడిన బెయిల్ లభించింది.

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ సెలబ్రిటీలపై ఎలాంటి ఆధారాలు లేవు: ఎక్సైజ్ శాఖ క్లారిటీ

టాలీవుడ్ సెలబ్రిటీలు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ విక్రయించినట్లు కెల్విన్ వాంగ్మూలం ఇచ్చాడు. కానీ అతడి వాంగ్మూలంపై సరైన ఆధారాలు లేవని ఎక్సైజ్ శాఖ పేర్కొంది. డ్రగ్స్ కేసును కెల్విన్ తప్పుదోవ పట్టిస్తున్నాడని అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో సినీ తారలకు డ్రగ్స్ విక్రయించినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. నిందితుడు కెల్విన్ చెప్పిన విషయాలను ఆధారాలుగా భావించలేమని ఛార్జ్ ఫీటులో పేర్కొన్నారు. కెల్విన్ ఇచ్చిన ఆధారాలు డ్రగ్స్ కేసును తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, సెలబ్రిటీలకు డ్రగ్స్ విక్రయించినట్లు బలమైన ఆధారాలు లేవని అధికారులు తెలిపారు.

నెల్లూరు జిల్లాలో క్షుద్రపూజల కలకలం

నెల్లూరు జిల్లా సోమశిల రిజర్వాయర్ వద్ద క్షుద్రపూజల కలకలం రేపాయి. పసుపు, కుంకుమలు, నిమ్మకాయలు, మనిషి ఆకారంలో ముగ్గును స్థానికులు గుర్తించారు. రిజర్వాయర్ గట్టుపై జరిగిన ఈ పూజా కార్యక్రమాన్ని చూసి నివ్వెరపోయారు. ఇంతకీ ఈ క్షుద్రపూజలు ఎవరి లక్ష్యంగా జరిగాయా హడలిపోతున్నారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా పర్యటించారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన మంత్రి కేటీఆర్ సిరిసిల్ల అర్బన్ కలెక్టరేట్ కు ఎమ్మెల్యే బాల్క సుమన్ తో కలిసి చేరుకున్నారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల భవనంలో ఉన్న సమావేశ మందిరంలో మంత్రి జిల్లా అధికారులతో కలసి వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పంటలు, రైతులకు అధికారులు  కల్పిస్తున్న సదుపాయాలను ఆయన  అడిగి తెలుసుకున్నారు. అధికారులకు వ్యవసాయ శాఖకు సంబంధించిన పలు సూచనలను చేశారు.

తెలంగాణలో అక్టోబరు 20 నుంచి వైఎస్‌ షర్మిల సుదీర్ఘ పాదయాత్ర

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర షెడ్యూల్ ఖరారైంది. అక్టోబరు 20వ తేదీ నుంచి తెలంగాణలో పాదయాత్ర చేయనున్నారు. ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్ర ఏడాదిపాటు 90 నియోజకవర్గాల్లో సుదీర్ఘంగా కొనసాగనున్నట్లు ఆమె తెలిపారు. తన తండ్రి, దివంగత నేత వైఎస్సార్ పాదయాత్రను చేపట్టిన చేవెళ్లలోనే ప్రారంభించి అక్కడే ముగించాలని ప్లాన్ చేశారు. పాదయాత్ర కొనసాగుతున్నా ప్రతి మంగళవారం నిరహారదీక్ష కొనసాగుతుందన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంతోపాటు, వైఎస్సార్ ఆశయాలు సాధించేందుకే పాదయాత్ర చేపట్టనున్నట్లు షర్మిల వెల్లడించారు.

సినీ పెద్దలతో ఏపీ మంత్రి పేర్ని నాని భేటీ ముగిసింది

సినీ పెద్దలతో ఏపీ మంత్రి పేర్ని నాని భేటీ ముగిసింది. కొంతకాలంగా సినీ పరిశ్రమలోని సమస్యలపై, టికెట్ రేట్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించడానికి టాలీవుడ్ ప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం నుంచి సినీ పెద్దలకు ఆహ్వానం రావడం, అందరూ కలిసి చిరంజీవి ఇంట్లో మీట్ అవ్వడం, సమస్యల గురించి చర్చించారు.  అయితే పేర్ని నానితో అయిన భేటీలో ఏపీలో ఆన్‌లైన్ టికెటింగ్ విధానంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన హీరో అడివి శేష్ 

హీరో అడివి శేష్‌ అనారోగ్యానికి గురయ్యారు. ఇటీవల డెంగీ బారినపడిన ఆయన.. రక్తంలో ప్లేట్లేట్స్ పడిపోవడంతో సెప్టెంబర్‌ 18న ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని తాజాగా ఆయన టీమ్ తెలిపారు. ప్రస్తుతం అడివి శేష్‌ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఆయన త్వరితగతిన కోలుకోవాలంటూ నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు.

కలెక్టర్ కార్యాలయం ముందు మహిళా  ఆత్మహత్యాయత్నం

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం కొత్త వేసుకుప్పం గ్రామానికి చెందిన రమణమ్మ చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తమ గ్రామంలో అగ్రవర్ణాలకు చెందిన రైతులు తమను వేధింపులకు గురి చేయడమే కాకుండా దాడి చేస్తున్నారని ఇదే అంశంపై పలుమార్లు జిల్లా కలెక్టర్ కు, ఎస్పీలకు వినతి పత్రాలు సమర్పించినా న్యాయం జరగలేదని బాధిత మహిళ బంధువులు అంటున్నారు. మనస్తాపంతో ఇవాళ మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయం వద్ద పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఇది గమనించిన పోలీసు సిబ్బంది ఆమెను హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే 2018లో రమణమ్మ భర్త చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుని మృతి చేందారు.

మంచిర్యాలలో పిడుగు.. ఇద్దరు మృతి

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం జిల్లా కేంద్రంలో ఓ ఫ్లై ఓవర్‌‌పై నుంచి వెళ్తున్న ఓ బైక్‌పై పిడుగు పడింది. వర్షంలో ప్రయాణిస్తున్న ఒక చిన్న కుటుంబం అక్కడే చనిపోయింది. పిడుగు ధాటికి బైక్‌పై ప్రయాణిస్తున్న సదరు వ్యక్తి భార్య, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరోకరి పరిస్థితి విషమంగా ఉంది.

లిఫ్టులో చిక్కుకుపోయిన తెలంగాణ మంత్రి

తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి లిఫ్టులో చిక్కుకుపోయారు. మియాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ స్థిరాస్తి సంస్థ ఆఫీసు ప్రారంభానికి ఆయన వెళ్లారు. ఈ క్రమంలో పైకి లిఫ్టులో వెళ్తుండగా.. అది ఆగిపోయింది. దీంతో ఆయన కొద్దిసేపు లిఫ్ట్‌లోనే ఉండిపోయారు. లిఫ్ట్‌లో ఆయనతో పాటు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా ఉన్నారు. వెంటనే స్పందించిన పోలీసులు సాంకేతిక సిబ్బంది సాయంతో లిఫ్ట్‌ను తెరిచి మంత్రి, ఎమ్మెల్యేను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.

గన్ పార్క్‌కు రేవంత్ రెడ్డి.. శ్రేణులతో కలిసి ధర్నా

వైట్ ఛాలెంజ్‌లో భాగంగా రేవంత్‌ రెడ్డి గన్‌పార్కు వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్‌ శ్రేణులతో రేవంత్‌ గన్‌పార్కు వద్దకు వచ్చిన రేవంత్.. అమరవీరుల స్తూపం వద్ద  షబ్బీర్‌ అలీ సహా పలువురు ముఖ్యనేతలు, కార్యకర్తలతో కలిసి ధర్నా చేపట్టారు. మంత్రి కేటీఆర్ ఈ ఛాలెంజ్‌లో పాల్గొనాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. డ్రగ్స్‌ పరీక్షలకు నమూనాలు ఇచ్చేందుకు తాను సిద్ధమని.. మీరు ఇవ్వాలంటూ మంత్రి కేటీఆర్‌, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డికి రేవంత్‌ వైట్‌ ఛాలెంజ్‌ విసిరిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు గన్‌పార్కు వద్దకు వస్తే ఆస్పత్రికి వెళ్దామని కోరారు. దీంతో సవాల్‌ స్వీకరించినట్లు ఇప్పటికే ప్రకటించిన కొండా విశ్వేశ్వర్‌రెడ్ది కూడా అక్కడికి వచ్చారు.

మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ ప్రముఖుల భేటీ

టాలీవుడ్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్‌లు, ఎగ్జిబిటర్‌, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిథులు ఏపీ సచివాలయానికి చేరుకున్నారు. ఆన్‌లైన్ టికెటింగ్‌పై తమ వైఖరిని సినీ పెద్దలు ప్రభుత్వానికి స్పష్టం చేయనున్నారు. ప్రభుత్వంతో సమావేశానికి ముందు 13 జిల్లాల ప్రొడ్యూసర్‌లు డిస్ట్రిబ్యూటర్‌లు, ఎగ్జిబిటర్‌లు విజయవాడలో భేటీ అయ్యారు. ప్రభుత్వం తీసుకున్న ఆన్‌లైన్ టికెటింగ్ విధానానికి మద్దతు తెలుపుతూ తమకు ఉన్న అభ్యంతరాలను ప్రభుత్వానికి తెలుపనున్నారు. అగ్ర నిర్మాతలు దిల్ రాజు, అలంకార్ ప్రసాద్, డీవీవీ దానయ్య, సీ కళ్యాణ్, అదిశేషగిరావు, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మంత్రి పేర్ని నాని తదితరులు సమావేశానికి హాజరయ్యారు.

గన్ పార్క్‌కు బయలు దేరిన రేవంత్ రెడ్డి

మంత్రి కేటీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి మధ్య సాగుతున్న ట్విటర్ వార్ నేపథ్యంలో వైట్ ఛాలెంజ్ కోసం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. రేవంత్ కేటీఆర్‌కు విసిరిన చాలెంజ్‌ నేపథ్యంలోనే రేవంత్ గన్‌పార్క్‌కు బయలుదేరారు. ఇప్పటికే కొండా విశ్వేశ్వర రెడ్డి గన్‌పార్క్‌కు చేరుకున్నారు. మరికాసేపట్లో కేటీఆర్ విసిరిన సవాల్‌కు రేవంత్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉండబోతోందనే అంశంపై ఉత్కంఠ నెలకొని ఉంది.

రాకపోకల పునరుద్ధరణ: సీపీ

హైదరాబాద్‌‌లోని ట్యాంక్‌ బండ్‌పై వాహనాల రాకపోకలకు తిరిగి అనుమతించినట్లుగా హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ ప్రకటించారు. ఎన్టీఆర్‌ మార్గ్‌ నుంచి తెలుగు తల్లి ఫైఓవర్‌, ఖైరతాబాద్‌ వైపు వాహనాలు వెళ్లవచ్చని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ నుంచే కాకుండా రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్ల పరిధి నుంచి కూడా విగ్రహాల రద్దీ ఉన్నట్లు ఆయన చెప్పారు. అందువల్ల పీవీ నరసింహారావు మార్గ్‌లో గణపతి నిమజ్జన వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు సీపీ తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు ఆ వైపు కూడా క్లియర్‌ చేసి అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

 అఫ్గాన్ నుంచి విజయవాడకు డ్రగ్స్ అక్రమ రవాణా.. గుజరాత్ లో సీజ్


అఫ్గాన్ నుంచి విజయవాడకు డ్రగ్స్ అక్రమ రవాణా సాగుతున్నట్టు తెలుస్తోంది.  రూ.9వేల కోట్ల విలువైన హెరాయిన్ సీజ్ సీజ్ చేసినట్టు సమాచారం. గుజరాత్ పోర్టులో సీజ్ అధికారులు సీజ్ చేశారు. టాల్కం పౌడర్ పేరుతో కంటైనర్లలో తరలిస్తున్నట్టు తెలుస్తోంది.  ఇద్దరు అప్ఘాన్ వారితో సహా ఏడుగురిని అరెస్టు చేశారు.

కొనసాగుతున్న వినాయక నిమజ్జనం

హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనం కొనసాగుతూనే ఉంది. వేల సంఖ్యలో వినాయక విగ్రహాలు నిమజ్జనం కోసం బారులు తీరాయి. వర్షం కారణంగా నిమజ్జనం కాస్త ఆలస్యంగా జరుగుతోంది. ఎన్టీఆర్ మార్గ్‌, ట్యాంక్‌ బండ్‌పై గణనాథుడి ప్రతిమలు బారులు తీరాయి. ట్యాంక్‌బండ్‌పై 15 క్రేన్లు, ఎన్టీఆర్ మార్గ్‌లో 10, పీవీ నరసింహారావు మార్గ్‌లో 9, సంజీవయ్య పార్క్ వద్ద 2, జలవిహార్ వద్ద 1 క్రేన్ సాయంతో విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది. 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను ట్యాంక్‌ బండ్‌ వైపు, అంత కంటే తక్కువ ఉన్న వాటిని ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లేలా నిబంధనలు విధించారు.

108 వాహనంలోనే మహిళ ప్రసవం

నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గొడుకొండ్లకు చెందిన టేకుల మమత అనే మహిళ 108 వాహనంలోనే ప్రసవించింది. కుటుంబసభ్యులు కాన్పు కోసం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా.. వైద్యులు నల్గొండకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ క్రమంలోనే మార్గమధ్యలోనే మహిళ 108 వాహనంలో సాధారణ కాన్పు ద్వారా బిడ్డను ప్రసవించింది. అయితే, దేవరకొండలో వైద్యులు కాన్పు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Background

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ పేజీ అప్ డేట్ అవుతోంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.