Breaking News Live:   అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం... కారును ఢీకొన్న లారీ, నలుగురు మృతి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 30న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 30 Oct 2021 07:12 PM
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... కారును ఢీకొన్న లారీ, నలుగురు మృతి

అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం జోలపురం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. అనంతపురం నుంచి కదిరి వెళ్తోన్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. నాలుగేళ్ల చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడింది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులు ఉన్నారు. బత్తలపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

అల్లవరం ఎమ్మార్వో ఆఫీసులో కరోనా కలకలం

తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలం తహశీల్దార్  కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. తహశీల్దార్ తో పాటు ప్రైవేటు  డ్రైవర్, అటెండర్, టైపిస్ట్, వీఆర్వోకు కరోనా సోకింది. దీంతో మిగిలిన ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. 

విజయవాడకు చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఏపీలో వారం రోజుల పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దళాలు ఉపరాష్ట్రపతికి గౌరవ వందనం చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్‌కి ఉపరాష్ట్రపతి వెంకయ్య బయలుదేరారు. నేటి నుంచి వారం రోజుల పాటు ఏపీలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నారు.

విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో పట్టివేత​​​​​​​

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో గంజాయి పట్టుబడింది. కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో 54 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించిన రైల్వే పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆరుగురిని అరెస్టు చేశారు. విశాఖ ఏజెన్సీ నుంచి ఒడిశా, ముంబయికి గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. 

పునీత్ పార్థివదేహం వద్ద కన్నీరు పెట్టుకున్న బాలకృష్ణ

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్..శుక్రవారం గుండెపోటు తో మరణించారు. పునీత్ మరణ వార్త యావత్ చిత్రసీమను శోక సంద్రంలో పడేసింది. ప్రస్తుతం ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియం వద్ద పునీత్ పార్థివ దేహాన్ని ఉంచారు. నిన్నటి నుంచి కూడా స్టేడియం అంత కూడా అభిమానులతో నిండిపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి పలువురు పునీత్ ను కడసారి చూసేందుకు బయలు దేరారు. కొద్దిసేపటి క్రితం నందమూరి బాలకృష్ణ పునీత్ రాజ్​కుమార్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుదేవా, దగ్గుబాటి రాణా... పునీత్ పార్థివ దేహానికి నివాళులర్పించారు.

షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ విడుదల

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అగ్ర హీరో షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్‌పై ఎట్టకేలకు విడుదలయ్యాడు. ఈ కేసులో ఆయనకు గురువారమే బెయిల్ లభించింది. ఉత్తర్వులు శుక్రవారం విడుదల అయ్యాయి. అవి కూడా సకాలంలో జైలు అధికారులకు అందలేదు. ఈ ప్రక్రియ ఆలస్యం కావడంతో శనివారం ఉదయం ఆర్యన్‌ను జైలు నుంచి బయటకు పంపారు. అతణ్ని ఇంటికి తీసుకెళ్లేందుకు షారూఖ్ ఖాన్ స్వయంగా ఆర్థర్ రోడ్డు జైలుకు వచ్చారు.

పునీత్ ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేక గుండెపోటుతో అభిమాని మృతి

కన్నడ పవర్​స్టార్ పునీత్​రాజ్​ కుమార్ మరణం.. తీవ్రశోకాన్ని మిగిల్చింది. పునీత్ ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోయిన ఓ అభిమాని కూడా గుండెపోటుతో మృతి చెందారు. కర్ణాటకలోని మరూర్​ గ్రామానికి చెందిన మునియప్ప(28) రైతు. శుక్రవారం మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వచ్చిన అతడు.. హీరో పునీత్​ రాజ్​కుమార్ మరణ వార్తను టీవీలో చూసి తట్టుకోలేకపోయాడు. షాక్​తో అక్కడికక్కడే గుండెపోటుతో కిందపడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో ప్రాణాలు వదిలేశాడు.

Background

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో నిన్న కన్నుమూసిన విషయం తెలిసిందే. 46 ఎళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోయిన ఆయన పార్థీవదేహాన్ని నిన్న సాయంత్రం ఇంటికి తరలించారు. అక్కడి నుంచి అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అక్కడ ఇసుక వేస్తే రాలనంత మంది జనాలు ఆయన భౌతిక కాయాన్ని చివరిసారిగా చూసి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు సైతం ఆయనకు నివాళులు అర్పించడానికి బెంగుళూరు బయలుదేరారు.


అయితే పునీత్ అంత్యక్రియలకు సంబంధించిన వివరాలని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. పునీత్ పెద్ద కుమార్తె వందిత ప్రస్తుతం యూఎస్ లో ఉంది. శనివారం ఆమె యూఎస్ నుంచి తిరిగి రానుంది. ఆమె వచ్చిన తర్వాతే పునీత్ అంత్యక్రియల ప్రక్రియ ప్రారంభిస్తాం అని కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్. అశోక్ ప్రకటించారు. పునీత్ తండ్రి రాజ్ కుమార్ సమాధి పక్కనే ప్రభుత్వలాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తాం అని ప్రకటించారు.


శుక్రవారం ఉదయం 11:30 గంటల సమయంలో జిమ్​లో వ్యాయామం చేస్తున్న సమయంలో పునీత్​కు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఆస్ప్రత్రిలో చేర్చారు. కానీ వైద్యులు అతడి ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈ విషయం తెలియగానే పలు భాషలకు చెందిన నటీనటులు.. సంతాపం వ్యక్తం చేశారు. అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పునీత్ మరణంతో కర్ణాటకలో హైలర్ట్​ ప్రకటించారు. సినిమా థియేటర్ల మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.


కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ చిన్న కుమారుడిగా పునీత్‌ రాజ్‌కుమార్‌ చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. అభిమానులు మాత్రమే కాదు... చిత్రసీమ ప్రముఖులు సైతం ఆయన్ను 'అప్పు' అని ముద్దుగా పిలుస్తారు. పునీత్‌ హీరోగా పరిచయమైన తొలి సినిమా పేరు 'అప్పు'. దానికి దర్శకుడు పూరి జగన్నాథ్‌. అప్పటికి తెలుగులో ఆయన 'బద్రి', 'బాచి', 'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం' సినిమాలు చేశారు. 'తమ్ముడు'ను రీమేక్‌ చేసే అవకాశం రావడంతో... కన్నడలో శివ రాజ్‌కుమార్‌తో చేశారు. అప్పుడు పూరి జగన్నాథ్‌ను తన తమ్ముడి కోసం కథ ఏమైనా ఉందా? అని శివ రాజ్‌కుమార్‌ అడగటంతో 'అప్పు' చేశారు. అదే కథతో తెలుగులో 'ఇడియట్‌' చేశారు పూరి. ఒక్క 'ఇడియట్‌' మాత్రమే కాదు... 'రెడీ', 'ఒక్కడు', 'దూకుడు' సినిమాలను కన్నడలో రీమేక్‌ చేశారు పునీత్‌ రాజ్‌కుమార్‌. 


పునీత్‌ తండ్రి, కన్నడ ప్రజలు దైవంగా కొలిచే కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌తో నందమూరి, కొణిదెల, మంచు కుటుంబాలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారితో పునీత్ స్నేహపూర్వకంగా ఉంటారు. బాలకృష్ణ కోసం 'గౌతమిపుత్ర శాతకర్ణి'లో పునీత్‌ అన్నయ్య శివ రాజ్‌కుమార్‌ అతిథి పాత్ర చేశారు. ఓ స్టార్‌ వారసుడు అయినప్పటికీ... ఒదిగి ఉండటం పునీత్‌కు అలవాటు. అందుకు ఉదాహరణగా ఓ సంఘటన చెప్పుకోవాలి. ఆయన చివరి సినిమా 'యువరత్న' తెలుగులోనూ విడుదలైంది. అప్పుడు హైదరాబాద్‌ వచ్చారు. 'పవర్‌స్టార్‌' అని పిలిస్తే... 'పవర్‌స్టార్‌ అంటే ఎప్పుడూ పవన్‌కల్యాణే. నన్ను పునీత్‌ రాజ్‌కుమార్‌ అంటే చాలు' అని వినమ్రంగా చెప్పారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.